Tirumala Laddoo Scam: తిరుమలలో( Tirumala) కల్తీ వ్యవహారంపై చురుకైన దర్యాప్తు కొనసాగుతోంది. సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం గత కొద్దిరోజులుగా విచారణ చేస్తోంది. ఈ క్రమంలో ఈరోజు వైవి సుబ్బారెడ్డి ఇంటికి విచారణ బృందం చేరుకోవడం ఆసక్తి రేపుతోంది.. కొద్ది రోజుల కిందట వై వి సుబ్బారెడ్డి కి ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరుకావాలని సూచించారు కూడా. అయితే తాను తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పి గడువు కోరారు సుబ్బారెడ్డి. తన వయసు దృష్ట్యా ఇంట్లోనే విచారణ చేపట్టాలని కూడా కోరారు. దీంతో ఈరోజు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు వైవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన నుంచి కీలక వివరాలు సేకరించారు. అయితే విచారణ జరిపిన సమయంలోనే వైవి సుబ్బారెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం నడిచింది. దీంతో అందరి చూపు ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం కదలికల పైనే ఉంది.
Also Read: పవన్ కళ్యాణ్ ను లెక్కచేయని బిజెపి పెద్దలు!
అప్పన్న అనే వ్యక్తి ద్వారా..
లడ్డు కల్తీ కి సంబంధించిన విచారణ చేపట్టిన నేపథ్యంలో అప్పన్న( Appanna) అనే వ్యక్తిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో లడ్డు తయారీకి సంబంధించి వాడే నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థల నుంచి అప్పన్నకు పెద్దఎత్తున నగదు లావాదేవీలు జరిగాయని గుర్తించారు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు. అయితే అప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ అని.. ఆయన అనుచరుడని ప్రచారం జరిగింది. నెయ్యి సరఫరా చేసే సంస్థల నుంచి వచ్చిన మొత్తం అప్పన్న ద్వారా వైవి సుబ్బారెడ్డికి చేరిందన్నది ప్రధాన అనుమానం. కొద్ది రోజుల కిందట అప్పన్నను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. అప్పటినుంచి వైవి సుబ్బారెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. తప్పకుండా అరెస్టు చేస్తారని కూడా ప్రచారం జరిగింది. ఈ తరుణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు వైవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: సోదరి ఎదురుపడితే పలకరించని జగన్!
సుబ్బారెడ్డి పిటిషన్ తో మారిన సిట్..
వైసిపి హయాంలో నాలుగేళ్ల పాటు టీటీడీ అధ్యక్షుడిగా కొనసాగారు వైవి సుబ్బారెడ్డి( Subba Reddy). చివరి ఏడాది మాత్రం భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి అధ్యక్ష పదవి చేపట్టారు. తిరుమలలో లడ్డు తయారీకి సంబంధించి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. అయితే ఆ సమయంలోనే వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీట్ వద్దని.. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ చేపట్టాలని కోరారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం సిబిఐ నేతృత్వంలో రాష్ట్ర అధికారులను భాగస్వామ్యం చేస్తూ సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గత కొద్ది రోజులుగా తిరుపతి కేంద్రంగా చేసుకొని ఈ దర్యాప్తు బృందం విచారణ చేపడుతోంది. అయితే ఈ కేసులో వైవి సుబ్బారెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం నడిచింది. ఈరోజు ఆయన ఇంటికి నేరుగా వెళ్లి విచారణ చేపడుతుండడంతో సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది.