Trump Tariffs: ట్రంప్( American President Donald Trump) దెబ్బకు ఏపీలో రొయ్యల రేట్లు అమాంతం పడిపోయాయి. మీరు చదివింది నిజమే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై 26% సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆహార ఉత్పత్తులు, ఎగుమతులకు సంబంధించి పన్నులు పడడంతో ఆ ప్రభావం రొయ్యల ధరపై పడింది. అమెరికాలో రొయ్యల ధర అమాంతం పెరిగింది. మన దేశం నుంచి వాటి ఎగుమతులు తగ్గే అవకాశం ఉండడంతో.. ఇక్కడ కూడా రొయ్యల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో రొయ్యల వ్యాపారంలో ఉన్న వారికి ఆదాయం తగ్గుముఖం పడుతోంది. క్రమేపి నష్టాలు బాట తప్పదని వ్యాపారులు చెబుతున్నారు. భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ట్రంప్ టారిఫ్ విధానాలు: అమెరికన్ల మద్దతు గణనీయంగా తగ్గుదల
* ధర పతనం..
పశ్చిమగోదావరి జిల్లాలో( West Godavari district) కిలో రొయ్యల ధర 40 రూపాయలకు తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తోంది. మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే మాంస ఉత్పత్తుల్లో రొయ్యలది మూడో స్థానం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఏడాది నాలుగు లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుంది. అందులో ఏకంగా 3.5 లక్షల టన్నులు విదేశాలకు ఎగుమతి చేస్తారు. అమెరికా ప్రతీకార సుంకాలు విధించడం ప్రారంభించడంతో.. ఆ ప్రభావం రొయ్యల ధరపై కూడా పడింది. రోజుల వ్యవధిలోనే ప్రస్తుతం ధర తగ్గుముఖం పట్టినట్లు రైతులు చెబుతున్నారు. ఇలా అయితే వ్యాపారం చేయలేమని కూడా వారు తేల్చి చెబుతున్నారు.
* ప్రధాన జీవనాధారం..
ఉభయగోదావరి జిల్లాల్లో( combined Godavari district) చేపల పెంపకం ప్రధాన జీవనాధారం. ఇదో వ్యాపారం గా కూడా మారింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమంది ఈ చేపల చెరువులపై ఆధారపడి జీవిస్తున్నారు. మేలు జాతి రొయ్య ఇక్కడ లభ్యమవుతుంది అనేది ఒక ప్రచారంగా ఉంది. ప్రపంచ దేశాలకు సైతం ఇక్కడ నుంచి ఆహార ఉత్పత్తులు జరుగుతుంటాయి. కానీ కేవలం ఇతర దేశాల ఆహార ఉత్పత్తులపై ట్రంప్ ఆంక్షలు విధించడం కూడా శాపంగా మారుతోంది. ప్రధానంగా ప్రతీకార సుంకాలు విధించడం భారత్ పైనే ప్రభావం చూపుతోంది. అందులోని మన రాష్ట్రంపై ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
* బర్డ్ ఫ్లూ తో నష్టం..
అయితే మొన్నటికి మొన్న బర్డ్ ఫ్లూ( bird flu) కలకలం ఉభయగోదావరి జిల్లాలకు ఎనలేని నష్టాన్ని మిగిల్చింది. ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు సైతం గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో లక్షలాది కోళ్లను నిర్మూలించారు కూడా. అయితే ఫ్లూ బెడద తప్పిందనుకుంటే.. ఇప్పుడు ట్రంప్ ప్రతీకార సుంకాలు ఏపీని దారుణంగా దెబ్బతీసాయి. పశ్చిమగోదావరి వ్యాపారులు, రైతులు విలవిల్లాడేలా చేశాయి.