Merger of YCP : వైసీపీని బిజెపిలో విలీనం చేస్తారా?ఆ ప్రతిపాదన ఏమైనా ఉందా? తాజాగా బిజెపి సీనియర్ ప్రస్తావించారు ఎందుకు? ఇందులో నిజం ఎంత? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత ఐదేళ్లుగా బిజెపితో వైసీపీ స్నేహం కొనసాగించింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వైసీపీకి బిజెపి అన్ని విధాలా సహకరించింది. అయితే ఇప్పుడు అదే బిజెపి రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలతో మద్దతు పెట్టుకుంది. కేంద్రంలో ఆ రెండు పార్టీల మద్దతు కూడా తీసుకుంది. అందులో టిడిపి మద్దతు కీలకం కూడా. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపిలో వైసీపీని విలీన ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అందుకు తాము ఒప్పుకోమని బిజెపి సీనియర్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బాంబు పేల్చారు. అటువంటి ప్రయత్నం జరుగుతుందా? అన్న అనుమానాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే అటువంటిదేమీ లేదని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీన ప్రయత్నం జరుగుతుందని వార్తలు ఇప్పటివరకు వచ్చాయి. ఇప్పుడివి యూటర్న్ తీసుకున్నాయి. ఇప్పుడు కొత్తగా బిజెపిలో వైసీపీ విలీనం అన్న ప్రచారం మొదలైంది. అది ఎంతవరకు వాస్తవమో చూడాలి. అందుకే జగన్ బెంగళూరు వెళ్లి అక్కడ నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లు కొత్తగా టాక్ మొదలైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసులు మీదకు రాకుండా ఉండాలంటే కేంద్రం మద్దతు అవసరం. అందుకే బిజెపిలో వైసీపీ విలీన ప్రక్రియ అంటూ విశ్లేషకులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
* సైద్దాంతిక విభేదాలు
అయితే బిజెపి, వైసిపికి మధ్య సైద్దాంతిక విభేదాలు ఉన్నాయి. ఆ రెండు పార్టీల స్నేహం బయట వరకే. కలిసి పోటీ చేస్తామంటే కుదిరే పని కాదు. అదే జరిగి ఉంటే బిజెపి తెలుగుదేశంతో జతకట్టేది కాదు. అందుకే విలీన ప్రక్రియ కూడా అంత సులువు కాదు. వైసిపి ఓటు బ్యాంకు వేరు, బిజెపి ఓటు బ్యాంకు వేరు. రెండు పార్టీల సిద్ధాంతాలు వేరు. ఆ రెండు కలిసే ప్రసక్తి లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని అభిప్రాయపడుతున్నారు.
* కాంగ్రెస్ లో విలీనం ఈజీ
కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం చాలా ఈజీ. కింది స్థాయి కేడర్ నుంచి అధినేత వరకు అందరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. కాంగ్రెస్ భావజాలంతో గడిపిన వారే. వారు కాంగ్రెస్ పార్టీలో సైతం ఇట్టే సర్దుకోగలరు. కానీ బిజెపిలో ఆ పరిస్థితి ఉండదు. వ్యతిరేక భావనలే అధికం. అయితే ఇదంతా ఉత్త ప్రచారమేనని చాలామంది తేల్చి పారేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న బిజెపిలో వైసీపీ విలీనం అన్నది జరగని పనిగా చెప్పుకొస్తున్నారు.
* క్యాడర్ కలవదు బిజెపి క్యాడర్ సైతం వైసీపీని ఆహ్వానించే పరిస్థితిలో లేదు.పైగా వైసిపి 40 శాతం ఓటు బ్యాంకు సాధించింది. ఎవరితోనైనా పొత్తు కోసం ప్రయత్నిస్తుంది తప్ప.. పార్టీని విలీనం చేసే ఛాన్స్ లేదని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పార్టీలు అన్నాక గెలుపోటములు సహజం. అంతమాత్రానికి పార్టీలో విలీనం అంటే కుదిరే పని కాదు. అయితే జగన్ కేసులతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే పార్టీని విలీనం చేసేందుకు వెనుకడుగు వెయ్యరని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే విష్ణు కుమార్ రాజు అనుమానం వ్యక్తం చేసినట్టు విలీన ప్రయత్నం జరుగుతుందా? లేదా? అన్నది మాత్రం బయటకు తెలియడం లేదు.