YS Sharmila : షర్మిలను మార్చుతారా?మందలిస్తారా? హై కమాండ్ కు ఫిర్యాదులు

 ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ షర్మిల. ఏపీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా హై కమాండ్ ఆమెకు పిసిసి పగ్గాలు అప్పగించింది. జగన్ ను అధికారం నుంచి దూరం చేసేందుకు వ్యూహం పన్నింది. అందుకు తగ్గట్టు షర్మిల కూడా పనిచేశారు. అయితే ఆమె వ్యక్తిగత అజెండాతో ముందుకెళ్తున్నారని సీనియర్లు ఇప్పుడు ఫిర్యాదు చేయడం విశేషం.

Written By: Dharma, Updated On : October 3, 2024 4:15 pm

YS Sharmila

Follow us on

YS Sharmila :  వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయా? ఉన్న కొద్దిపాటి మంది సీనియర్లు ఆమెను వ్యతిరేకిస్తున్నారా? ఆమెపై హై కమాండ్ కు ఫిర్యాదులు వెళుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరిట రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు షర్మిల. సుదీర్ఘకాలం  తెలంగాణలో కూడా పాదయాత్ర చేశారు. కానీ అనుకున్న స్థాయిలో తెలంగాణ ప్రజల నుంచి స్పందన రాలేదు. దీంతో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు షర్మిల. అటు తరువాత కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. గతంలో తన సోదరుడు జగన్ కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చినప్పుడు ఆయనకు బాహటంగా మద్దతు తెలిపారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ పై విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో చేరి అందరి దృష్టిని ఆకర్షించారు. జగన్ దూకుడుకు కళ్లెం వేయాలని భావించిన కాంగ్రెస్ పార్టీ.. షర్మిలను ప్రయోగించింది. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిమితమైన సీనియర్ నాయకులు ఆమె రాకను ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ బలుపేతానికి ఆమె కారణమవుతారని భావించారు. కానీ ఎన్నికల్లో కనీస స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలం పెరగలేదు. ఎన్నికల తరువాత కూడా ఆమె వైఖరి మారలేదు.  సొంత అజెండాతో ముందుకెళ్లడంతో సీనియర్లు నేరుగా అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.
 * జగన్ కు నష్టం 
షర్మిల నియామకం జగన్ కు ఇబ్బందికరంగా మారింది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.గతంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని ఆదరణ ఉండేది.రాజశేఖర్ రెడ్డి మరణం,రాష్ట్ర విభజన,వైసిపి ఆవిర్భావంతో..  కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పలుచన అయ్యింది. పార్టీ నుంచి గుంప గుత్తిగా నేతలు వైసీపీలో చేరిపోయారు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ సైతం వైసీపీ వైపు టర్న్ అయ్యింది.అయితే షర్మిలకు బాధ్యతలు అప్పగించిన తర్వాత క్యాడర్ ఇటు వస్తుందని హై కమాండ్ భావించింది.అందుకే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి నేతల ఆదరణ పెరిగింది.కొత్త ఓటింగ్ శాతం పెరుగుతుందని భావించి చాలామంది టిక్కెట్లు ఆశించారు.ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా డిపాజిట్ దక్కించుకోలేదు. కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన షర్మిల మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
 * నెరవేరిన అసలు లక్ష్యం
అయితే కాంగ్రెస్ అసలు లక్ష్యం నెరవేరింది. ఏపీలో తనను దారుణంగా దెబ్బతీసిన జగన్అధికారానికి దూరం కావడం ఆ పార్టీకి ఉపశమనం కలిగించే విషయం.ఈ విషయంలో షర్మిలకు మంచి మార్కులు పడ్డాయి. జగన్ దారుణ పరాజయం వెనుక షర్మిల ఉన్నారన్నది ఒక ప్రధాన విశ్లేషణ. అయితే ఇప్పుడు ఎన్నికలు ముగిసి దాదాపు 6 నెలలు అవుతుంది. వైసీపీ అధికారానికి దూరమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.కానీ ఇంకా షర్మిల వ్యక్తిగత అజెండాతో ముందుకు వెళుతున్నట్లు విమర్శలు ఉన్నాయి.ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సీనియర్ నేత రఘువీరారెడ్డి ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో షర్మిల వ్యక్తిగత అజెండా ఒక్కసారి పరిశీలించండి అన్నది ఆ ఫిర్యాదు సారాంశం. అయితే అంతకంటే ముందే టిక్కెట్ల కోసం డబ్బులు వసూలు చేశారని చాలామంది నేతలు ఫిర్యాదు చేశారు. ఇలా వరుస ఫిర్యాదులతో హై కమాండ్ సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే ఆమెను మార్చుతారా? లేకుంటే మందలిస్తారా? అన్నది చూడాలి.