Annadata Sukhibhava Scheme 2025: ఏపీలో( Andhra Pradesh) అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ముహూర్తం ఫిక్స్ అయింది. కేంద్రం అందించే పీఎం కిసాన్ నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం మొత్తాన్ని విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో అన్నదాత సుఖీభవ విషయంలో ఒక స్పష్టత రాలేదు. అయితే త్వరలో బీహార్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ప్రధాని మోదీ ఆ రాష్ట్రంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మరోసారి అక్కడ ఎన్డీఏ అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 20న బీహార్ వెళ్లనున్నారు ప్రధాని మోదీ. అక్కడకు రెండు రోజులు ముందే పీఎం కిసాన్ అందించేందుకు ముహూర్తంగా నిర్ణయించారు. అదే రోజు అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అధికారంలో వచ్చిన ఏడాదికి..
అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు సాగు సాయం కింద 20 వేల రూపాయలు అందిస్తానని చంద్రబాబు ( CM Chandrababu) హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకంలో భాగంగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ సైట్ తెరిచారు. దీంతో తప్పకుండా అమలు చేస్తారని అంతా భావించారు. కానీ అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతూ వచ్చింది. అయితే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తుండడం, ప్రజల్లో సైతం చిన్నపాటి ప్రశ్నలు ఎదురు కావడంతో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కేంద్రం అందించే మూడు విడతల సాయంతో పాటే రాష్ట్ర ప్రభుత్వ వాటా అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 14 వేల రూపాయలను మూడు విడతల్లో అందించేందుకు నిర్ణయం తీసుకుంది. తొలి, రెండో విడతల్లో రూ.5000 చొప్పున, మూడో విడతలో రూ.4000 చొప్పున.. అందించి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.14000 ఇచ్చేందుకు నిర్ణయించింది.
Also Read: రూ.100తో ఆస్తి రిజిస్ట్రేషన్లు! వెంటనే త్వరపడండి
సాయం పెంచిన టిడిపి సర్కార్..
గతంలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం రైతు భరోసా పేరిట ఈ పథకం అమలు చేసేది. అయితే కేంద్రం అందించే 6000 రూపాయలకు తోడుగా.. కేవలం రూ.7500 అందించి చేతులు దులుపుకుంది. కానీ కూటమి సర్కార్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 14 వేల రూపాయలు అందించడానికి డిసైడ్ అయింది. త్వరలో మూడు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సైతం మిత్రపక్షాలను కలుపుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా బీహార్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈనెల 20న ప్రధాని మోదీ బీహార్లో పర్యటించనున్నారు. అంతకంటే ముందే పిఎం కిసాన్ నిధులు విడుదల చేసి దేశ వ్యాప్తంగా సానుకూలత పెంచాలని భావిస్తున్నారు. ఈనెల 18న పీఎం కిసాన్ నిధులు విడుదల చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసేందుకు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది.
Also Read: త్వరలో మరో 70 అన్న క్యాంటీన్లు.. ఎక్కడెక్కడంటే?
అర్హులు వీరే
అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) పథకానికి సంబంధించి ఏపీలో 47.77 లక్షల మంది రైతులు అర్హులుగా తేల్చారు అధికారులు. వీరందరికీ ఈ కేవైసీ పూర్తి కావడంతో అర్హులుగా నిర్ధారించారు. ఒకవేళ ఎవరైనా ఈ కేవైసీ చేయించకపోతే మాత్రం అనార్హులుగా తేలే అవకాశం ఉంది. వెబ్ ల్యాండ్ లో నమోదైన రైతుల భూమి వివరాలు కచ్చితంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. అలా నమోదైన వారికి అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత కల్పిస్తామంటున్నారు. ఒకవేళ వివిధ కారణాలతో రిజెక్ట్ అయితే మరోసారి వారికి అవకాశం కల్పిస్తామని.. సాంకేతిక కారణాలు సరి చేసుకుంటే అర్హత జాబితాలో చేర్చుతామంటున్నారు.