YSR Congress party : ఓటమికంటే పార్టీ నేతల వైఖరి జగన్ ను బాధపెడుతోంది. ఐదేళ్ల పాటు పదవులు అనుభవించి, డబ్బులు సంపాదించిన నేతలు ఇప్పుడు కనిపించకుండా పోయారు. పార్టీ బాధ్యతలు అప్పగిస్తే విముఖత చూపుతున్నారు. పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో గతంలో జగన్ వద్దనుకున్న నేతలు ఇప్పుడు గత్యంతరంగా మారుతున్నారు. చివరకు యాంకర్ శ్యామలకు కూడా అధికార ప్రతినిధి పదవి ఇచ్చారంటే పరిస్థితి ఎంతవరకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.పార్టీ అధికార ప్రతినిధులుగా మాజీ మంత్రి ఆర్కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, యాంకర్ శ్యామల తదితరులను నియమించారు. వైసిపి సంస్థగత పదవులను భర్తీ చేసేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వైసీపీ నేతలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేకమంది అధికారం అనుభవించారు. విపరీతంగా సంపాదించుకున్నారు. పార్టీ కష్ట కాలంలో మాత్రం వారి సేవలు ఉపయోగపడటం లేదు.
* రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన నేతలు..
వాస్తవానికి భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించారు. తన కుమారుడ్ని తెరపైకి తెచ్చారు.కరుణాకర్ రెడ్డి కాదు.. చాలామంది వైసిపి నేతలు క్రియాశీలక రాజకీయాలనుంచి తప్పుకోవాలని చూశారు. జగన్ సైతం చాలా సందర్భాల్లో సీనియర్ నాయకులను పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. వారి వయస్సు అయిపోయిందంటూ వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు అటువంటి నేతల అవసరమే ఏర్పడడం విశేషం.అప్పట్లో పనికిరానివారే.. ఇప్పుడు అక్కరకు వచ్చారు. జగన్ బతిమాలి మరిపదవులు ఇస్తున్నారు.అప్పట్లో జగన్ అపాయింట్మెంట్ ఇవ్వనివారిని సైతం ఇప్పుడు అక్కున చేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
* బాధ్యతలకు నో..
జగన్ సమీప బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు తీసుకోవాలని జగన్ సూచించారు.కానీ అందుకు ఆయన విముఖత చూపారు.పైగా పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవాలని చూస్తున్నారు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారు అయిష్టంగానే పొలిటికల్ వ్యవహారాల కమిటీలో చేరారు. కానీ ఆయన పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యే అవకాశం లేదు. ఎప్పుడు ఏ కేసు ముంచుకొస్తుందో నన్న భయం. ఆయనను వెంటాడుతోంది. జగన్ ను నమ్మి అడ్డంగా బుక్కయ్యానన్న ఆవేదన ఆయనలో కనిపిస్తోంది.
* సజ్జల తీరుతో సగం మంది
వైసిపి పరాజయానికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణమని పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. ఆయనను పక్కకు తప్పించాలన్న డిమాండ్ ఉంది. కానీ జగన్ మాత్రం ఇంకా సజ్జల సలహాలు పాటిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సీనియర్లకు రుచించడం లేదు. అందుకే అధినేత బాధ్యతలు ఇస్తున్నా స్వీకరించే పరిస్థితి పార్టీలో కనిపించడం లేదు. అందుకే పాత ముఖాలతో పాటు చాలామంది అర్హత లేని వారికి సైతం పదవులు కట్టబెట్టాల్సిన పరిస్థితి జగన్ పై ఏర్పడింది. ఒక్క ఓటమితో ఇంత దయనీయ పరిస్థితా? అన్నట్టుంది వైసిపి తీరు.