MLC Pothula Sunitha : మంత్రిని నమ్మి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా..టిడిపిలోకి నో ఎంట్రీ.. మహిళా నేత పరిస్థితి ఏంటి?

కొంతమంది రాజకీయ నేతల నిర్ణయాలు ఒక్కోసారి ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. వారి వ్యవహార శైలి కూడా ఇబ్బందికరంగా మారుతుంది. తాజాగా అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు పోతుల సునీత అనే మహిళ నేత. టిడిపిలోకి వచ్చేందుకు ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. కానీ ఇప్పుడు ఆమెకు ఆ పార్టీలోకి ఎంట్రీ లేకుండా పోతోంది.

Written By: Dharma, Updated On : September 12, 2024 11:21 am

Pothula sunitha

Follow us on

MLC Pothula Sunitha : వైసీపీకి రాజీనామా చేసిన నేతలు ఇరకాటంలో పడుతున్నారా? వారికి టిడిపిలోకి ఎంట్రీ లభించడం లేదా? పార్టీ శ్రేణుల అభ్యంతరాలతో హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసిపికి ఇద్దరురాజ్యసభ సభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేశారు. వైసిపి ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం వదులుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే ఇది జరిగి రోజులు గడుస్తున్నా..ఏ ఒక్కరు టిడిపిలో కానీ.. కూటమి పార్టీల్లో చేరలేదు. దీంతో అనవసరంగా వైసీపీకి రాజీనామా చేశామా? అన్న బాధ వీరిలో వ్యక్తం అవుతోంది. అటు ఉన్న పదవిపోయి.. కూటమి పార్టీల ఆదరణ లేక వీరు సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళ ఎమ్మెల్సీ పోతుల సునీత పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నట్లు సమాచారం. టిడిపిలోకి వస్తే చేర్చుకుంటామని ఓ మంత్రి హామీ మేరకు ఆమె.. పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. కానీ ఆమె టిడిపిలో చేరితే తమ ప్రభావం చూపుతామని పార్టీ శ్రేణులు గట్టి హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీలో ఆమె చేరికకు బ్రేక్ పడింది. చొరవ చూపిన మంత్రి సైతం చేతులెత్తేశారు. దీంతో పోతుల సునీత పరిస్థితి అగమ్య గోచరంగా మారినట్లు సమాచారం.

* పరిటాల కుటుంబ అనుచరులుగా
సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు పోతుల సునీత.ఆమె దివంగత పరిటాల రవి అనుచర వర్గంగా మెలిగారు. ఆమె భర్త సురేష్ సైతం పరిటాల కుటుంబంతో కొనసాగారు. కమ్యూనిస్టు భావజాలం నుంచి రావడంతో వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. తొలుత ఉమ్మడి రాష్ట్రంలోని.. పాలమూరు జిల్లా అలంపూర్ జడ్పిటిసి గా గెలిచారు పోతుల సునీత. తరువాత రాయలసీమ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే తరచూ పార్టీ మారుతారు అన్న విమర్శ ఆమెపై ఉంది. అదే ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితికి దారితీసింది.

* అనూహ్యంగా చీరాలపై
రాయలసీమ జిల్లాల రాజకీయంపై దృష్టి పెట్టిన పోతుల సునీతకు.. అనుకోని వరంగా ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం కనిపించింది. 2014 ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ టిడిపి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. కానీ ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. అయినా సరే 2017లో ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. 2019లో టిడిపి ఓడిపోయేసరికి.. ఆమె వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయేసరికి తిరిగి మాతృ పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డారు. ఓ మంత్రి మధ్యవర్తిత్వంతో ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి గుడ్ బై చెప్పారు.

* టిడిపి శ్రేణుల అభ్యంతరాలు
అయితే ఆమె రాకను టిడిపి శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి వెళ్లిపోయిన తర్వాత ఆమెకు మరోసారి ఎమ్మెల్సీ పదవి దక్కింది. దీంతో అక్కడ నుంచి లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు. అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. దానిపైనే లోకేష్ పరువు నష్టం దావా వేశారు. అయితే ప్రస్తుతం శాసనమండలిలో టిడిపికి ప్రాతినిధ్యం పెరగాల్సి ఉంది. అందుకే వైసీపీ ఎమ్మెల్సీలను టిడిపిలోకి రప్పించి రాజీనామా చేయిస్తున్నారు. పోతుల సునీతను అలాగే తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. అయితే టిడిపి శ్రేణుల వ్యతిరేకతతో ఆ పనికి బ్రేక్ పడింది. దీంతో రెండింటికి చెడ్డ రేవడిగా మారిపోయానని పోతుల సునీత బాధపడుతున్నారు. చంద్రబాబుకు తన గోడును వెల్లబోసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో సునీత ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.