https://oktelugu.com/

Srikurmam: అమ్మో డిసెంబర్ 6.. వణికిపోతున్న ఆ గ్రామం.. ఎందుకో తెలుసా?

డిసెంబర్ 6 వచ్చిందంటే ఆ గ్రామస్తులు చిగురుటాకులా వణికి పోతున్నారు. ఇటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతుంటారు. వారు భయపడినట్టే ఈ ఏడాది దారుణం చోటుచేసుకుంది.

Written By:
  • Dharma
  • , Updated On : December 9, 2024 / 10:05 AM IST

    Srikurmam

    Follow us on

    Srikurmam: శ్రీకూర్మం పుణ్యక్షేత్రానిది సుదీర్ఘ చరిత్ర. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రెండోది కూర్మావతారం. ఈ రూపంలో ఉన్న ఏకైక ఆలయం శ్రీకూర్మం. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం. బ్రహ్మదేవుడు ప్రతిష్టించిన పంచలింగ క్షేత్రం గానూ ఈ ఆలయం ప్రసిద్ధి. మరెన్నో విశిష్టతలు కలగలిపినది. స్వామి వారు కూడా పడమటి ముఖంగా ఉండడం ఇక్కడ ప్రత్యేకత. పవిత్ర పుష్కరిణి, విశాలమైన ప్రాకారంతోపాటు కూర్మావతారానికి నిజరూపమైన తాబేళ్లు ఇక్కడ కనిపిస్తాయి. పితృ కార్యాలంటే ముందుగా గుర్తొచ్చేది కాశి. అయితే వారణాసి తో సమానంగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు. కాశీ వెళ్లలేని వారు చాలామంది శ్రీకూర్మం క్షేత్రంలోని పితృ కార్యాలు నిర్వహిస్తుంటారు. అంతటి పుణ్యక్షేత్రం ఉన్న శ్రీకూర్మం లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు సంచలనం రేపుతున్నాయి. కక్షలు కార్పన్యాలతో మనుషులు హత్యలు చేసుకుంటుండడం భయాందోళనకు గురిచేస్తోంది. యాదృచ్ఛికమో.. ప్రత్యేకమో తెలియదు కానీ.. ప్రత్యేక డిసెంబర్ 6న దారుణ హత్యలు జరగడం విస్మయ పరుస్తోంది.

    * సరిగ్గా రెండేళ్ల కిందట
    సరిగ్గా రెండేళ్ల కిందట.. డిసెంబర్ 6న వైసిపి సీనియర్ నేత బరాటం రామశేషు దారుణ హత్యకు గురయ్యారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఆయన ప్రధాన అనుచరుడు. పైగా గార మండల ఉపాధ్యక్షుడు కూడా. ఆయన భార్య శ్రీకూర్మం మేజర్ పంచాయతీకి సర్పంచ్ గా కూడా ఉన్నారు. ఈ తరుణంలో ఆరోజు శ్రీకూర్మం లోని తన గ్యాస్ గోడౌన్ కి వెళ్లి.. అక్కడే మార్నింగ్ వాకింగ్ చేస్తున్నారు రామ శేషు. అక్కడే మార్టు వేసిన సుఫారీ గ్యాంగ్ అతడిని కత్తితో రోడ్డుపై నరికి.. నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై పారిపోయారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. జైల్లో పెట్టారు. అయితే అదే గ్రామానికి చెందిన వ్యక్తి సుఫారీ గ్యాంగ్ ను ఆశ్రయించి ఈ హత్య చేసినట్లు తేలింది. అయితే చాలా రోజులపాటు శ్రీకూర్మం లో నిందితులు ఉన్నారు. రామ శేషు కదలికలను గుర్తించి హత్యకు ప్రణాళికలు రూపొందించారు. రాజకీయ వ్యక్తిగత కక్షలే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు.

    * తాజాగా యువకుడి పై
    అయితే తాజాగా ఈనెల 6న శ్రీకూర్మం లో మరో దారుణ హత్య జరిగింది. దీంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శ్రీకూర్మం గ్రామానికి చెందిన ఉప్పాడ రాజేష్ అనే యువకుడుని ప్రత్యర్థులు నడిరోడ్డుపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజేష్ తన పెదనాన్న కొడుకు అయిన ఉప్పాడ సూర్యనారాయణ, చుక్క రాము అనే మరో వ్యక్తితో కలిసి.. హై స్కూల్ సమీపంలో రోడ్డుపై వెళ్తుండగా ప్రత్యర్ధులు కర్రలు, కత్తులతో దాడికి దిగారు. సూర్యనారాయణ సమీపంలోని దుకాణం వద్ద దాక్కున్నాడు. ప్రత్యర్ధులు రాజేష్ తో పాటు రాము పై దాడి చేశారు. దీంతో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాముకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. భూతగాదాల నేపథ్యంలో పాత కక్షలతోనే రాజేష్ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే డిసెంబర్ 6న ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో గ్రామస్తులు మాత్రం భయాందోళనతో గడుపుతున్నారు.