MLC Duvvada  : ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ లో ట్విస్ట్.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు!

ఎన్నికలు జరిగిన రెండు నెలల తర్వాత టెక్కలి హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ దువ్వాడ ఇంట్లో జరిగిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అనేక ట్విస్టులు కొనసాగుతున్నాయి.

Written By: Dharma, Updated On : August 20, 2024 8:08 am

Duvvada Srinivasa Rao Family Issue (1)

Follow us on

MLC Duvvada : ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ కథా చిత్రానికి ఎండ్ కార్డు పడటం లేదు. ఎన్నెన్నో ట్విస్టులు, మలుపులు, దాడులు, మీడియా హడావిడితో దాదాపు రెండు వారాలు గడిచిపోయింది. మధ్యలో సామాజిక వర్గ పెద్దలు, కుటుంబ సన్నిహితులు రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది. దువ్వాడ శ్రీనివాస్ వేరే మహిళతో సంబంధం పెట్టుకొని తమను నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ భార్య వాణి, ఇద్దరు కుమార్తెలు ఆయన నివాసం వద్ద ధర్నా చేసిన సంగతి తెలిసిందే. దానిపై దువ్వాడ శ్రీనివాస్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. దాడి చేసినంత పని చేశారు. మధ్యలో శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చారు. మీడియాలో హైలెట్ అయ్యారు. దువ్వాడ వాణిపై ఆరోపణలు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ తో తాను సహజీవనం చేయడం లేదని.. అడల్ట్రీ లో ఉన్నానని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా చాలా రకాల మాటలు వ్యక్తం చేశారు. మధ్యలో వాణి వ్యాఖ్యలకు మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు. అయితే దువ్వాడ వాణి సడన్ గా యూటర్న్ తీసుకున్నారు. ఆయన ఆస్తులు, రాజకీయాలు తమకు వద్దని.. సమాజంలో పరువు పోకుండా ఉండేందుకు అందరం కలిసి ఉందామని ప్రతిపాదించారు. ఇంకా ఓ పిల్లకు వివాహం చేయాల్సి ఉందని.. ఒకే ఇంట్లో అందరము కలిసి ఉంటామని కూడా వాణి చెప్పుకొచ్చారు. అయితే ఇంత జరిగాక కలిసి ఉండడం అనేది అసాధ్యమని.. విడాకులే శరణ్యమని దువ్వాడ శ్రీనివాస్ తేల్చి చెబుతున్నారు. కేసు కోర్టులో ఉన్నందున.. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుందామని దువ్వాడ శ్రీనివాస్ తెగేసి చెబుతున్నారు.

* హైకోర్టును ఆశ్రయించిన దువ్వాడ
ఇదిలా ఉండగా దువ్వాడ శ్రీనివాస్ మరో ట్విస్ట్ ఇచ్చారు. ఈ ఘటనపై ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. తన భార్యతో పాటు చిన్న కుమార్తె ధర్నా చేస్తూ ఇబ్బంది పెడుతున్నారంటూ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు సైతం పట్టించుకోవడంలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కోర్టు స్పందించింది. దువ్వాడ వాణి, హైందవిలపై ఏమి చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 41ఏ నోటీసులు ఇచ్చినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పూర్తివివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

* వాణి సంచలన కామెంట్స్
మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ కు మాధురి నుంచి ప్రాణ హాని ఉందని దువ్వాడ వాణి సంచలన ఆరోపణలు చేశారు. తనతో పాటు తన పిల్లలకు, భర్తకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. తన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాధురి భారి నుంచి దువ్వాడ శ్రీనివాసులు కాపాడాలని వాణి విజ్ఞప్తి చేయడం విశేషం.

* అజ్ఞాతంలోకి మాధురి
మరోవైపు మాధురి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గత కొద్దిరోజులుగా మీడియా ఇంటర్వ్యూ లిస్టు చాలా యాక్టివ్ గా గడిపిన మాధురి.. కొద్దిరోజుల పాటు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తగిలిన గాయం తిరగబెట్టడంతో తాను సోషల్ మీడియాకు దూరంగా.. కొద్దిరోజుల పాటు ఉంటానని మాధురి ప్రకటించారు. ఇలా దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ సీరియల్ మాదిరిగా కొనసాగుతూనే ఉంది.