https://oktelugu.com/

KCR : అర్జంటుగా తెలంగాణ రాజకీయాల్లోకి చంద్రబాబు వచ్చేయాలి.. కేసీఆర్‌కు మరో ఆప్షన్ లేదు

గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇద్దరు ఎమ్మెల్యే మధ్య నెలకొన్న వివాదం ఒక్కసారిగా రాజుకుంది. అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ వివాదంలో మరోసారి ప్రాంతీయత సెంటిమెంట్ తెరమీదకు వచ్చింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 14, 2024 / 11:52 AM IST

    KCR-Chandrababu Naidu

    Follow us on

    KCR :  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఒకప్పుడు ఏ స్థాయిలో ఉద్యమం సాగిందో అందరికీ తెలిసిందే. ఉద్యమ నేతగా కేసీఆర్ తెలంగాణవాదాన్ని ఎత్తుకొని చివరకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. ఉద్యమం సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటించడంతో.. రాష్ట్రంలో అసలు తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. కేసీఆర్ అనుకున్నట్లుగానే చివరకు ప్రత్యేక రాష్ట్రం వచ్చాక.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మనుగడ లేకుండా చేయగలిగారు. రాష్ట్రంలో ఆ పార్టీ పేరు వినపడకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు.

    దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఏలారు. ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందించారు. ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా అధికారం కోల్పోయారు. దాంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గద్దెనెక్కింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి తొమ్మిది నెలలు కావస్తోంది.

    ఇంతవరకు బాగానే ఉన్నా.. గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇద్దరు ఎమ్మెల్యే మధ్య నెలకొన్న వివాదం ఒక్కసారిగా రాజుకుంది. అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ వివాదంలో మరోసారి ప్రాంతీయత సెంటిమెంట్ తెరమీదకు వచ్చింది. ఇటీవల కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఆ క్రమంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ వారిపై ప్రతాపం చూపుతున్నారని సంచలన వ్యాఖ్యలే చేశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు ఉచ్చులో పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే.. హైడ్రా, బైద్రా అంటూ ఏవేవో తీసుకొచ్చి పెట్టుబడి పెట్టే కంపెనీలను భయపెడుతున్నారని ఆరోపించారు. వాటిని హైదరాబాద్‌లో లేకుండా అమరావతికి తరలించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు కాస్త తెలంగాణ ప్రజలను ఆలోచనలో పడేశాయి.

    మరోవైపు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఖరి కూడా వీటిని బలాన్ని చేకూరుస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. చంద్రబాబును మళ్లీ తెలంగాణ రాజకీయాల్లోకి తెలంగాణలోకి తీసుకురావాలని రేవంత్, ఆయన టీమ్ ప్రయత్నిస్తున్నారంటూ బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తోంది. అందులోభాగంగానే హైదరాబాద్‌కు పెట్టుబడులు రాకుండా.. అన్నింటినీ అమరావతికి తరలిస్తున్నారని పెద్ద బాంబే పేల్చారు. దీనికి మరింత కలిసొచ్చేలా ఇటీవల చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. దాని వెనకాల కూడా పెద్ద రాజకీయమే ఉందని ప్రచారం జరుగుతోంది.

    దీనిని క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దశాబ్దాలుగా కొట్లాది సాధించిన తెలంగాణలో మళ్లీ ఆంధ్ర వాళ్లు రాజకీయం చేయడానికి వస్తున్నారని సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు.. చంద్రబాబును తెలంగాణ రాజకీయాల్లోకి స్వాగతిస్తోంది. చంద్రబాబుకు వెల్ కం చెప్పడం ఏంటా అని ఒకసారి ఆలోచిస్తే.. దాని వెనుక కూడా పెద్ద మర్మమే కనిపిస్తోంది. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ చేసేందుకు ప్రయత్నిస్తే అది బీఆర్ఎస్‌కు ప్లస్ అవుతుంది. ఆంధ్రా బాబు మళ్లీ తెలంగాణను ఏలేందుకు వస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ రాజకీయం ప్రారంభించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మళ్లీ తెలంగాణను ఆంధ్ర నేతల చేతుల్లో పెట్టేందుకేనా ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నది అనే సెంటిమెంటుతో ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగానూ ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా చంద్రబాబుకు ఇటు రేవంత్ రెడ్డి, అటు కేసీఆర్ ఇద్దరూ స్వాగతం చెబుతుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే.. ఇద్దరు ఉద్దేశాలు వేరే అయినప్పటికీ ఫైనల్లీ చంద్రబాబు తెలంగాణ గడ్డపై అడుగుపెట్టాలని ఇద్దరూ కోరుకుంటున్నారు..!!