Jharkhand Truck Driver: ఓ ట్రక్ డ్రైవర్ యూట్యూబర్ అయ్యాడు.. నెలకు ఎంత సంపాదిస్తున్నాడంటే..

అతని పేరు రాజేష్. సొంత రాష్ట్రం జార్ఖండ్. పెద్దగా చదువుకోలేదు. అతని వృత్తి ట్రక్ డ్రైవర్. ట్రక్ లో సరుకు వేసుకోవడం చెప్పినచోట దించి రావడం అనేది అతని వృత్తి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అతడు తిరుగుతుంటాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 19, 2024 8:34 am

Jharkhand Truck Driver

Follow us on

Jharkhand Truck Driver: సామాజిక మాధ్యమాలు వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త ఆదాయ మార్గాలు తెరపైకి వస్తున్నాయి. ఈ ఆదాయ మార్గాలను వీలైనంత తొందరలో దక్కించుకోవాలని చాలామంది సామాజిక మాధ్యమాలలో విస్తృతమైన వ్యక్తులుగా చలామణి కావాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అయితే అందులో కొంతమందిని మాత్రమే విజయలక్ష్మి వరిస్తోంది. మిగతావారు సామాజిక మాధ్యమాలపై పట్టు సాధించడం ఎలాగో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

అతని పేరు రాజేష్. సొంత రాష్ట్రం జార్ఖండ్. పెద్దగా చదువుకోలేదు. అతని వృత్తి ట్రక్ డ్రైవర్. ట్రక్ లో సరుకు వేసుకోవడం చెప్పినచోట దించి రావడం అనేది అతని వృత్తి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అతడు తిరుగుతుంటాడు. సరుకు రవాణా చేసే క్రమంలో చాలా రోజులు ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి.. తన వెంట వంటసామాగ్రి తీసుకెళ్తుంటాడు. ఏదైనా ఒక ప్రాంతం దగ్గర ట్రక్ ఆపి వంట తయారు చేసుకుని ఆరగిస్తాడు. ఆ తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకొని.. మళ్లీ తన ట్రక్ ను ప్రారంభిస్తాడు. ఈ వంట చేసే క్రమంలో అతడు వీడియో తీసి తన యూట్యూబ్ ఖాతాలో పోస్ట్ చేస్తాడు. మొదట్లో సరదాగా ప్రారంభమైన ఈ వ్యవహారం తర్వాత అతడిని సెలబ్రిటీ చేసింది. ప్రస్తుతం ఆయన ఛానల్ ను 1.86 మిలియన్ సబ్స్క్రైబర్లు అనుసరిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా అతడికి నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ప్రతినెల సంపాదన లభిస్తోంది. ట్రక్ డ్రైవర్ గా అతడు నెలకు 30,000 దాకా ఆర్జిస్తున్నాడు.

మిగతా యూట్యూబర్ ల లాగా రాజేష్ హంగూ ఆర్భాటాల జోలికి వెళ్లడు. సరదాగా మాట్లాడుకుంటూ వంట చేసుకుంటాడు. ఆ తర్వాత తృప్తిగా ఆరగిస్తాడు. ఇందులో ఎటువంటి కృత్రిమత్వం ఉండదు. అతడి సహజ శైలిని ఆ వీడియోలో ప్రతిబింబిస్తాడు. అందువల్లే అతడు ఆ స్థాయిలో సెలబ్రిటీ అయ్యాడు.. అతడు వంట చేస్తున్న విధానం చాలామందికి నచ్చడంతో.. ఛానల్ ను అనుసరించడం మొదలుపెట్టారు. హేమాహేమీలకు కూడా సాధ్యం కాని ఘనతను రాజేష్ సొంతం చేసుకున్నాడు. రాజేష్ వ్యవహార శైలి ప్రఖ్యాత వ్యాపారవేత ఆనంద్ మహీంద్రా కు విపరీతంగా నచ్చింది. ఈ నేపథ్యంలో రాజేష్ వంట చేసే తీరుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని ఆ వీడియోలో ఆనంద్ మహీంద్రా పేర్కొన్నాడు.

ఇక మన దేశంలో సుప్రసిద్ధ వార్త చానల్స్ గా పేరుపొందిన టైమ్స్ ఆఫ్ ఇండియా, రిపబ్లిక్ టీవీ, ఇండియా టీవీ రాజేష్ జీవనయానాన్ని ప్రత్యేక కథనాలుగా ప్రసారం చేశాయి. ఎక్కడో జార్ఖండ్లో పుట్టిన రాజేష్.. పెద్దగా చదువుకోలేదు. అతడు సెలబ్రిటీ కూడా కాదు. అయినప్పటికీ తన సహజత్వాన్ని పంచుకున్నాడు. తన కష్టాన్ని ప్రతిబింబించాడు. తాను వండుకునే తీరును చూపించాడు. అందులో కృత్రిమత్వం లేదు. ఇబ్బంది కలిగించే భాష లేదు. చిరాకు కలిగించే విన్యాసమూ లేదు. అందుకే నెటిజన్లకు నచ్చింది. అతడిని సెలబ్రిటీ చేసింది. నెలకు నాలుగు నుంచి ఐదు లక్షల దాకా సంపాదించే వ్యక్తిగా మలచింది. ఆ సంపాదనతో రాజేష్ సొంత ఇల్లు నిర్మించుకున్నాడంటే అతిశయోక్తి కాదు. అన్నట్టు ఈ సంపాదనతో తన పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తున్నాడు రాజేష్.