Byreddy Shabari Politics: ఏపీలో యువ మహిళా నేతల్లో బైరెడ్డి శబరి(Byreddy Shabari) ఒకరు. ఆమె ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటం. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా తెరపైకి వచ్చారు. అనూహ్యంగా ఆమెకు అవకాశం కల్పించారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే ఎంపీగా తనకంటూ ఒక ముద్ర చాటుకుంటున్నారు. పార్లమెంటులో మంచి గుర్తింపు పొందారు. అయితే జాతీయ రాజకీయాల్లో రాణిస్తున్న ఆమె.. గల్లీ రాజకీయాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో ముద్ర చాటుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యేలతో సఖ్యత లేకపోవడం ఆమెకు మైనస్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రమాదం చేస్తుందని ఆ పార్టీ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. అయితే ఇప్పటికే టిడిపి నాయకత్వం దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. కానీ రోజురోజుకు నంద్యాల పార్లమెంట్ పరిధిలోని.. ఎమ్మెల్యేలతో ఆమెకు విభేదాలు తారాస్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఆది నుంచి టిడిపి తోనే..
బైరెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో( Telugu Desam Party) విడదీయరాని బంధం. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టిడిపిలోనే సుదీర్ఘకాలం కొనసాగారు. అయితే టిడిపి నాయకత్వంతో విభేదించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లారు. అక్కడ కూడా ఎక్కువ కాలం ఉండలేకపోయారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో రాయలసీమ అస్తిత్వం కోసం పోరాడారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. తెలంగాణలో కర్నూలు జిల్లాను కలపాలని గట్టిగానే వాయిస్ వినిపించారు. ఈ క్రమంలో అప్పట్లో కేసులకు గురయ్యారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కొద్దిరోజుల పాటు జైల్లోనే ఉండిపోయారు. అప్పుడే బయట ప్రపంచంలో అడుగు పెట్టారు శబరి. తండ్రి తరఫున బలమైన వాయిస్ వినిపించారు.
Also Read: పాపం చెవిరెడ్డి.. ఇక బయటకు కష్టమేనట?
అనూహ్యంగా ఎంపీగా..
అనూహ్యంగా బైరెడ్డి శబరి భారతీయ జనతా పార్టీలో( Bhartiya Janata Party) చేరారు. నంద్యాల జిల్లాకు అధ్యక్షురాలు అయ్యారు. మంచి వాగ్దాటి, చరిస్మ కలిగిన ప్రత్యేకతలు ఉండడంతో ఆమెకు గుర్తింపు లభించింది. అయితే అనూహ్యంగా 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏకంగా నంద్యాల పార్లమెంట్ సీటు దక్కించుకున్నారు. మంచి మెజారిటీతో ఎంపీగా గెలిచారు. తన పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లను టిడిపి కూటమి దక్కించుకుంది. ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టిన శబరి రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగానే వాయిస్ వినిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం శబరిని అభినందించిన సందర్భాలు ఉన్నాయి. అయితే అటువంటి ఆమె రాజకీయంగా తప్పటడుగులు వేయడంతో.. సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇది ఆమె రాజకీయ భవిష్యత్తుకు ఎంత మాత్రం ఉపయోగపడదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: మోడీ బాటలోనే బాబు.. రైతులకు ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడంటే?
ఆ భయంతో ఎమ్మెల్యేలు..
నంద్యాల (Nandyala) పార్లమెంట్ స్థానం పరిధిలో ఆళ్లగడ్డ, డోన్, నందికొట్కూరు, నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో పాణ్యం, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మహిళా నేతలు గౌరు చరిత, భూమా అఖిలప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే బైరెడ్డి శబరి స్వతంత్రంగా నడుచుకుంటూ.. తన పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు . ఇది రాజకీయంగా తమకు చేటు తెచ్చి పెడుతుందని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. అందుకే శబరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో అడుగుపెడుతుంటే అడ్డు తగులుతున్నారు. ఈ క్రమంలోనే వివాదాలు తలెత్తుతున్నాయి.