Vijayawada: పవన్ కాపాడిన కేసులో సంచలన నిజం

తేజస్విని అదృశ్యమైంది విజయవాడలో. అక్కడ నుంచి విశాఖ వెళ్ళింది ఆ ప్రేమ జంట. అటు తరువాత హైదరాబాద్, ఆ తరువాత బెంగళూరు వెళ్లారు. అంతటితో ఆగకుండా ఢిల్లీకి మకాం మార్చారు.

Written By: Dharma, Updated On : July 5, 2024 10:28 am

Vijayawada

Follow us on

Vijayawada: పవన్ ఆదేశాలతో తేజస్విని అనే యువతి అదృశ్యం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించిన సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ లో అదృశ్యమైన తేజస్వినిని పోలీసులు కశ్మీర్లో గుర్తించారు. ఆమె ప్రేమికుడు అంజాద్ ను విజయవాడ తీసుకొచ్చారు. యువతిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంజాద్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక్కడితో కథ సుఖాంతం అయిందని అంతా భావించారు. కానీ ఈ ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ విషయాన్ని పోలీసులతో పాటు మీడియా సైతం పట్టించుకోకపోవడం విశేషం.

తేజస్విని అదృశ్యమైంది విజయవాడలో. అక్కడ నుంచి విశాఖ వెళ్ళింది ఆ ప్రేమ జంట. అటు తరువాత హైదరాబాద్, ఆ తరువాత బెంగళూరు వెళ్లారు. అంతటితో ఆగకుండా ఢిల్లీకి మకాం మార్చారు. అక్కడి నుంచి కాశ్మీర్ వెళ్లిపోయారు. గత తొమ్మిది నెలలుగా అక్కడే గడుపుతున్నారు. కనీసం ఆమెకు ఫోన్ కూడా అందుబాటులో లేనంతగా బందీగా మార్చేశారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. సాధారణంగా ప్రేమ జంట అంత దూరం వెళ్లేందుకు సాహసించరు. ఏదో హైదరాబాదు.. బెంగళూరు వెళ్తారు. కానీ ఏకంగా కశ్మీర్ వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా ఇతర ప్రాంతాల వారికి కాశ్మీర్లో చోటు ఉండదు. అక్కడ ఉండాలంటే సహేతుకమైన కారణం ఉండాలి. కేవలం 7500 రూపాయల జీతం కోసం హోటల్లో పనిచేసినట్లు అంజాద్ చెబుతున్నాడు. కానీ అది నమ్మశక్యం కాని విషయం. తరచూ సిమ్ కార్డులను కూడా మార్చడం అనుమానాలకు తావిస్తోంది.

భీమవరానికి చెందిన తేజస్విని విజయవాడలోని పెద్దమ్మ ఇంట్లో ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తోంది. అదే కళాశాలలో అంజాద్ గతంలో చదువుకునేవాడు. ఈ నేపథ్యంలోనే దర్శన్ అనే యువకుడికి ఆ కాలేజీలో చేర్పించాడు. మరో యువతిని కూడా హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేర్చాడు. అదే సమయంలో తేజస్విని చేరింది. తేజస్విని పెద్దగా లోకజ్ఞానం తెలియని యువతి. బెరుకుగా కనిపించేది. అంజాద్ దర్శన్ తో పాటు మరో యువతీ ద్వారా తేజస్వినిని ట్రాప్ చేశాడు.ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. పది రోజుల్లో మరింత దగ్గరయ్యాడు. ఓ రోజు లవ్ ప్రపోజ్ చేశాడు. కానీ అందుకు తేజస్విని అంగీకరించలేదు. దీంతో వెంటనే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడు. ప్రేమించకుంటే రైలు కిందపడి చనిపోతానని హెచ్చరించాడు. అందుకు నువ్వే కారణమని సూసైడ్ లెటర్ రాస్తానని కూడా చెప్పుకొచ్చాడు. తల్లిదండ్రులంటే భయపడే తేజస్విని అంజాద్ మాటలకు నమ్మి ఆయనతో వెళ్లేందుకు సిద్ధపడింది. పోలీసుల దర్యాప్తులో కూడా తేజస్విని ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది.

అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్నెన్నో అనుమానాలు ఉన్నాయి. లవ్ జిహాద్ తరహాలో ఈ ఘటన జరిగినట్లు పోలీసు వర్గాలు సైతం అనుమానిస్తున్నాయి. అప్పటివరకు అంజాద్ బెంగళూరులో ఉద్యోగం చేసుకునేవాడు. ప్రేమతో తేజస్విని తీసుకెళ్తే బెంగళూరు తీసుకెళ్లాలి. కానీ ముందుగా విశాఖ తీసుకెళ్లాడు. తరువాత హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ.. ఇలా స్థలాలను మార్చాడు. ఫోన్ నెంబర్లను సైతం మార్చాడు. చివరకు కాశ్మీర్ తీసుకెళ్లి 9 నెలల పాటు ఉంచాడు. కచ్చితంగా దీని వెనుక ఉగ్ర నీడలుఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి. గతంలో మహిళల అదృశ్యం వెనుక పవన్ పలు రకాల అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ చొరవతో అదృశ్యమైన యువతి కేసు మిస్టరీ వీడినా.. దాని వెనుక అనేక రకాల అనుమానాలు ఉండడం విశేషం. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తే.. మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.