Mahanadu 2025: తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) మహానాడు పండుగకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో నాలుగు దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ నిలబడేలా దిశా నిర్దేశం చేయనుంది ఈ మహానాడు. ముఖ్యంగా లోకేష్ ప్రాధాన్యత పెంచనుంది. ఈ మహానాడులో కీలక రాజకీయ తీర్మానాలు ఉండబోతున్నాయి అన్నది హాట్ టాపిక్ అవుతోంది. టిడిపి చరిత్రలోనే ఎన్నడూ నిర్వహించని కడపలో మహానాడు నిర్వహిస్తుండడం నిజంగా విశేషమే. వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ సొంత ఇలాకాలో పసుపు పండుగ నిర్వహిస్తోంది. ఇదే పండుగలో నారా లోకేష్ కి పార్టీ పరంగా ప్రమోషన్ లభిస్తుందన్న ప్రచారం తమ్ముళ్లలో జోష్ నింపుతోంది.
Also Read: రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదా.. వెంటనే ఇలా చేయండి.. అకౌంట్లో డబ్బులు పడతాయి..
* దశాబ్దాలుగా సేవలు..
ప్రత్యక్ష రాజకీయాలను 2014లో ప్రారంభించారు నారా లోకేష్( Nara Lokesh). కానీ అంతకుముందు.. 2009 ఎన్నికల్లో వెనుకుండి నడిపించారు. నగదు రహిత సంక్షేమ పథకాలు అమలు చేయాలని అప్పుడే చెప్పిన ఘనత నారా లోకేష్ ది. అయితే అప్పట్లో త్రిముఖ పోటీలో మహాకూటమిగా వెళ్లిన టిడిపికి అపజయం ఎదురయింది. అటు తరువాత 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నారా లోకేష్ టిడిపి గెలుపులో కీలక భాగస్వామ్యం అయ్యారు. అటు తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో చేరి రాజకీయ ఓనమాలు దిద్దుకున్నారు. ఎన్నెన్నో సంక్షోభాలను అధిగమించారు. అవమానాలు తట్టుకొని నిలబడ్డారు. 2019 ఎన్నికల్లో అత్యంత సాహసవంతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. గతంలో ఎప్పుడూ టిడిపి గెలవని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఓడిన చోట నిలబడాలని భావించారు. ఐదేళ్లపాటు మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో మమేకమై పనిచేశారు. దీంతో మంగళగిరి నియోజకవర్గ ప్రజలు 90 వేల ఓట్ల మెజారిటీతో నారా లోకేష్ ను గెలిపించుకున్నారు.
* టిడిపిలో తనదైన ముద్ర..
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు నారా లోకేష్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు( CM Chandrababu) బిజీగా ఉన్న తరుణంలో అన్ని తానై వ్యవహరిస్తూ పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తూ వచ్చారు. ఐటీ, విద్యాశాఖ మంత్రిగా తనదైన ముద్ర వేసుకుంటున్నారు. అందుకే టిడిపిలో నిర్ణయాత్మక పదవి ఇచ్చేందుకు కడప మహానాడు వేదిక కానంద్ అన్న ప్రచారం జోరు అందుకుంది. నారా లోకేష్ కు ప్రమోషన్ పై టీడీపీలో ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. ఆ ప్రమోషన్ ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నలకు ఈ మహానాడు సమాధానం చెప్పబోతోంది. టిడిపి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా లోకేష్ నియమించే ఛాన్స్ ఉందని పార్టీలో బలమైన చర్చ నడుస్తోంది.
* యూత్ లో క్రేజ్..
నారా లోకేష్ యూత్ కు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. అందుకే ఆయన ఇమేజ్ ను మరింత పార్టీ పరంగా పెంచాలన్న ఆలోచనలు సీనియర్లు ఉన్నారు. పొలిట్ బ్యూరోతో పాటు పార్టీలోను యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి లోకేష్ ను మరింత ఎలివేట్ చేయడానికి ఈ కొత్త పోస్ట్ క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పార్టీలోనే డిమాండ్లు వినిపించాయి. అయితే కూటమిలో సమన్వయానికి ఇబ్బందులు తలెత్తడంతో అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ముందుగా పార్టీలో లోకేష్ ను ప్రమోట్ చేయాలని.. ప్రభుత్వంలో తానంతట తానే అవకాశాలు వస్తాయని తెలుస్తోంది. మరోవైపు ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ సైతం స్పీడ్ పెంచారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ఆయన పనితీరే చెబుతోంది. ప్రధానంగా విద్యావంతులను ఆకర్షించడం ద్వారా ఒక సరికొత్త ఆవిష్కరణ చేసుకోవాలని లోకేష్ భావిస్తున్నారు. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీలో భావి నాయకుడిగా లోకేష్ ను ప్రమోట్ చేయాలని పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు సీనియర్లు రావడం విశేషం. అందుకే మహానాడు మరింత అంచనాలు పెంచేస్తోంది.