IPS Officers Issue: ఆ 16 మంది ఐపీఎస్ అధికారులు డిజిపి కార్యాలయంలో సంతకాలు పెట్టాల్సిందేనా!

గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఓ 16 మంది ఐపీఎస్ ల విషయంలో వివాదం నెలకొంది. వారంతా వైసిపి అస్మదియ అధికారులను భావించి వెయిటింగ్ లో పెట్టారు. నిర్దేశిత సమయానికి వచ్చి రిజిస్టర్లో సంతకాలు పెట్టాలని నిబంధనలు పెట్టారు.

Written By: Dharma, Updated On : August 19, 2024 8:17 am

IPS Officers Issue

Follow us on

Ips Officers Issue: ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే కొందరు అధికారులపై వేటు పడింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. కొందరిని సాధారణ పరిపాలన శాఖకు సరెండర్ చేశారు. ముఖ్యంగా వైసీపీకి వీర విధేయత ప్రదర్శించిన వారికి పోస్టింగులు దక్కలేదు. వారంతా సాధారణ పరిపాలన శాఖలో రిజర్వులో పెట్టారు. ప్రభుత్వాలు మారిన వెంటనే తమకు అనుకూలమైన అధికారులను తెచ్చుకోవడం సాధారణం. తమకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారులను రిజర్వులో పెట్టడం కూడా అంతే సాధారణం. అయితే తాజాగా ఓ 16 మంది కీలక ఐపీఎస్ అధికారుల విషయంలో మాత్రం రచ్చ ప్రారంభమైంది. వీరిని వెయిటింగ్ లో పెట్టి నిబంధనలు పాటించాలని స్పష్టం చేయడం విమర్శలకు తావిస్తోంది. వెయిటింగ్ లో ఉన్న వీరిని ఉదయం 10 గంటలకు డిజిపి ఆఫీసుకు రావాలని.. సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే ఉండాలని ఆదేశించడం.. రిజిస్టర్లలో సంతకాలు చేసి వెళ్ళాలని పేర్కొనడంతో వివాదంగా మారింది. వాస్తవానికి వెయిటింగ్ లో ఉన్న అధికారులు డిజిపి కార్యాలయానికి రావాలా? అవసరం లేదా? అనే విషయం ఇప్పటివరకు చర్చకు రాలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఆదేశాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. చర్చకు దారి తీసాయి. నిజానికి ఏ ఐపీఎస్ అయినా.. ఐఏఎస్ అయినా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు. ఈ ప్రభుత్వంలోనైనా ఇది కామన్. అప్పటి పాలకులు చెప్పిన మాదిరిగానే వారు వింటారు. అలానే నడుచుకుంటారు. అయితే వైసిపి హయాంలో కొంతమంది అధికారులు అతి చేశారు. తమ అధికారిక హోదాను పక్కనపెట్టి పార్టీ కార్యకర్తగా మారిపోయారు. ఇప్పుడు ఈ ఇబ్బంది రావడానికి అదే కారణం.

* గత ఐదేళ్ల పరిణామాలతో
గత ఐదేళ్లుగా ప్రశ్నిస్తే కేసులు, దాడులు జరిగాయి. దీనికి కొంతమంది అధికారుల ప్రోత్సాహం ఉండడాన్ని టిడిపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో దాదాపు 50 మంది వరకు టిడిపి కీలక నేతలపై కేసులు నమోదయ్యాయి. అందులో చాలామంది అరెస్టుల తీరుపై అభ్యంతరాలు ఉన్నాయి. అర్ధరాత్రి గోడ దూకి మరి అరెస్టులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబుపై కేసుల పెట్టిన విధానం గురించి ఎక్కువగా టిడిపి నేతలు ప్రస్తావిస్తున్నారు. అటువంటి ఐపీఎస్ అధికారులపై సహజంగానే కోపం వస్తుంది. అదే కోపానికి ఇప్పుడు నాటి ఐపీఎస్ అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

* సాయంత్రం వరకు ఉండాల్సిందే
తాజాగా 16 మంది ఐపీఎస్ లను పక్కన పెట్టారు. వారు డిజిపి కార్యాలయానికి వచ్చి సంతకాలు పెట్టాల్సిందేనని.. సాయంత్రం వరకు అక్కడ ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు.అయితే దీనిపై ఏపీ నుంచి ఎటువంటి విమర్శలు రావడం లేదు. కానీ తెలంగాణకు చెందిన మాజీ డిజిపి స్వర్ణజీత్ సేన్ తో పాటు మరికొందరు స్పందించారు. అయితే గత వైసిపి పాలనలో చాలామంది ఐపీఎస్ అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారని.. తాము ఉన్నతాధికారులను అన్న విషయం మరిచిపోయారని.. అటువంటి సమయంలో మీరు ఎందుకు మాట్లాడలేదని టిడిపి నేతలు ప్రశ్నించారు. తాము చేసింది తప్పు కాదని ప్రభుత్వ అనుకూల వర్గాలు వాదిస్తున్నాయి.

* ఆ నిబంధన తప్పనిసరి
వాస్తవానికి డిజిపి ఆఫీసులో రిపోర్టు చేయాల్సిన అధికారులు తప్పకుండా రోజు హాజరు వేసుకోవాలి. నిర్దేశిత సమయానికి వచ్చి సంతకాలు పెట్టాలి. ఇది ఖచ్చితమైన నిబంధన కూడా. అయితే తొలిసారిగా టిడిపి ప్రభుత్వం దీనిని అమలు చేస్తుండడంతో వివాదానికి కారణం అవుతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయవచ్చు కదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వీరి విషయంలో ఏపీ ప్రభుత్వం త్వరగా ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.