Talliki Vandanam Scheme Rules: రాష్ట్రవ్యాప్తంగా తల్లికి వందనం(Thalliki vandanam) నిధులు జమ చేసినట్లు చెబుతోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల మందికి పైగా అర్హులు ఉన్నట్లు తేల్చింది. కానీ రకరకాల కారణాలు చెబుతూ ఈ జాబితాలో చాలా వరకు కోత పడింది. ముఖ్యంగా 300 యూనిట్ల విద్యుత్ వినియోగం అంటూ అనర్హుల జాబితాలో చేర్చడం ఆందోళన కలిగిస్తోంది. అసలు విద్యుత్ బిల్లుల విషయంలో అస్పష్టత కొనసాగుతోంది. ట్రూ ఆఫ్ చార్జీలు పెరిగాయని ఒకసారి.. తగ్గాయని మరోసారి.. ఇలా విద్యుత్ చార్జీల్లో వ్యత్యాసం కనిపించింది. అయితే ఇది సర్వసాధారణ చర్యగా భావించిన సామాన్యులకు ఇప్పుడు తల్లికి వందనం రూపంలో షాక్ తగిలింది. మీరు నిర్దేశించిన యూనిట్ల కంటే అధికంగా విద్యుత్ వినియోగించారంటూ తల్లికి వందనం పథకంలో కోత విధించారు. దీనికి తోడు సాంకేతిక సమస్యలు, ఆధార్ సీడింగ్ అంటూ కొత్త మెలికలు పెట్టి భారీగా కోత విధిస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు లబోదిబోమంటూ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు.
Also Read: AP Minister : ఆ 12 కులాలకు కార్డుపై 35 కేజీల బియ్యం.. ఏపీ మంత్రి కీలక ప్రకటన!
అప్పట్లో విమర్శించి..
విద్యుత్ వినియోగం( power usage) 300 యూనిట్ల కంటే అధికంగా ఉంటే జగన్ సర్కార్ అమ్మ ఒడి పథకాన్ని నిలిపివేసింది. అప్పట్లో దీనిని తప్పు పట్టింది కూటమి. కరెంటు ఎక్కువ కాలిస్తే పథకం నిలిపివేస్తారా అని నిలదీసింది. ఇప్పుడు అదే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. కరెంటు ఎక్కువగా వినియోగిస్తే పథకం ఇవ్వలేమంటూ తేల్చేసింది. అయితే సామాన్యుడికి విద్యుత్ చార్జీల విషయంలో అవగాహన లేదు. అందుకే విద్యుత్ వినియోగం విషయంలో ఏం చేయాలో పాలు పోక.. వచ్చిన బిల్లును కట్టుకుంటూ ముందుకు సాగాడు. కానీ తీరా ఇప్పుడు పథకం అమలు విషయానికి వచ్చేసరికి షాక్ తగిలేలా కూటమి సర్కార్ విద్యార్థుల తల్లిదండ్రులకు చేదు వార్త వినిపించింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా తల్లుల ఖాతాలో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ తల్లికి వందనం నిధులు జమ చేశారు. కానీ సాయంత్రానికే ప్రతి గ్రామంలో పదిమందికి తగ్గకుండా విద్యుత్ వినియోగం అధికం చేశారన్న నెపంతో పథకాన్ని నిలిపివేశారు. దీంతో కొందరు తల్లులకే వందనమా అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఒక ఏడాది సాయాన్ని ఇప్పటికే హరించారు. ఇప్పుడు వస్తుందనుకున్న తల్లికి వందనం పథకం రాకపోయేసరికి సగటు లబ్ధిదారుడు కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నాడు. కనీసం ముందస్తుగా మార్గదర్శకాలు, వినతులు స్వీకరించి ఉంటే ఇటువంటి సాంకేతిక సమస్యలు అధిగమించే అవకాశం ఉంది. కానీ ఉన్నపలంగా మార్గదర్శకాలు జారీ చేయకుండా.. కొందరి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసి.. 300 యూనిట్ల విద్యుత్ వినియోగం పేరిట కొత్త విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: Current Shock: కేసీఆర్ యే కాదు.. జగన్ కూడా ‘షాక్’ ఇచ్చాడు! పెరిగిన కరెంట్ ఛార్జీలివే!
అనర్హులుగా తేల్చేయడం పై విమర్శలు..
మరికొందరు 300 యూనిట్ల విద్యుత్ వినియోగించకుండానే పథకానికి అనర్హుల పేరిట తేల్చేయడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇదేమని సచివాలయాలకు వెళ్తుంటే.. విద్యుత్ కార్యాలయాలకు( electrical offices) పంపిస్తున్నారు. విద్యుత్ కార్యాలయాల వద్దకు వెళితే అంతా సరిగ్గా ఉంది సచివాలయాలకు వెళ్ళండి అంటూ సూచిస్తున్నారు. దీంతో సామాన్యుడికి అర్థం కావడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేని నిబంధనలు.. ఇప్పుడు తెరపైకి రావడం పై ఎక్కువ మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు ఎక్కువ కాల్చితే.. పథకాలు నిలిపివేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు విద్యుత్ చార్జీలు పెరిగాయి. కుటుంబ అవసరాల కోసం విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది అధికంగా విద్యుత్ వినియోగించారు. సాధారణంగా వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువ. దీంతో ఏడాది ప్రాతిపదికగా తీసుకొని విద్యుత్ వినియోగాన్ని లెక్కించలేదు. 250- 300 యూనిట్ల మధ్య విద్యుత్ వినియోగించిన వారిని సైతం అనర్హులుగా తేల్చడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనికి తోడు సాంకేతిక సమస్యలు ఉండనే ఉన్నాయి. తల్లికి వందనం అనేది విద్యా శాఖ తో పాటు సచివాలయాలు, ఆపై విద్యుత్ శాఖ, రవాణా శాఖ వంటి అంశాలతో ముడిపడి ఉంది. కానీ ఇవేవీ పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఉన్నఫలంగా తల్లికి వందనం పేరిట లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేసింది. వాస్తవానికి 69 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే.. 45 లక్షల మందికి ఇవ్వడం ఏమిటనేది ఇప్పుడు ప్రశ్న. ఏడాదిగా పథకం అమలు చేయలేదు. తీరా ఇప్పుడు ఇచ్చారంటే నిబంధనల పేరిట కొర్రీలు పెడుతుండడం మాత్రం నిజంగా ప్రజలకు ఇబ్బందులకు గురి చేయడమే. మరి వాటిని సరిచేసి లబ్ధిదారులకు అందిస్తారో.. లేకుంటే ప్రజాగ్రహానికి గురి అవుతారో తేల్చుకోవాల్సింది ప్రభుత్వమే.