Kadambari Jetwani: ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో కీలక మలుపు. ఆమె అరెస్టుకు కారణం అని చెబుతున్న భూవ్యవహారం కొత్త మలుపునకు దారితీసింది. ఓ భూ వ్యవహారానికి సంబంధించి ఫోర్జరీ పత్రాలు సృష్టించి విక్రయించేందుకు సిద్ధపడ్డారు అన్నది జెత్వానిపై ఉన్న ఫిర్యాదు. అది తన భూమి అని.. మోసం చేసి నాగేశ్వర రాజు, భరత్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులకు అమ్మ జూపారని ఆరోపిస్తూ కుక్కల విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతోనే ముంబై వెళ్లి జెత్వానితో పాటు తల్లిదండ్రులను విజయవాడ పోలీసులు తీసుకొచ్చారు.జెత్వానికి కస్టడీకి పంపారు.
అయితే తాజాగా ఈ ఇష్యూ బయటకు రావడంతో.. జెత్వాని నుంచి భూమి కొనుగోలు చేశారని భావిస్తున్న నాగేశ్వరరాజు, భరత్ కుమార్ తెరపైకి వచ్చారు. అసలు ఈ ఘటనతో తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. విద్యాసాగర్ తో పాటు ఆయన పిఏ తమను ఇరికించారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఏకంగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు. దీంతో ఇది కొత్త మలుపు తిరిగినట్లు అయ్యింది. అప్పట్లో ఒక పగడ్బందీ ప్లాన్ ప్రకారం ముంబై నటిని కేసుల్లో ఇరికించారని అర్థమవుతోంది. కేవలం ముంబైలో పారిశ్రామికవేత్త కుమారుడి పై పెట్టిన కేసును విత్ డ్రా చేయించేందుకే ముంబై నటిపై అక్రమ కేసు పెట్టినట్లు అర్థమవుతోంది.
* ఫోర్జరీ పత్రాలతో భూ అమ్మకం
కుక్కల విద్యాసాగర్ తండ్రి నాగేశ్వరరావు కృష్ణాజిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండేవారు. వీరిది వ్యాపార కుటుంబం. ఆపై అధికార పార్టీ కావడంతో ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉండేవి. ఆపై పారిశ్రామికవేత్తలతో సత్సంబంధాలు ఉంటాయి. ఈ తరుణంలోనే జగ్గయ్యపేటలో తన ఐదు ఎకరాల భూమిని జెత్వానికి విక్రయించినట్లు ఆమె ఫోర్జరీ పత్రాలు రూపొందించారు అన్నది విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు సారాంశం. అయితే ఆ వివాదాస్పద భూమిని కొనుగోలు చేసిన వారు పేర్లు నాగేశ్వర రాజు, భరత్ కుమార్ గా చూపారు. వీరి నుంచి జెత్వాని అడ్వాన్స్ రూపంలో ఐదు లక్షలు తీసుకున్నారని కూడా చెప్పుకొచ్చారు. ఈ కేసులో సాక్షులు కూడా వారే. అప్పట్లో వీరి వాంగ్మూలాన్ని పోలీసులు సేకరించారు. అయితే తాజాగా మీరు పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. తమకు ఎవరు భూమిని అమ్మ చూపలేదని.. తాము ఎవరికి అడ్వాన్స్ కూడా ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
* టీటీడీ దర్శనాల కోసం ఆధార్ కార్డులు ఇస్తే
తాజాగా తెరపైకి వచ్చిన నాగేశ్వరరాజు కు భరత్ కుమార్ స్వయానా అల్లుడు. వీరు అప్పట్లో వైసీపీలో ఉండేవారు. కృష్ణాజిల్లా మొవ్వ మండలం కోసూరు గ్రామానికి సర్పంచ్ గా వ్యవహరిస్తుండేవారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న కుక్కల నాగేశ్వరరావుతో వీరికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి గాను వీరు జడ్పీ చైర్మన్ ను ఆశ్రయించారు. ఆ సమయంలో తాము ఆధార్ కార్డులు జిరాక్స్ లు ఇచ్చామని.. అవే జిరాక్సులతో ఈ కేసులో తమను ఇరికించారని ఆ ఇద్దరు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో విద్యాసాగర్ తో పాటు ఆయన పిఏ శ్రీనివాసరావు ప్రమేయం ఉందని.. సమగ్ర దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని వారు కోరారు.
* తాజాగా పోలీసులకు ఫిర్యాదు
తాజాగా ముంబై నటి వ్యవహారం బయటపడటంతో ఆ ఇద్దరి పేర్లు బయటికి వచ్చాయి. మీడియాలో ఇద్దరి పేర్లు వైరల్ కావడంతో ఆందోళనతో తాము ముందుకు వచ్చినట్లు ఆ ఇద్దరు చెబుతున్నారు.’ నేను, నా అల్లుడు భరత్ కుమార్ ముంబై నటి నుంచి ఐదు ఎకరాలు కొన్నట్టు, ఐదు లక్షలు అడ్వాన్స్ గా చెల్లించినట్టు మా ఆధార్ కార్డులను ఉపయోగించి నకిలీ పత్రాలు సృష్టించారు. ఆ విషయం మాకు ఇబ్రహీంపట్నం పోలీసులు, మీడియా ద్వారా తెలిసింది. మేం ఆ భూమిని కొనలేదు. అడ్వాన్స్ ఇవ్వలేదు. విద్యాసాగర్, శ్రీనివాసరావు కలిసి మమ్మల్ని ఆ వ్యవహారంలో ఇరికించారు. వారు చేసిన పనికి మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది. వారిద్దరిపై చర్యలు తీసుకోండి. ఈ వ్యవహారంతో మాకు సంబంధం లేదు. మాకు న్యాయం చేయండి’ అని వారిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరుగా విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు అందించారు. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగినట్లు అయ్యింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Unexpected angle in mumbai actress kadambari jethwani case
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com