Vijayasaireddy: విజయసాయిరెడ్డి బిజెపిలో చేరతారా? ఆ పార్టీ సేఫ్ జోన్ అని భావిస్తున్నారా? కేసులకు భయపడుతున్నారా? అందుకే తరచూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుస్తున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వారం రోజుల వ్యవధిలో విజయసాయిరెడ్డి అమిత్ షాను కలవడం రెండోసారి. సాధారణంగా అమిత్ షా అపాయింట్మెంట్ అంత ఈజీగా లభించదు. ఆయన కేంద్ర హోంమంత్రి తో పాటు బిజెపిలో కీలక నేత. పాలనాపరమైన అంశాలతో పాటు పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. అటువంటి నేతతో వరుసగా విజయసాయిరెడ్డి భేటీలు జరుపుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. వైసిపి కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డి పై అనేక రకాల కేసులు ఉన్నాయి. వైసిపి హయాంలో భూకబ్జా చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవల దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో బలంగా ఆయన పేరు వినిపించింది. సొంత పార్టీలో సైతం ఆయనకు పెద్దగా ఎవరు అండగా నిలవలేదు. అయినా సరే పార్టీ అధినేత జగన్ వెంట నిత్యం కనిపిస్తున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జగన్ తలపెట్టిన ధర్నాకు.. జాతీయ స్థాయి నేతల సమీకరణ దగ్గరుండి చూశారు విజయసాయిరెడ్డి. కానీ ఆ ధర్నాకు హాజరయ్యింది ఎన్డీఏ వ్యతిరేక పక్షాలు. ముఖ్యంగా బిజెపిని వ్యతిరేకించే పార్టీల నేతలే అక్కడకు వచ్చారు. అదే సమయంలో విజయసాయిరెడ్డి ఎన్ డి ఏ విధానాలను తప్పుపడుతూ మాట్లాడారు కూడా. ప్రతిపక్షాలకు లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయించాలని కూడా కోరారు. అయితే ఒకవైపు ఎన్డీఏ, బిజెపి వ్యతిరేక వ్యాఖ్యానాలు చేస్తూనే.. బిజెపి అగ్ర నేతలను వరుసగా కలుస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.
* పెద్దల ఆగ్రహాన్ని తగ్గించేందుకే
విజయసాయిరెడ్డి బిజెపి అగ్రనేతల ఆగ్రహాన్ని తగ్గించేందుకే తరచూ కలుస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వైసిపి ఇండియా కూటమికి దగ్గరైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కూటమి జాతీయ నాయకులు సైతం జగన్ కు అండగా నిలిచారు. ఏపీలో టీడీపీ కూటమిలో బిజెపి ఉండడంతో.. జగన్ సైతం జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా మారాల్సిన అవసరం ఏర్పడింది. అదే సమయంలో తనపై అక్రమాస్తుల కేసులు మళ్లీ తెరపైకి వస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటన్నింటిపై చర్చించేందుకే బిజెపి అగ్ర నేతలను విజయసాయిరెడ్డి కలుస్తున్నారని టాక్ నడుస్తోంది.
* ఆ కథనాలు వెనుక
మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యుల వ్యవహారంపై ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. వారికి కూటమి నేతలు టచ్ లోకి వచ్చినట్లు సాక్షిలో ప్రత్యేక కథనం వచ్చింది. రాజ్యసభ సభ్యులకు కొనుగోలు వ్యవహారం జరుగుతోందని అనుమానిస్తూ వైసీపీ మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురిస్తుండడం విశేషం. సరిగ్గా ఇదే సమయంలో విజయసాయిరెడ్డి అమిత్ షా ను కలవడం వైసీపీకి షాక్ ఇచ్చే విషయమే. ఒక్కో ఎంపీ కి 50 నుంచి 70 కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారన్నది ఈ కథనం సారాంశం. సొంత పత్రికలోనే ఈ కథనాలు రావడంతో వైసీపీలో సైతం ఒక రకమైన ఆందోళన నెలకొంది.
* ఆ బిల్లుల ఆమోదం కోసమేనా?
రాజ్యసభలో వైసిపి పక్ష నేతగా విజయసాయిరెడ్డి ఉన్నారు. ప్రస్తుతం వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యుల బలం ఉంది. జగన్ ధైర్యం కూడా వీరే. అదే సమయంలో కొద్ది రోజులపాటు రాజ్యసభలో బిజెపికి బలం ఆశించిన స్థాయిలో ఉండదు. త్వరలో జరిగే ఎన్నికలతో రాజ్యసభలో బిజెపికి అవసరమైన ప్రాతినిధ్యం పెరుగుతుంది. అయితే అత్యవసరంగా కొన్ని కీలక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉంది. అందుకే విజయసాయిరెడ్డిని అమిత్ షా పిలిపించుకొని మాట్లాడినట్లు సమాచారం. మొత్తానికి అయితే విజయసాయిరెడ్డి కేంద్ర పెద్దలను వరుసగా కలుస్తుండడం రకరకాల అనుమానాలకు తావిస్తోంది.