Hariramajogayya: టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటుతోంది. పాలనతో పాటు సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది.అదే సమయంలో వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తోంది. సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు తమ పనుల్లో తాము ఉన్నారు. వీలైనంతవరకు పాలన సజావుగా సాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో కొన్ని సంక్షేమ పథకాల అమలు విషయంలో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై 50 రోజులు దాటుతోంది. ఇంతవరకు తల్లికి వందనం పేరిట చేస్తామన్న సాయంపై ఎటువంటి కసరత్తు జరగడం లేదు. మరోవైపు ఖరీఫ్ ప్రారంభమై చాలా రోజులవుతోంది. కొద్ది రోజుల్లో సీజన్ ముగియనుంది. అన్నదాత సుఖీభవ పేరిట 20వేల రూపాయలు అందిస్తామన్న పథకానికి అతిగతీ లేదు. మహిళలకు నెలకు 1500 రూపాయల సాయం విషయంలో ఒక సైతం స్పష్టత లేదు. అయితే గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు ఉంచి.. కొంత నిధులు సమీకరించి పథకాలు అమలు చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. అయితే పింఛన్ల మొత్తాన్ని పెంచి వరుసగా రెండో నెల అందించడంలో మాత్రం ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. టిడిపి ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు పెండింగ్ లో ఉండగా.. ఇప్పుడు జనసేన ప్రకటించిన షణ్ముఖ వ్యూహం పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు హరి రామ జోగయ్య. ఏకంగా సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన లేఖ రాశారు. షణ్ముఖ వ్యూహంలో భాగంగా కీలక పథకాన్ని అమలు చేయాలని కోరారు.
* షణ్ముఖ వ్యూహం ప్రస్తావన
పవన్ కళ్యాణ్ జనసేన పరంగా ఒక మేనిఫెస్టోను రూపొందించారు. దానికి షణ్ముఖ వ్యూహంగా పేరు పెట్టారు. వారాహి యాత్ర సందర్భంగా కీలకమైన ఒక పథకాన్ని ప్రస్తావించారు. ప్రతి యువకుడికి 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చే సౌభాగ్య పథకం గురించి హామీ ఇచ్చారు. ఇప్పుడు అదే పథకాన్ని అమలు చేయాలని హరి రామ జోగయ్య పట్టుబడుతున్నారు. సంపద చేకూర్చే ఈ పథకం వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. ఒక్క టిడిపి ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు మాత్రమే అమలు చేస్తారా? షణ్ముఖ వ్యూహం మాటేంటి? అని హరి రామ జోగయ్య ప్రశ్నించడం విశేషం.
* సరిగ్గా ఈ సమయంలోనే..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే సంక్షేమ పథకాల అమలు ఎలా అని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అమలు చేయడం చాలా కష్టం అన్నట్టు మాట్లాడారు. ఈ తరుణంలోనే హరి రామ జోగయ్య జనసేన ఇచ్చిన హామీలను సైతం అమలు చేయాలని కోరుతుండడం విశేషం. అయితే హరి రామ జోగయ్య చేస్తున్నది సూచన కాదని.. రాజకీయ హెచ్చరికలా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందులో రాజకీయ దురుద్దేశం ఉందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అసలు ఆ లేఖలు రాస్తుంది హరి రామ జోగయ్య? లేకుంటే ఆయన పేరిట వైసీపీ రాస్తుందా? అన్న అనుమానాలు ఉన్నాయి. ఎన్నికలకు ముందే హరి రామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరారు. దీంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
* లేఖల పరంపర
పవన్ కళ్యాణ్ కు లేఖ రాయడం ఇది తొలిసారి కాదు. ఎన్నికలకు ముందు నుంచే హరి రామ జోగయ్య లేఖలు రాస్తూనే ఉన్నారు. కాపు సంక్షేమ శాఖ సేన అంటూ ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు హరి రామ జోగయ్య. జనసేనకు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. కాపు రిజర్వేషన్ల కోసం వైసీపీ హయాంలో దీక్ష కూడా చేశారు. పవన్ విన్నపం మేరకు దీక్షను విరమించారు. అయితే ఎన్నికల్లో జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించాలని, సీఎం పదవిలో షేరింగ్ అడగాలని పవన్ పై ఒత్తిడి చేశారు హరి రామ జోగయ్య. అయితే ఆయన వ్యాఖ్యలు అనుమానంగా ఉండడం.. పొత్తుకు విఘాతం కలిగించేలా ఉండడంతో పవన్ పునర్ ఆలోచనలో పడ్డారు. అది అంతిమంగా వైసీపీకి ప్రయోజనం చేకూరుస్తుందని భావించారు. అందుకే హరి రామ జోగయ్య సూచనలను పరిగణలోకి తీసుకోలేదు. అది హరి రామ జోగయ్య లో ఆగ్రహానికి కారమైన కారణమైంది. ఇప్పటివరకు లేఖలు రాసి చికాకు పెడుతుంది అందులో భాగమేనని తెలుస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయన్న వేళ.. జనసేన ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలని హరి రామ జోగయ్య కోరుతుండడం విశేషం.