TDP Hybrid Mahanadu: తెలుగుదేశం పార్టీ మరోసారి తన సత్తా చాటుకుంది. మిగతా ప్రాంతీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు ఏర్పాటు అవుతుంటాయి. అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి. ఇటువంటి సక్సెస్ పార్టీల్లో తెలుగుదేశం ఒకటి. ఆ పార్టీకి విజయాలు కొత్త కావు. అపజయాలు కొత్త కావు. సంక్షోభాలు కొత్త కావు. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకొని నిలబడగలిగిన పార్టీ తెలుగుదేశం. అయితే నిన్ననే ఒక సక్సెస్ సాధించింది. పశ్చిమ ఆసియా ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ పై పడుతున్న తరుణంలో.. పొదుపు పాటించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుతో.. భౌతిక మహానాడు ను రద్దు చేశారు చంద్రబాబు. హైబ్రిడ్ విధానంలో ఏర్పాటు చేశారు. అయితే చెప్పేందుకు కాస్త వెరైటీగా ఉన్నా.. అది సాధ్యమేనా? అనే ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. క్రమశిక్షణతో హైబ్రిడ్ మహానాడు ను విజయవంతంగా పూర్తి చేశారు తొలిరోజు. రెండో రోజు కూడా ఉత్సాహ భరిత వాతావరణంలో కొనసాగుతోంది మహానాడు. దేశంలో మిగతా ప్రాంతీయ పార్టీలు సైతం తెలుగుదేశం పార్టీని అభినందించక తప్పదు.
* గతానికి భిన్నం..
పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిమిత సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు. అది కూడా గతానికంటే భిన్నం. యువతతో పాటు మహిళలకు ప్రాధాన్యమిచ్చి.. వారిని వక్తల జాబితాలో చేర్పించి మాట్లాడించిన తీరు మాత్రం అభినందనీయం. మహానాడు ను చూస్తుంటే.. అక్కడి నాయకుల ప్రోత్సాహాన్ని చూస్తుంటే.. మరో నాలుగు దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం లోటు లేనట్టే. అంతలా ప్రభావం చూపింది మహానాడు. ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 1800 క్లస్టర్లకు పైగా ఏర్పాటు చేసి.. లక్షలాదిమంది కార్యకర్తలతో మమేకమై మహానాడు నడిపించిన తీరు మాత్రం అద్భుతమే.
* ఆ ప్రత్యేక ప్రకటనతో..
ఈ హైబ్రిడ్ మహానాడులో మరో ప్రత్యేకత ఉంది. అదే మహిళలకు 33% రిజర్వేషన్ల ప్రకటన. మహానాడు అంతా ఒక ఎత్తు.. ఆ ప్రకటన మరో ఎత్తు అన్నట్టు ఉంది. పార్లమెంటులో బిల్లుతో సంబంధం లేకుండా.. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో 33 శాతం మంది మహిళలకు టికెట్లు ఇస్తామని లోకేష్ చేసిన ప్రకటన మహిళా లోకాన్ని ఆకట్టుకుంది. మహిళా ధీమ్ తో సాగిన ఈ మహానాడు.. అదే తీరుతో కొనసాగింది. తెలుగుదేశం పార్టీ ఇక మహిళలదే అన్నట్టు పరిస్థితి ఉంది. యువతకు సైతం ప్రాధాన్యం ఇచ్చారు. మహానాడులో హాజరైన ప్రతి ఒక్కరు నాలుగు పదుల వయసులోని వారు కావడం గుర్తించాల్సిన అంశం. టిడిపి నాయకత్వం ఏ ఆలోచనతో ఈ హైబ్రిడ్ మహానాడు ను ఏర్పాటు చేసిందో.. ఆ టార్గెట్ ను చాలా సులువుగా అందుకుంది.
