Kuppam: రెవెన్యూ శాఖలో లంచం అనేది పేరుకు పోయిందన్న విమర్శ ఉంది. అందరూ ఉద్యోగులు లంచం తీసుకుంటారని చెప్పలేం కానీ.. లంచం లేనిదే రెవెన్యూ శాఖలో ఫైల్ కదలదన్న ఆరోపణ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇటువంటి తరుణంలో ఒక ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. ఏకంగా రాష్ట్ర ప్రతిపక్ష నేత నుంచి లంచం డిమాండ్ చేశారు అధికారి. డబ్బు ఇవ్వనిదే పని జరగదని తేల్చి చెప్పారు. దీంతో లక్ష రూపాయల లంచం ఇచ్చి పనిచేయించుకోవాల్సి వచ్చింది. అయితే కాలమంతా ఒకేలా ఉండదు కనుక.. లంచం ఇచ్చిన ప్రతిపక్ష నేత అధికారంలోకి వచ్చారు. లంచం తీసుకున్న ఉద్యోగిపై అధికారులు వేటు వేశారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ ఈ స్టోరీ. ఇందులో బాధితుడు సీఎం చంద్రబాబు కావడం విశేషం. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడేపల్లె పంచాయితీ శివపురం వద్ద స్థలాన్ని కొనుగోలు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో ఇంటి నిర్మాణం చేసేందుకు.. స్థానిక టిడిపి నాయకులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు చేసుకున్నారు. స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరారు. అయితే ఆ స్థలం చంద్రబాబుది అని తెలిసి కూడా డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ రూ.1.80 లక్షల లంచాన్ని డిమాండ్ చేశారు. ఆ మొత్తం ఇవ్వడంతో ఫైల్ కదిలింది. ఇంటి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
అయితే తాజాగా సీఎం అయిన తర్వాత చంద్రబాబు కుప్పం పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బస చేసిన సమయంలో స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది.దీనిపై కలెక్టర్ సుమిత్ కుమార్, జెసి శ్రీనివాసులు ఆరా తీశారు. దీంతో లంచం బాగోతం వెలుగు చూసింది. వెంటనే సర్వే శాఖ ఏడి గౌస్ బాషా తో విచారణ చేయించగా నిజమేనని తేలింది. అదే సమయంలో డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ పై ఇటీవల విపరీతమైన ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటిపై విచారణ చేపట్టిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. సోమవారం రాత్రి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.