Shreyas Iyer: టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ విధించిన 252 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించడంలో టీమిండియా మొదట్లో దీటుగానే బ్యాటింగ్ చేసింది. ఆ తర్వాత వెంటవెంటనే గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వికెట్లను కోల్పోయింది. ఈ దశలో టీమ్ ఇండియా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంది.
Also Read: టీమిండియా గెలిచిన ఊపులో..వీళ్ళను మర్చిపోయాం..ఇందులో మన ఇండియన్ కూడా ఉన్నాడు..
భారత జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆపద్బాంధవుడి అవతారం ఎత్తాడు శ్రేయస్ అయ్యర్. 48 పరుగులు చేసి టీమ్ ఇండియాను కష్టాల నుంచి దూరం చేశాడు. వాస్తవానికి అతడు హాఫ్ సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అతడు క్యాచ్ అవుట్ కావడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అయినప్పటికీ కె.ఎల్ రాహుల్, అక్షర్ పటేల్ మెరుగ్గా బ్యాటింగ్ చేశారు. అక్షర్ ఔట్ అయినప్పటికీ హార్దిక్ పాండ్యా జత కావడంతో కెఎల్ రాహుల్ మిగతా పని మొత్తం పూర్తి చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్ పై 15, పాకిస్తాన్ పై 56, న్యూజిలాండ్ జట్టుపై 79, ఆస్ట్రేలియా పై 45, న్యూజిలాండ్ జట్టుపై 48 పరుగులు చేశాడు. మొత్తంగా మిడిల్ ఆర్డర్లో కీలకమైన బ్యాటర్ గా పేరు తెచ్చుకున్నాడు. అతడు కష్టకాలంలో కీలకమైన ఇన్నింగ్స్ ఆడటంతో భారత జట్టు విజయాలు సాధించగలిగింది. ఫైనల్ లో కూడా శ్రేయస్ అయ్యర్ స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించాడు. న్యూజిలాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
అండగా కొంతమంది మాత్రమే నిలబడ్డారట..
టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన తర్వాత శ్రేయస్ అయ్యర్ పేరు మార్మోగిపోతుంది. మిడిల్ ఆర్డర్లో అతడు కీలక ఆటగాడి గా నిలిచాడని మీడియా కోడైకూస్తోంది. ఇక సీనియర్ క్రికెటర్లు అయితే అతడిని వెయ్యినోళ్ల పొగుడుతున్నారు. అయితే అయ్యర్ బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు కోల్పోయిన తర్వాత తీవ్ర ఇబ్బందిపడ్డాడు. ఈ సమయంలోనే ఐపీఎల్లో కోల్ కతా జట్టుకు నాయకత్వం వహించి ట్రోఫీ అందుకునేలా చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టాడు. ఇక ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చూపించాడు. శ్రేయస్ అయ్యర్.. సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన తర్వాత ఎవరూ అతడికి అండగా నిలవలేదట. భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన తర్వాత అతడికి పెద్దగా గౌరవం దక్కలేదట. ” కొన్నిసార్లు మనం ఎంతో కష్టపడుతుంటాం. కానీ అది వృధా అవుతుంది. భారత టెస్టుజట్టు లో చోటు కోల్పోయాను. సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయాను. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను. బాధపడ్డాను. అటువంటి కష్ట కాలంలో నాకు కొంతమంది మాత్రమే అండగా నిలిచారు. ఆ తర్వాత నన్ను నేను నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నించాను. వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నాను. అందువల్లే ఇప్పుడు ఇలా నిలబడ్డానని” శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యానించాడు. అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి.