AP Government: రాష్ట్ర విభజనం చట్టంలో భాగంగా ఇటీవల పలువురు ఐఏఎస్‌లు ఏపీకి వెళ్లాల్సివచ్చింది. తాము తెలంగాణలోనే కొనసాగుతామని వారు పెట్టుకున్న అభ్యర్థనను అటు కాగ్, ఇటు హైకోర్టు తిరస్కరించింది. దాంతో వారికి మరో దారి లేకుండా ఏపీకి వెళ్లి రిపోర్టు చేశారు. అయితే.. వారు తెలంగాణలో కీలక హోదాల్లో ఉండిపోయారు. దాంతో వారిని మళ్లీ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీకి లేఖ రాసినట్లుగా తెలిసింది. తిరిగి తెలంగాణ పంపించాలని రెక్వెస్ట్ లెటర్ పెట్టారు.
ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌లలో ఆమ్రపాలి మీదనే చర్చ కొనసాగుతోంది. ఆమె తెలంగాణ క్యాడర్‌లో ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆమెకు ఈ కీలక పోస్టు ఇచ్చారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అనతికాలంలో ఆమె పాలనలో తన మార్క్ చూపించారు. కొన్ని ప్రక్షాళనలు సైతం చేశారు. దాంతో బద్ధకంగా ఉన్న ఆఫీసర్లు కూడా యాక్టివ్ మోడ్‌లోకి రావాల్సి వచ్చింది. విభజన చట్టం క్రమంలో ఏపీకి వెళ్లిన ఆమ్రపాలికి ఇంకా ఎలాంటి పోస్టు ఇవ్వలేదు. ఆమెకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి పోస్టు ఇస్తుందా అన్న చర్చనే ఆసక్తికరంగా జరుగుతోంది. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కావడంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీలో పోస్టింగ్ ఉంటుందని చాలా మంది అంటున్నారు. మొదటి రోజు నుంచి కూడా అదే ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. విజయవాడ కమిషనర్, గ్రేటర్ విశాఖ కమిషన్ వంటి పోస్టులకూ కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం వినిపిస్తోంది.
అమ్రపాలికి ఉన్న ఇమేజ్‌తో ఇలాంటి చర్చ జరుగుతోంది. మరోవైపు.. కాట ఆమ్రపాలి ఎక్కువ కాలం విశాఖలోనే గడిపారు. ఆమె చదువులు కూడా అక్కడే కొనసాగాయి. దాంతో ఆమెకు విశాఖతో చిన్ననాటి నుంచే అనుబంధం ఉంది. అంతేకాకుండా.. యూపీఎస్సీకి దరఖాస్తు చేసే సమయంలోనూ ఆమె పర్మినెంట్ అడ్రస్‌ను విశాఖ అని పేర్కొన్నారు. దాంతో కేంద్రం కూడా ఆమెను ఏపీ క్యాడర్‌కు కేటాయించింది. దాంతో ఇప్పుడు ఒకవేళ ఏపీ ప్రభుత్వం విశాఖ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగిస్తే అక్కడికి వెళ్లే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. అయితే.. అధికారులకు బాధ్యతలు అప్పగించడంలో చంద్రబాబు స్ట్రాటజీ వేరు. ఏ అధికారిని ఎక్కడికి వేయాలి.. ఎవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి.. ఎవరిని ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి. అందుకే.. ఆమ్రపాలి విషయంలోనూ ఇంకా దీర్ఘాలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆమె పోస్టింగ్ విషయంలో ఆలస్యం జరుగుతున్నట్లుగా ప్రచారం నడుస్తోంది. తెలంగాణ నుంచి వెళ్లిన ఐఏఎస్‌లలో కేవలం ఆమ్రపాలి గురించి చర్చనే కొనసాగుతుండడం ఆసక్తి కలిగిస్తోంది. ఇంత డైనమిక్ ఆఫీసర్‌కు ఇంకా బాధ్యతలు అప్పగించకపోవడంపైనా చర్చ నడుస్తోంది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం రెక్వెస్ట్ మేరకు తెలంగాణ ఏమైనా పంపిస్తారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీలోనే కొనసాగిస్తే ఇప్పటికే బాధ్యతలు ఇచ్చేవారు కదా అన్న చర్చ ఇటు తెలంగాణ సెక్రెటేరియట్‌లో నడుస్తోంది.