https://oktelugu.com/

YSR Congress : చిన్న సమస్యలే వైసిపికి శాపాలు.. ఓటమికి అవే కారణాలు.. గుణపాఠంగా మార్చుకున్న టిడిపి కూటమి*

సాధారణంగా ఓడిపోయిన వాడికి అనుమానాలు ఎక్కువ అంటారు. అది సహజమే అయినా.. వైసీపీ ఓటమితో అనేక రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా గ్రామస్థాయిలో ఆ పార్టీ అపజయానికి కారణాలు ఏంటి అన్న విశ్లేషణ కొనసాగుతోంది. దానికి చిన్న చిన్న సమస్యలే అని తేలడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : July 29, 2024 / 06:53 PM IST
    Follow us on

    YSR Congress : వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలను గుర్తించారు టిడిపి కూటమి నేతలు. ప్రజల్లో ఏది సంతృప్తి మిగులుస్తుందో? ఏది అసంతృప్తి రగిలిస్తుందో? గుర్తించారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల్లోకి వెళ్లిపోయారు. ప్రజలకు నచ్చే చిన్న చిన్న పనులను పూర్తి చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసింది. ‘నేను బటన్ నొక్కుతున్నాను.. మీరు ప్రజలకు వెళ్లి చెప్పండి’.. అని పురమాయించారు జగన్. ప్రజలు అన్ని గుర్తుంచుకుంటారని భావించారు. సంక్షేమంతోనే వారు సంతృప్తి చెందుతారని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలే తప్పయ్యాయి. ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కోరుకున్నారని అర్థమైంది. మౌలిక వసతులు సైతం కోరుకున్నారని తేటతెల్లమయింది. అందుకే ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని ఆలస్యం చేస్తోంది. అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో కాలువల సైతం శుభ్రం చేయలేకపోయామని.. ఎక్కడా చిన్నపాటి పని చేయలేకపోయామని సొంత పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. అదే వైసీపీకి అంతులేని నష్టాన్ని తెచ్చింది. జగన్ బటన్ నొక్కుడు పక్కన పెడితే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమకు ఏం చేయలేదన్న బాధ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అదే అంతులేని నష్టాన్ని చేకూర్చింది. వైసీపీకి అధికారాన్ని దూరం చేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టే.. టిడిపి కూటమి ప్రజాప్రతినిధులు అధికారంలోకి వచ్చిన వెంటనే.. ప్రజల బాట పట్టారు. చిన్న చిన్న ప్రజా సమస్యలను వెనువెంటనే పరిష్కార మార్గం చూపారు.

    * గడపగడపకు వెళ్ళినా
    వాస్తవానికి జగన్ రెండేళ్ల ముందు నుంచే ఎన్నికల సన్నాహాలను ప్రారంభించారు. గడపగడపకు మన ప్రభుత్వం అంటూ ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి సమస్యలను గుర్తించాలని సూచించారు. బటన్ నొక్కి తాను సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానని.. అదొక్కటే చాలదని.. ప్రజల్లోకి వెళ్లి సమస్యలు గుర్తించి.. పరిష్కార మార్గం చూపిస్తేనే వారు గుర్తిస్తారని చెప్పుకొచ్చారు. అయితే ఆదేశాలు ఇచ్చిన జగన్.. చేతిలో నిధులు పెట్టలేదు. దీంతో ప్రజల్లోకి వెళ్లిన ప్రజాప్రతినిధులకు నిలదీతలే ఎదురయ్యాయి. అక్కడ నుంచే వైసిపి పై వ్యతిరేకత ప్రారంభమైంది. పతాక స్థాయికి చేరింది.

    * వాలంటీర్లే హీరోలు
    ప్రజలు ఏ చిన్న పనికైనా వాలంటీర్లపై ఆధారపడేవారు. సంక్షేమ పథకాలు సైతం వారే ఇస్తున్నారని భావించేవారు. వారితోనే సమస్యల పరిష్కారం సాధ్యమని ఒక అంచనాకు వచ్చారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ కంటే వారే పవర్ ఫుల్ అని భావించారు. వారినే ఆశ్రయించి పనులు చేసుకునేవారు. వాలంటీర్ల ద్వారా రాజకీయం చేద్దామని జగన్ భావించారు. దానికి విపక్షాలు చెప్పాయి. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరం చేశాయి. ఆ విధంగా కూడా జగన్ అంచనాలు తప్పాయి.

    * ఇట్టే పరిష్కారం
    ఇప్పుడు టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు కూడా ఇట్టే పరిష్కారం అవుతున్నాయి. వాస్తవానికి ఈ చిన్న చిన్న పనులకు నిధులు అవసరం లేదు. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు ఆమాత్రం నిధులు సర్దుబాటు చేస్తే వీటికి ఇట్టే పరిష్కార మార్గం దొరుకుతుంది. కానీ సంక్షేమమే అంటూ ఆర్భాటం చేసిన వైసీపీకి ఆ చిన్న చిన్న పనుల పరిష్కార మార్గం కూడా దొరకలేదు. అందుకే వాటిని పరిష్కరించలేక ప్రజల్లో పలచనయ్యారు. కోట్లాది రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో అందించినా ప్రజల అభిమానాన్ని చూరగొనలేకపోయారు