TTD: టీటీడీలో ప్రక్షాళన ప్రారంభమైంది. భక్తులకు వసతులు మెరుగుపరిచేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈవో శ్యామల రావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ నుంచి ధర్మారెడ్డి అవుట్ అయ్యారు. శ్యామలరావును ఈవో గా నియమించారు. ప్రధానంగా ఆయన భక్తుల దర్శనం, అన్నదాన ప్రసాదం పై ఎక్కువగా ఫోకస్ చేశారు. సామాన్య భక్తులు తక్కువ సమయంలో దర్శనం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. తాజాగా తిరుమల నడక మార్గంలో వచ్చే భక్తులకు సంబంధించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.
గత ఐదు సంవత్సరాలుగా నడక మార్గంలో అనేక ఘటనలు జరిగాయి. భక్తుల భద్రతకు భంగం వాటిల్లేలా ఘటనలు చోటుచేసుకున్నాయి. అందుకే అలిపిరి, శ్రీవారి మెట్ల నడక మార్గంలో భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. వన్యప్రాణుల సంచారాన్ని తెలుసుకునేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి ఏడో మైల్ వరకు సంచరించే జంతువుల కదలికలు ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఇటీవల కాలినడక మార్గంలో చిరుతపులులు, ఎలుగుబంట్లు సంచరిస్తున్న సంగతి తెలిసిందే. చాలాసార్లు దాడులలో చిన్నారులు మృతి చెందిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే అటవీ జంతువుల కదలికలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు భద్రతా విభాగానికి తెలియజేయడం ద్వారా భక్తులకు అలర్ట్ చేయాలని భావిస్తున్నారు. అటు కాలినడక మార్గంలో సైతం కీలక మార్పులు తీసుకురానున్నారు. ముఖ్యంగా సమయాన్ని నిర్దేశించనున్నారు. ఇందుకుగాను ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకున్నారు. కాగా జూలై 4న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జూలై 10 నుంచి 12 వరకు జరపనున్నారు. ఈ ఉత్సవానికి ముందు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకే జూలై 4న తిరుప్పావడసేవ, ఆర్జిత కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.