IPS Mahesh Chandra Laddha: చంద్రబాబుకు ఇష్టమైన అధికారికి ఇంటలిజెన్స్ చీఫ్ పోస్ట్?

IPS Mahesh Chandra Laddha లడ్డా 1998 ఐపీఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్ కు చెందిన అధికారి. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్న ఆయన సి ఆర్ పి ఎఫ్ ఐ జి గా పని చేస్తున్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధిలో సీనియర్ అధికారులను భాగస్వామ్యం చేయాలని చంద్రబాబు భావించారు.

Written By: Dharma, Updated On : June 27, 2024 3:42 pm

IPS Mahesh Chandra Laddha

Follow us on

IPS Mahesh Chandra Laddha: చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనాపరమైన ప్రక్షాళన చేపడుతున్నారు. సీనియర్ అధికారులతో తన సొంత టీం ను ఏర్పాటు చేసుకుంటున్నారు. గత ఐదు సంవత్సరాలుగా వైసిపి విధ్వంసకర పాలనతో అన్ని వ్యవస్థలు నీరుగారిపోయాయి. అందుకే సీనియర్ అధికారులను ఏర్పాటు చేసుకొని.. వాటిని గాడిలో పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే కీలక హోదాల్లో ఉన్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల స్థానాలను మార్పు చేశారు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియమించారు.నూతన డీజీపీని సైతం భర్తీ చేశారు. సీఎంవో అధికారిగా ముద్దాడ రవిచంద్రను నియమించారు. ఇక పాలనలో కీలకమైన ఇంటలిజెన్స్ చీఫ్ గా చంద్రబాబు ఏరి కోరి ఓ అధికారిని ఎంపిక చేసుకోవడం విశేషం. కేంద్ర సర్వీసులో ఉన్న ఆ అధికారిని రిలీవ్ చేయాలని లేఖ రాశారు. కేంద్రం రిలీవ్ చేయడంతో ఆ అధికారి ఏపీ సర్వీసులోకి తిరిగి వస్తూనే కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనే సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ చంద్రలడ్డా.

లడ్డా 1998 ఐపీఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్ కు చెందిన అధికారి. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్న ఆయన సి ఆర్ పి ఎఫ్ ఐ జి గా పని చేస్తున్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధిలో సీనియర్ అధికారులను భాగస్వామ్యం చేయాలని చంద్రబాబు భావించారు. అందుకే లడ్డాను తిరిగి ఏపీ క్యాడర్ లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారు. దీంతో ఆయనను రాష్ట్ర సర్వీస్ లోకి పంపుతూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. అందుకే మహేష్ చంద్ర లడ్డా ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించటం దాదాపు ఖరారు అయింది. సీనియర్ ఐపీఎస్ అధికారిగా లడ్డాకు మంచి గుర్తింపు ఉంది. సిన్సియర్ అధికారిగా పేరు ఉంది.

విశాఖ జిల్లాలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు లడ్డా. ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్ జిల్లాలకు ఎస్పీగా పని చేశారు. ప్రకాశం జిల్లాలో పనిచేసిన సమయంలో 2005 ఏప్రిల్ 27న మావోయిస్టులు మహేష్ చంద్ర లడ్డా పై దాడికి దిగారు. త్రుటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మావోయిస్టుల అణచివేతలో కఠినమైన చర్యలు తీసుకోవడంతోనే ఆయనపై అప్పట్లో దాడి జరిగింది. అటు తర్వాత గుంటూరు జిల్లా ఎస్పీగా వెళ్లారు. గుంటూరులో రౌడీయిజం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆ ఆనవాళ్లు లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహేష్ చంద్రలడ్డా కేంద్ర సర్వీసులోకి వెళ్లిపోయారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై విశాఖ ఎయిర్పోర్టులో కోడి కత్తి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో లడ్డా విశాఖ పోలీస్ కమిషనర్ గా పని చేస్తున్నారు. ఆ కేసు విచారణలో సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారు. తరువాత కేంద్ర సర్వీసులోకి వెళ్లిపోయారు. సమర్థ అధికారిగా పేరు ఉండడంతో చంద్రబాబు తిరిగి ఆయన సేవలను వినియోగించుకోవాలని భావించారు. కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కూడా సమాచారం.