Photovoltaics: సోలార్ ప్యానెల్ కు కాలం చెల్లినట్లేనా.. భవిష్యత్ అంతా ఫోటో వోల్టాయిక్స్ దేనా? అసలేంటి వ్యవస్థ?

త్వరలో ఫోటో వోల్టాయిక్ స్ప్రే మార్కెట్లోకి రానుంది. దీనిని మన ఇంటి గోడలకు స్ప్రే చేస్తే చాలు గోడల నుంచి కూడా విద్యుత్ పొందవచ్చు.

Written By: Rocky, Updated On : October 24, 2024 4:04 pm

Spray-on Photovoltaics

Follow us on

Spray-on Photovoltaics : కొత్త ఒక వింత.. పాత ఒక రోత అంటారు.. ఏదైనా వినూత్నమైన ఆవిష్కరణ.. మన ప్రపంచ గమనాన్నే మార్చివేస్తుంది.. విద్యుత్ శక్తి అలానే పుట్టింది. దాని ద్వారానే ప్రపంచం నడుస్తుంది. అదో గొప్ప ఆవిష్కరణగా ఈ భూమిపై ఆవిష్కృతమైంది. కరెంట్ ను మించి గొప్ప ఆవిష్కరణే లేదు. కానీ ఈ కరెంట్ ఉత్పత్తికి కాలుష్యం అధికమవుతుంది. దాన్ని తగ్గించే గొప్ప సాంకేతికతకు తాజాగా పురుడు పోశారు. అదో గొప్ప సంస్కరణగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అదే ‘ఫొటో వోల్టాయిక్స్ ’.. అసలేంటి టెక్నాలజీ.. సోలార్ ప్యానెల్ లను మించి ఇది ఎలా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది.? అసలు దీని కథ ఏంటనేదానిపై స్పెషటల్ స్టోరీ

ప్రస్తుత కాలంలో విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. ఇది వివిధ మార్గాల్లో ఉత్పత్తి చేయబడుతుంది. నీరు, బొగ్గు, వాయు వ్యవస్థల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న సంగతి తెలిసిందే. వాటి ద్వారా వచ్చే కరెంట్ కు మనమే బిల్లులు చెల్లించాలి. అలాగే కరెంట్ బిల్లులు కూడా బాగా పెరిగాయి. వాటిని నివారించేందుకు సౌర వ్యవస్థ మంచి ఎంపిక. అలాగే, ఈ రోజుల్లో సోలార్ సిస్టమ్ వాడకం చాలా పెరిగింది. దీని ద్వారా కరెంట్‌ బిల్లుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే త్వరలో సోలార్ ప్యానెల్లకు కూడా కాలం చెల్లనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఫోటో వోల్టాయిక్ స్ప్రే మార్కెట్లోకి రానుంది. దీనిని మన ఇంటి గోడలకు స్ప్రే చేస్తే చాలు గోడల నుంచి కూడా విద్యుత్ పొందవచ్చు. రాబోయే కాలం మొత్తం ఇదే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఫోటో వోల్టాయిక్ స్ప్రే గురించి వివరంగా తెలుసుకుందాం.

ఫోటోవోల్టాయిక్ (PV) సిలికాన్‌తో కూడిన సౌర ఘటాలపై ఆధారపడి ఉంటాయి. సిలికాన్‌ను సిలికాన్ నైట్రేట్‌తో తయారు చేసిన సన్నని యాంటీ రిఫ్లెక్టివ్ పూతతో తయారు చేస్తారు. ఇది సూర్యరశ్మిని సేకరించి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ టెక్నాలజీని నిర్మించడానికి, ఇన్‌స్టాల్ చేయడానికి కాస్త ఎక్కువే ఖర్చు అవుతుంది. ఎందుకంటే సూర్యరశ్మిని సేకరించేందుకు హైడ్రోజన్ ప్లాస్మాను ఉపయోగించాల్సి ఉంటుంది. సన్నని-ఫిల్మ్ ఫోటోవోల్టాయిక్ (PV)లను తయారు చేసే ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుంది. అందుకే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మేఘావృతమైన రోజు కూడా స్ప్రే-ఆన్ సోలార్ సెల్స్ సోలార్ టెక్నాలజీ సూర్యకిరణాలను విద్యుత్ శక్తిగా మార్చగలదు. ప్రస్తుతం ఈ సాంకేతికత అభివృద్ధి దశలో ఉంది. త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.

స్ప్రేడ్ సోలార్ సెల్స్ ఎలా పని చేస్తాయి?
స్ప్రే-ఆన్ సోలార్ సెల్స్ నానోటెక్నాలజీని ఉపయోగిస్తాయి. ఈ కణాలు క్వాంటం డాట్‌ల ద్వారా తయారయ్యాయి. ఇది క్వాంటం మెకానిక్స్ నియమాలను ఉపయోగించి తయారు చేసిన నానోక్రిస్టల్స్. అవి అత్యంత సమర్థవంతమైన సౌర ఘటాలు, లేజర్‌లు, ట్రాన్సిస్టర్‌లు మొదలైన వాటికి అలాగే వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశోధనా రంగానికి ప్రధాన కేంద్రాలుగా మారాయి. పరిశోధకులు ప్రత్యేకంగా రూపొందించిన ఈ క్వాంటం డాట్‌లను పాలిమర్‌తో కలిపి ఇతర పదార్థాలపై స్ప్రే చేస్తారు. గతంలో స్ప్రే-ఆన్ సోలార్ సెల్స్‌ను ఫ్లాట్ వస్తువులపై మాత్రమే స్ప్రే చేయవచ్చని పరిశోధకులు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇప్పుడు వంకర వస్తువులపై కూడా స్ప్రే చేసే మార్గాలను కనుగొంటున్నారు. దీంతో పోర్టబుల్ ఎనర్జీని పొందే అవకాశం లభించింది. స్ప్రే-ఆన్ సోలార్ సెల్స్‌తో పూసిన టీ-షర్టును స్మార్ట్‌ఫోన్‌ రీచార్జీ చేసుకునేందుకు.. కారు ఉపరితలం పై స్ప్రే చేయడం ద్వారా కారు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు.

ఇతర దేశాలకు ఎగుమతి
సౌర ఘటాల తయారీదారులు అమెరికాలో వినియోగించే శక్తిలో 15 శాతం ఫోటోవోల్టాయిక్ (PV) సాంకేతికత నుండి వస్తుందని అంచనా వేస్తున్నారు. 2030 నాటికి యునైటెడ్ స్టేట్స్ నేషనల్ సెంటర్ ఫర్ ఫోటోవోల్టాయిక్స్ (NCPV) సౌరశక్తిని వినియోగించి దేశంలోని 10 శాతం విద్యుత్తును అత్యధికంగా ఉత్పత్తి చేసే సమయాల్లో ఇతర దేశాలకు ఎగుమతి చేయాలనుకుంటుంది. దీనిని సోలార్ పెయింట్ అని కూడా పిలుస్తారు. ఇది సాధారణ పెయింట్ లాగా పనిచేసే పెయింట్, కానీ విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పైకప్పు మాత్రమే కాకుండా మొత్తం భవనాన్ని సౌర శక్తిని ఉత్పత్తి చేసే ఉపరితలంగా మార్చగల సామర్థ్యం? దీనికి ఉంది.

గోడకు పెయింటింగ్‌ని పోలి ఉండే సౌలభ్యం కారణంగా పునరుత్పాదక శక్తిలో ఇది అత్యంత ఆశాజనకమైన అభివృద్ధిలో ఒకటిగా భావిస్తున్నారు. ఉపరితల వైశాల్యాన్ని సౌర విద్యుత్ జనరేటర్‌గా మార్చగల సామర్థ్యం దీని గొప్ప ప్రయోజనాల్లో ఒకటి. అందువల్ల ఇంటి పైకప్పులు, గోడలు, తలుపులు, కిటికీలు వంటి శక్తిని ఉత్పత్తి చేసే నిర్మాణాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇది పట్టణ రూపకల్పనకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. స్ప్రే-ఆన్ ఫోటోవోల్టాయిక్స్ అనేవి ప్రజల జీవితాన్ని సులభతరం చేసే గేమ్-ఛేంజర్ అని చెప్పుకోవచ్చు. ఇది భవనాలు, గృహాలకు మాత్రమే కాకుండా వాహనాలకు కూడా ఉపయోగపడుతుంది .