SI Sudhakar : ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి ( Jagan Mohan Reddy) సవాల్ చేశారు ఓ సామాన్య ఎస్ఐ. నిలదీసినంత పని చేశారు. బట్టలూడదీయడమంటే అరటి తొక్క తీయడమా అని ఎద్దేవా చేశారు. రాయలసీమలోనూ అందులోనూ అనంతపురం జిల్లాలో ఓ ఎస్ఐ జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేసేటంత ధైర్యం నిజంగా అభినందనీయం. సాధారణంగా రాజకీయ నేతలతో వివాదం పెట్టుకునేందుకు ఏ అధికారి సాహసించరు. అటువంటిది ఏకంగా మాజీ సీఎంను సవాల్ చేశారు ఆ సాధారణ ఎస్ఐ. అయితే ఆయన సాధారణ ఎస్ఐ కాదని.. అసాధారణ ఎస్ఐ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తోంది.
Also Read : బట్టలూడదీస్తావా? జగన్ కి మహిళ పోలీస్ స్ట్రాంగ్ కౌంటర్.
* రాప్తాడు లో జగన్ పర్యటన..
నిన్ననే అనంతపురం జిల్లా( Ananthapuram district) రాప్తాడు లో పర్యటించారు జగన్మోహన్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేత లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారు. మరోవైపు మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి వివాదం కూడా నడిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులకు పోలీసుల బెదిరించారని ప్రచారం సాగింది. ఈ తరుణంలో మృతుడి కుటుంబ సభ్యుల పరామర్శకు రాప్తాడు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో బెదిరింపులకు బాధితులుగా మారిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులు సైతం జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. హాట్ కామెంట్స్ చేశారు.
* ఎస్సై తీరుపై ఆగ్రహం..
ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ తీరును తప్పు పట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులను వాట్సాప్ కాల్ చేసి బెదిరిస్తావా అంటూ ప్రశ్నించారు. ఇటువంటి పోలీస్ అధికారులను బట్టలూడదీసి నిలబెడతామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అయితే దీనిపై కౌంటర్ ఇచ్చారు రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్. బట్టలూడదీయడానికి ఇది అరటి తొక్క కాదు అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు కూటమి నేతలు సైతం ఎస్సై కు మద్దతు తెలిపారు. హోం మంత్రి అనిత జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. ఓ క్రిమినల్ కు ఇంతకంటే ఆలోచన వస్తుందా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. మరోవైపు పోలీస్ అధికారుల సంఘం కూడా జగన్ వ్యాఖ్యలను ఖండించింది. అయితే ఈ క్రమంలో రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* టిడిపి కీలక నేతలతో సన్నిహితంగా..
టిడిపి కీలక నేత నారా లోకేష్, టిడిపి కీలక మంత్రులు, రాప్తాడు ఎమ్మెల్యే సునీతతో ఎస్సై సుధాకర్ యాదవ్ ఉన్న ఫోటోలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. ఇది మనవాడి బ్యాక్ గ్రౌండ్ అంటూ చెబుతోంది. ఆయన తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతు దారుడు అని.. అందుకే రాప్తాడు నియోజకవర్గంలో ఆయన ఆగడాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారింది.