Visakha Railway Zone : మొత్తానికి ఏపీకి పెండింగ్ పనులన్నీ పూర్తి అవుతున్నాయి.. నిధులు ఇవ్వకున్నా ఇవైతే పూర్తి చేస్తున్న కేంద్రం

విశాఖ రైల్వే జోన్.. దశాబ్దాలుగా వినిపిస్తున్న మాట ఇది. అదిగో ఇదిగో అంటూ కాలయాపనే తప్ప.. కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. కానీ చంద్రబాబు ఢిల్లీ టూర్ పుణ్యమా అని కేంద్రం రైల్వే జోన్ పై సానుకూల ప్రకటన చేసింది.

Written By: Dharma, Updated On : August 20, 2024 8:29 am

Visakha Railway Zone

Follow us on

Visakha Railway Zone : ఏపీలో కూటమి ప్రభుత్వానికి మరో గుడ్ న్యూస్. చంద్రబాబు అలా ఢిల్లీ వెళ్లి వచ్చారో లేదో.. మరో కీలక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐదు దశాబ్దాల ఎదురుచూపులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించింది కేంద్రం. వీలైనంత త్వరగా రైల్వే జోన్ పనులను మొదలు పెడతామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే జోన్ కు ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని కూడా చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజల ఆకాంక్షలు అతి త్వరలో నెరవేరబోతున్నాయని కూడా వెల్లడించారు. ఏపీలో రైల్వే జోన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా పూర్తిస్థాయిలో ఉందని చెప్పుకొచ్చారు. రైల్వే జోన్ నిర్మాణ పనులు వేగంగా మొదలు పెడతామని వివరించారు. దానికి అవసరమైన అన్ని రకాల సన్నాహాలతో కేంద్రం సిద్ధంగా ఉందని కూడా ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయని వెల్లడించారు. రైల్వే జోన్ కు భూ కేటాయింపులు, ఇతర అంశాల మీద కూడా పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చిందని రైల్వే శాఖ మంత్రి ప్రకటించడం విశేషం.వాస్తవానికి విశాఖ రైల్వే జోన్ డిమాండ్ ఈనాటిది కాదు. 1970లో ఆనాటి విశాఖ ఎంపీ తెన్నేటి విశ్వనాథం తొలుత ఈ డిమాండ్ కరపైకి తెచ్చారు. నాటి నుంచి జనంలోనూ, ప్రజా సంఘాల్లో ఈ డిమాండ్ పెరుగుతూ వచ్చింది. 1990లో దేశవ్యాప్తంగా రైల్వే జోన్లు ఏర్పాటు అయినప్పుడు.. విశాఖను ప్రకటించకపోవడం రాష్ట్ర ప్రజలను నిరాశపరిచింది.

* విభజన హామీల్లో ఒకటి
2014లో రాష్ట్ర విభజన జరిగింది. రైల్వే పరంగా ఏపీకి ఇబ్బందులు దృష్ట్యా ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలని.. విభజన హామీల్లో పొందుపరిచారు. గత పదేళ్లుగా రైల్వే జోన్ అంశం హామీగానే మిగిలిపోయింది. కేంద్ర ప్రభుత్వం మంజూరు కు ముందుకొచ్చినా.. జగన్ సర్కార్ పెద్దగా స్పందించలేదన్న విమర్శలు వచ్చాయి. రైల్వే జోన్ కు అవసరమైన భూముల కేటాయింపు చేయడంలో జగన్ సర్కార్ వెనకబడినట్లు ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది కూడా.

* సానుకూల ప్రభుత్వాలు
ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో అదే పార్టీ భాగస్వామ్యమైన ఎన్ డి ఏ అధికారంలో ఉంది. దీంతో రాష్ట్ర విభజన హామీలకు మోక్షం కలుగుతోంది. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15000 కోట్ల రూపాయలు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా తమ వంతు సాయం చేస్తామని కూడా ప్రకటించింది. వీటితో పాటు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా విశాఖ రైల్వే జోన్ ను ప్రకటించింది.

* ఇటీవల సీఎం ఢిల్లీ బాట
ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులను వరుసగా కలుసుకున్నారు. మూడు రోజులపాటు అక్కడే గడిపారు. బిజీ బిజీగా ఉంటూ కీలక చర్చలు జరిపారు. చంద్రబాబు అలా ఢిల్లీ వెళ్లి వచ్చారో లేదో..రైల్వే జోన్ అనుకూల ప్రకటన రావడం విశేషం. దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.