Roja: మాజీ మంత్రి ఆర్కే రోజా( EX minister Roja) చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఆమెపై చర్యలకు కూటమి సర్కార్ సిద్ధమవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.400 కోట్ల అవినీతికి సంబంధించి ఆమెను టార్గెట్ చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది ఏపీ సర్కార్. ఇప్పటికే దీనిపై అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. దీనిపై సంబంధిత మంత్రి సైతం స్పష్టమైన ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని చెప్పుకొచ్చారు. దీనిపై ఏసీబీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. మంత్రి రోజాతో పాటు మరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం తరువాత టార్గెట్ మాజీ మంత్రి రోజా అని తేలిపోయింది.
Also Read: టీమిండియా గెలిచిన ఊపులో..వీళ్ళను మర్చిపోయాం..ఇందులో మన ఇండియన్ కూడా ఉన్నాడు..
* సరిగ్గా ఎన్నికలకు ముందు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో రోజా క్రీడల శాఖ మంత్రిగా ఉండేవారు. సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా యువతకు క్రికెట్ కిట్లు ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా పోటీలు నిర్వహించారు. ఇందులో 119 కోట్ల రూపాయలను 45 రోజుల్లోనే ఖర్చు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల నిధులను మళ్లించి.. మొత్తం 400 కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై టిడిపి ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రశ్నించారు. క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. కొద్ది రోజుల్లో ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకలపై ఏసీబీ తో విచారణ చేయించేందుకు ఏపీ ప్రభుత్వం సిఫారసు చేయబోతోంది.
* ఆమెదే క్రియాశీలక పాత్ర
అప్పట్లో క్రీడల శాఖ మంత్రిగా( sports minister) ఉన్న ఆర్కే రోజా ఈ కార్యక్రమం విషయంలో కీలక పాత్ర పోషించినట్లు ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆమె చుట్టూ ఉచ్చు బిగించేందుకు ఏపీ ప్రభుత్వం పాలు కలుపుతోంది. ఈ నిధుల విడుదల కోసం రోజా మంత్రిగా ఇచ్చిన ఆదేశాలు, క్షేత్రస్థాయిలో పెట్టిన వాస్తవ ఖర్చు… ఇలా ప్రతి అంశాలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. వీటి ఆధారంగా త్వరలోనే ఏసీబీ దర్యాప్తు చేసేలా ఆదేశాలు జారీ చేస్తారని సమాచారం. అదే జరిగితే రోజాకు ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా అప్పట్లో ఈ కార్యక్రమ ప్రారంభానికి హాజరయ్యారు సీఎం జగన్మోహన్ రెడ్డి. భారీగా ఖర్చు చేశారని అప్పట్లోనే ఆరోపణలు ఉన్నాయి.
* క్రీడా సంఘాల నేత ఫిర్యాదు
కొద్ది రోజుల కిందట క్రీడా సంఘాలకు( sports association) చెందిన వ్యక్తి ఒకరు నేరుగా ఫిర్యాదు చేశారు. అప్పట్లో భారీగా అవినీతి జరిగిందని.. క్రీడా సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిధులు మళ్లించారని ఆరోపించారు. ఇందులో అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా పాత్ర ఉందని ఆరోపణలు చేశారు. అప్పటినుంచి అదిగో ఇదిగో అంటూ రోజాపై చర్యలు ఉంటాయని భావిస్తూ వచ్చారు. ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేలు ప్రశ్నించడం, దానికి మంత్రి బదులు ఇవ్వడం, దర్యాప్తు చేస్తామని చెప్పడంతో రోజా చుట్టూ బిగడం ఖాయమని తేలుతోంది.