MLC Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ విషయంలో వైసిపి హై కమాండ్ ఆలోచన ఏంటి? ఆయనపై చర్యలకు ఎందుకు వెనుకడుగు వేస్తోంది? భయపడుతోందా? లేకుంటే దువ్వాడ శ్రీనివాసు నుంచి మరో డిమాండ్ వినిపిస్తోందన్న భయమా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత పది రోజులకు పైగా దువ్వాడ ఫ్యామిలీ వివాదం నడుస్తోంది. హై కమాండ్ మాత్రం ఇంతవరకు కలుగజేసుకోలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప ప్రత్యేక ప్రకటన కూడా జారీ చేయలేదు. ఈ ఎపిసోడ్ తో వైసీపీకి భారీ డ్యామేజ్ తప్పదని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ కు పార్టీ అన్ని ఇచ్చిందని.. కానీ ఆయన మాత్రం పార్టీకి డ్యామేజ్ తెచ్చి పెట్టారని వైసిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2014, 2024 ఎన్నికల్లో జగన్ టెక్కలి అసెంబ్లీ సీటును దువ్వాడకు ఇచ్చారు. 2019లో ఎంపీ సీటును ఇచ్చినా నెగ్గుకు రాలేకపోయారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండే దువ్వాడ శ్రీనివాస్ దూకుడు కలిగిన నేత. ఇతర నాయకులతో ఆయనకు పడదు. వైసీపీలో కూడా సేమ్ పరిస్థితి. సొంత సామాజిక వర్గం సైతం ఆయనను వ్యతిరేకిస్తుంది. కనీసం కలుపుకునే ప్రయత్నం కూడా ఆయన చేయరు. పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోవడానికి అదే ప్రధాన కారణం. అయితే ఇలా వరుస ఓటమి చెందిన దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు జగన్. ఆ గౌరవాన్ని కూడా ఆయన నిలబెట్టుకోలేకపోయారు. కుటుంబ వివాదంతో పార్టీకి పరువు తీశారు. టెక్కలిలో పార్టీని పూర్తిగా డామేజ్ చేశారు. అయినా సరే హై కమాండ్ చర్యలకు ఉపక్రమించకపోవడం విశేషం.
*దూకుడు నేత
దువ్వాడ శ్రీనివాస్ దూకుడు నేత. నోరు పారేసుకుంటారు కూడా. ఇప్పుడు హై కమాండ్ చర్యలకు దిగితే తప్పకుండా ఆయన రియాక్ట్ అవుతారు. గతంలో విజయసాయి రెడ్డి పై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోరు? అని ప్రశ్నించడానికి కూడా దువ్వాడ వెనుకడుగు వేయరు. అందుకే హై కమాండ్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వైసిపి నేతలపై చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. వారి విషయంలో లేని అభ్యంతరాలు తన విషయంలో ఏంటని దువ్వాడ ప్రశ్నించే అవకాశం ఉంది.
* జగన్ ప్రోత్సాహం
దువ్వాడ వ్యవహార శైలి జిల్లా వైసీపీ నేతలకు తెలుసు. కానీ ఆయనను జగన్ చేరదీసి ప్రోత్సహించారు. ఈ విషయంలో జిల్లా వైసీపీ నేతలు అభ్యంతరాలను సైతం పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు వారు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.అయితే పార్టీకి డ్యామేజ్ జరుగుతోందని వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే దువ్వాడ శ్రీనివాస్ రాజీనామాకు హై కమాండ్ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. కానీ రోజులు గడుస్తున్నా దువ్వాడ నుంచి ఎటువంటి ప్రకటన లేదు.
* ఫిర్యాదుల వెల్లువ
దువ్వాడ శ్రీనివాస్ పార్టీలో ఉంటే తాము ఉండలేమని.. తామంతా పార్టీ నుంచి వెళ్ళిపోతామని కొంతమంది నేతలు బాహటంగానే చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడను పార్టీ నుండి సస్పెండ్ చేస్తేనే టెక్కలిలో వైసిపి బతుకుతోందని కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ జిల్లా నేతలు దువ్వాడ విషయంలో.. ఏదో ఒకటి తేల్చేయాలని హై కమాండ్ ను కోరినట్లు సమాచారం. అయితే పరిస్థితిని గమనించిన హై కమాండ్ ఒకటి రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.