Tilak Verma : శుక్రవారం రాత్రి లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై జట్టు చివరి దశలో చేతులెత్తేసింది. గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయింది. చివరి ఓవర్లలో లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై జట్టుకు విజయం దూరమైంది. అయితే చివరి ఓవర్ లో ముంబై జట్టు 22 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ ఓవర్ ను ఆవేష్ ఖాన్ వేశాడు. ఆ ఓవర్ లో ముంబై జట్టు ఆటగాళ్లు కేవలం 10 పరుగులు మాత్రమే చేశారు. దీంతో ముంబై జట్టు విజయానికి 12 పరుగుల దూరంలో ఉండిపోయింది. తద్వారా ముంబై జట్టు సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా తిలక్ వర్మను రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి పంపించడంతో సోషల్ మీడియాలో ముంబై జట్టు యాజమాన్యంపై విపరీతమైన విమర్శలు వస్తున్నాయి.
Also Read : తిలక్ వర్మకు ఏమైంది?.. వరుసగా మూడోది.. ఈ పునకాలు ఏంటి స్వామీ!
అప్పుడు తెలియదా
తిలక్ వర్మ గొప్ప ఆటగాడు. ఇటీవల టి20 లలో టీమ్ ఇండియా తరఫున అద్భుతంగా ఆడాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల పై ధనాధన్ బ్యాటింగ్ తో దుమ్ము రేపాడు. ఇక ఐపీఎల్ లో ముంబై జట్టు తరఫున ఆడుతున్న అతడు.. శుక్రవారం లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో 23 బంతుల్లో 25 పరుగులు చేశాడు. అయితే ఇది ముంబై జట్టు యాజమాన్యానికి తప్పులాగా అనిపించింది. అంతే వెంటనే అతడిని రిటైర్డ్ హర్ట్ గా పంపించింది. వాస్తవానికి తిలక్ వర్మ అద్భుతమైన ఆటగాడు.. గత ఏడాది ముంబై జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ తర్వాత హైయెస్ట్ స్కోర్ (416) చేసిన ప్లేయర్ గా అతడు రికార్డు సృష్టించాడు. ఇక ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున మాత్రమే కాదు.. టి20లలో భారత జట్టు తరఫున కూడా అద్భుతమైన రికార్డును సృష్టించాడు. 25 మ్యాచ్లలో 50 సగటుతో వేగంగా 749 పరుగులు చేశాడు. ఇందులో అతడు రెండు సెంచరీలు చేశాడు.. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. ” తిలక్ వర్మ అద్భుతమైన ఆటగాడు. అటాకింగ్ ఆటతీరుతో ఆకట్టుకుంటాడు. లక్నో జట్టుతో 23 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడని ముంబై జట్టు యాజమాన్యం అతనిపై కక్ష కట్టింది. రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి పంపించింది. అతడిని వెనక్కి పంపించడం వల్ల ముంబై జట్టు పొందిన ప్రయోజనం ఏమిటో అర్థం కావడం లేదు. తిలక్ వర్మ స్థానంలో వచ్చిన శాంట్నర్ పెదగా గొప్ప ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలు లేవు. అతడు రెండు పరుగులు మాత్రమే చేశాడు. ముంబై యాజమాన్యం ఇలా చేయడం వల్ల తిలక్ వర్మ ఆత్మవిశ్వాసం దెబ్బతింటే ఎవరు బాధ్యత వహిస్తారని” నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
Also Read : తెలుగు కుర్రాడు దూసుకొచ్చాడు.. ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ లో ఏకంగా సూర్య కుమార్ యాదవ్ నే పక్కకు నెట్టాడు