TDP: అండమాన్ నికోబార్( Andaman Nicobar) దీవుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక విభాగం ఉంది. అక్కడ చాలా రోజులుగా తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతూ వస్తోంది. తాజాగా బిజెపి, జనసేనతో కూటమి కట్టి ఏకంగా విజయపురం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. టిడిపికి చెందిన అభ్యర్థి ఎక్కడ చైర్మన్గా విజయం సాధించారు. రెండేళ్ల కిందట అక్కడ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీకి ఆధిక్యం లభించలేదు. దీంతో అప్పట్లో టిడిపి, బిజెపి సభ్యులు కూటమిగా ఏర్పడి.. ఏడాదికి ఒక్కరు చొప్పున చైర్పర్సన్ గా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఒప్పందంలో భాగంగా రెండేళ్లు సజావుగా జరిగింది. తొలి ఏడాది బిజెపి సభ్యుడు.. తరువాత ఏడాది టిడిపి సభ్యుడు ఎన్నికయ్యారు. కానీ మూడోసారి మాత్రం అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్ అయ్యారు. కానీ తాజాగా నాలుగో ఏడాది మాత్రం టిడిపి, బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. దీంతో టీడీపీ సభ్యుడు హమీద్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.
Also Read: ఏపీలో మరో ఎన్నికల హామీ అమలు.. ముహూర్తం రేపే!
* ఏటా చైర్మన్ ఎన్నిక..
అయితే ఇక్కడ మున్సిపల్ నిబంధనల ప్రకారం ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. కానీ చైర్మన్ ఎన్నిక మాత్రం ప్రతి ఏటా జరుగుతూ వస్తుంది. ఈసారి జరిగిన ఎన్నికల్లో 24 ఓట్లకు గాను హమీద్ కు ( Hamid) ఏకంగా 15 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడిన సిట్టింగ్ చైర్మన్ సుధీప్ రాయ్ శర్మ ఓడిపోయారు. టిడిపి సభ్యుడి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన వారందరికీ అండమాన్ నికోబార్ రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు మాణిక్యరావు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టిడిపి పని చేస్తుందని స్పష్టం చేశారు.
* ఆది నుంచి పట్టు..
తెలుగు ప్రజలు అధికంగా ఉండే అండమాన్ నికోబార్ దీవుల్లో ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి( Telugu Desam Party) ఆదరణ దక్కుతూ వస్తోంది. అందుకే అక్కడ ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ప్రభావమే చూపుతూ వస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల సరిహద్దులు దాటి అండమాన్ నికోబార్ దీవుల్లో టిడిపి రాణించడం వెనుక తెలుగు ప్రజలు ఉన్నారు. ప్రధానంగా పోర్టు బ్లేయర్ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతూ వచ్చింది. ఇప్పుడు మరో మున్సిపాలిటీలో సైతం ఆ పార్టీ పాగా వేయడం నిజంగా శుభపరిణామం. ఎన్నికల ఫలితాల్లో హమీద్ తన ప్రత్యర్థి పై స్పష్టమైన అధిక్యం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. తెలుగు రాష్ట్రాలకు వెలుపలకు కూడా టిడిపికి ఆదరణ ఉందని ఈ ఫలితం రుజువు చేసింది.
* అధినేత హర్షం..
అండమాన్ నికోబార్ దీవుల్లో సైతం తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు( CM Chandrababu ) హర్షం వ్యక్తం చేశారు. టిడిపి తో పాటు బిజెపి మద్దతుదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం టిడిపి, బీజేపీ ఐక్యతకు నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు అండమాన్ నికోబార్ దీవుల్లో టిడిపి సత్తా చాటడంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది. ఈ విజయం భవిష్యత్తులో టిడిపి, బిజెపి కూటమికి మరింత బలాన్ని చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో తనకంటూ ముద్ర చాటుకుంటుంది టిడిపి. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా కూడా ఉంది. బిజెపితో శాశ్వత పొత్తు దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో ఈ విజయం దక్కడం ఆ పార్టీకి ఉపశమనం కలిగించే విషయమే.
Also Read: పిఠాపురం వర్మ ని దగ్గరకు తీసిన పవన్ కళ్యాణ్..వీడియో వైరల్!