Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా, ఆ తర్వాత ‘శక్తి’ తుపానుగా మారే సూచనలతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న వారం రోజులపాటు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. నైరుతీ రుతుపవనాలు బలంగా కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన వాతావరణం నెలకొంటుందని అంచనా వేసింది.
Also Read: మహానాడులో సంచలనాలు.. లోకేష్ కు పట్టాభిషేకం.. కరెక్ట్ సమయం అంటున్న క్యాడర్!
నైరుతీ రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, శ్రీలంక సమీపంలోని బంగాళాఖాతం, అండమాన్ దీవుల్లో విస్తరిస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మేఘాలను సృష్టిస్తోంది. మధ్య బంగాళాఖాతంలో మరో ఆవర్తనం కోస్తాంధ్ర సమీపంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో గాలులను గుండ్రంగా తిప్పుతోంది. ఈ ఆవర్తనం రాబోయే రెండు రోజుల్లో అల్పపీడనంగా, ఆ తర్వాత ‘శక్తి’ తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ తుపాను రెండు వారాలపాటు ప్రభావం చూపవచ్చని అంచనా వేసింది, దీని కదలికలను నిశితంగా పరిశీలిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
రానున్న 7 రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం అస్థిరంగా ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, పిడుగులు, బలమైన ఈదురుగాలులు (గంటకు 30-70 కిలోమీటర్ల వేగం) నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది.
తెలంగాణ: హైదరాబాద్‌తో సహా 80% ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల తర్వాత వర్షాలు మొదలవుతాయి. పశ్చిమ తెలంగాణలో భారీ వర్షాలు, రాత్రి వరకు కొనసాగే ఈదురుగాలులు ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్: రాయలసీమలో మధ్యాహ్నం 3 గంటల తర్వాత చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో వర్షాలు షురూ అవుతాయి, రాత్రి వరకు భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్రలో సాయంత్రం 4 గంటల నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో జల్లులు కురిసే అవకాశం ఉంది. మే 19, 20 తేదీల్లో రాయలసీమలో తీవ్ర ఈదురుగాలులు వీస్తాయి.
ప్రజలకు హెచ్చరికలు..
ఐఎండీ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు, ఈదురుగాలుల సమయంలో బయట ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రైతులు పంటలను సురక్షితంగా ఉంచడం, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ఉండాలని హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో అధిక జాగ్రత్త అవసరమని, సముద్ర తీరంలో అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. స్థానిక యంత్రాంగం వరదలు, రహదారుల ఆటంకాలను ఎదుర్కొనేందుకు సిద్ధమై ఉండాలని సూచించారు.
ప్రభుత్వాల సన్నద్ధత
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమయ్యాయి. విపత్తు నిర్వహణ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ యూనిట్లు సన్నద్ధంగా ఉన్నాయి. తీర ప్రాంత జిల్లాల్లో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను సిద్ధం చేస్తున్నారు. విద్యుత్ ఆటంకాలు, రహదారుల మూసివేతలను ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.