Pakistan Salary Cuts 2026: పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గారు అద్భుతమైన ఐడియా ఇచ్చారు. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంటే.. మనోళ్లు చేసే పనేంటి? కష్టపడటమో లేక అప్పులు తేవడమో అనుకుంటే పొరపాటే! “మనకేంటిలే.. జీతాల్లో కోత విధించి ఆ పైసలతోనే దేశాన్ని ఉద్ధరిస్తాం” అని గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ట్రైలర్ రివ్యూ : పవన్ కళ్యాణ్ లో ఇంత కామెడీ టైమింగ్ చూసి ఎన్ని రోజులైందో!
“పొదుపు” అంటే ఏంటి?
పాకిస్థాన్ ప్రభుత్వం నిర్వచనంలో పొదుపు అంటే.. ‘ఉద్యోగుల కడుపు కొట్టి, ఖజానా నింపడం’. ప్రధాని గారి కొత్త ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 5 నుండి 30 శాతం కోతట! అబ్బా.. భలే ఐడియా కదా! ఇప్పటికే చుక్కలు చూస్తున్న ధరలకు, ఇప్పుడు ఈ జీతాల కోత తోడైతే, ఉద్యోగులందరూ ఇక కడుపు నిండా గాలి పీల్చుకుని బతకడమే.
విమానాలు ఎక్కనివ్వరు.. అడగనివ్వరు!
మంత్రులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకుల విదేశీ పర్యటనలపై నిషేధం అట. అంటే దేశం పరువు తీయడానికి వీరంతా విదేశాలకు వెళ్లకూడదన్నమాట! ఇంకో విశేషం ఏంటంటే.. వీళ్లందరూ రెండు నెలల పాటు జీతాలు తీసుకోరట. ఇది నిజంగా త్యాగమే.. అసలు వాళ్లకు జీతాలతో పనేంటి? అప్పుల కోసం అడుక్కోవడంలోనే వాళ్లకు బోలెడు కమీషన్లు వస్తుంటాయి కదా!
సగం కార్లు ఆపేయండి.. ఇంట్లో కూర్చోండి!
ప్రభుత్వ వాహనాల్లో 60 శాతం వాహనాలను రెండు నెలల పాటు గ్యారేజీలకే పరిమితం చేయాలట. మిగిలిన వాహనాలకు 50 శాతం ఇంధనం కోతట! అంటే రేపు ఏదైనా అత్యవసరమైతే కూడా మంత్రులు ఎడ్లబండ్ల మీదో, గాడిదల మీదో వెళ్లాల్సిందేనా? ఒకవేళ ఆ వాహనం దారిలోనే ఆగిపోతే ‘థర్డ్ పార్టీ ఆడిట్’ వచ్చి అడుగుతుంది.. “ఎందుకు ఆగిపోయింది?” అని. అసలు అక్కడ పెట్రోల్ లేదు కాబట్టి ఆగిందని ఆ ఆడిట్ కి అర్థం కావడానికి మరో రెండు ఏళ్లు పడుతుందేమో!
“భవిష్యత్తు గ్యారెంటీ”
పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు చూస్తుంటే ఒక్కటే అర్థమవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను ‘మరో అడుగు’ ముందుకు అంటే అప్పుల్లోకి వేయించడానికి వీరు చేస్తున్న ఈ ‘పొదుపు’ డ్రామాలు అస్కార్ రేంజ్ లో ఉన్నాయి.
చివరిగా ఒక మాట.. పాకిస్థాన్ ప్రభుత్వం ఈ పొదుపు నిధులను ప్రజా సంక్షేమానికే వాడుతారట. ఆ సంక్షేమం ఎక్కడో, ఎవరికో తెలియదు కానీ.. మొత్తం మీద దేశం మాత్రం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ‘పొదుపు’ దేశంగా చరిత్రలో నిలిచిపోవడం ఖాయం!
