https://oktelugu.com/

Vijaysai Reddy: బిజెపిలోకి విజయసాయిరెడ్డి.. లెక్క అదే

2019లో టిడిపికి ఓటమి ఎదురైంది. వైసిపి 151 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికలకు ముందు ఎన్ డి ఏ ను విభేదించారు చంద్రబాబు. మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ తో చేతులు కలిపారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 16, 2024 / 12:43 PM IST

    Vijaysai Reddy

    Follow us on

    Vijaysai Reddy: వైసీపీ కీలక నేత బిజెపిలో చేరుతున్నారా? ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా? కాషాయ దళంతో టచ్ లోకి వచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో వైసీపీకి ఘోర పరాజయం ఎదురయింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. మరోవైపు గత ఐదు సంవత్సరాలుగా వైసిపి ప్రభుత్వ నిర్ణయాలపై టిడిపి సర్కార్ పునసమీక్షిస్తోంది. దీంతో తమకు కేసులతో ఇబ్బందులు తప్పవని వైసీపీ నేతలు భయపడుతున్నారు. కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఈ తరుణంలోనే వైసీపీలో నెంబర్ 2 గా ఎదిగిన విజయసాయిరెడ్డి బిజెపిలో చేరతారని ప్రచారం ప్రారంభమైంది. గతంలో ఓటమి ఎదురు కావడంతో చంద్రబాబు ఎటువంటి ఆలోచన చేశారో.. ఇప్పుడు జగన్ సైతం అదే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

    2019లో టిడిపికి ఓటమి ఎదురైంది. వైసిపి 151 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికలకు ముందు ఎన్ డి ఏ ను విభేదించారు చంద్రబాబు. మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ తో చేతులు కలిపారు. జాతీయస్థాయిలో ప్రచారం కూడా చేశారు. కానీ ఆ ఎన్నికల్లో టిడిపికి ఎదురుదెబ్బ తప్పలేదు. అయితే ఓటమి ఎదురైన తర్వాత తనకు ఇబ్బందులు తప్పవని చంద్రబాబు గ్రహించారు. కేంద్ర పెద్దలకు తనపై కోపం రాకుండా జాగ్రత్త పడ్డారు. టిడిపిలో ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపి వైపు మళ్ళించారు. ఇప్పుడు అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు జగన్. కొంతమంది రాజ్యసభ సభ్యులను బిజెపి వైపు పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో బిజెపి ఇప్పుడు లేదు. దీంతో వైసిపి ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయా చూడాలి.

    ప్రస్తుతం రాజ్యసభలో వైసిపికి 11 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో అనుకున్న స్థాయిలో బిజెపి మెజారిటీ సాధించలేదు. మూడోసారి అధికారంలోకి రావడంతో రాజ్యసభలో సభ్యులు కీలకం. అయితే మరో ఆరు నెలల్లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ బిజెపితో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు వస్తుంది. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి బిజెపిలోకివెళతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే అది అధినేత జగన్ ఆదేశాల మేరకా? లేకుంటే సొంత నిర్ణయమా? అన్నది తెలియాల్సి ఉంది. విజయ్ సాయి రెడ్డి చుట్టూ ఇప్పుడు వివాదాలు చాలా బయటపడుతున్నాయి. మద్యం కుంభకోణంతో పాటు విశాఖలో భూ ఆక్రమణలు వంటి వాటి విషయంలో విజయ్ సాయి రెడ్డి పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వైసీపీలో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కానీ ఇప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు కీలకం కావడంతో.. విజయసాయిరెడ్డి ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయా? కావా? అన్నది చూడాలి. ఎన్నికల ఫలితాల అనంతరం విజయసాయిరెడ్డి సైలెంట్ అయ్యారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీనిపై ఆయన ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.