Red Tamarind: చింతయాక అనగానే పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చరంగులో ఉంటుందని, పండిన తర్వాత బ్రౌన్ కలర్‌లోకి మారుతుంది. ఇది మనందరికీ తెలుసు. ఈ చింతకాయలు మాత్రం ఎర్రగా ఉంటాయి. ఈ చెట్టు వయసు వందేళ్లకుపైగానే ఉంంటుందని స్థానికులు అంటున్నారు. ఈ చెట్టుకు కాసే చింతకాయలుపైన మామూలుగానే ఉన్నా లోపల మాత్రం ఎర్రగా ఉంటాయి. రుచి కూడా చాలా పుల్లగా ఉంటుంది. ఈ చెట్టు వానగాయలను గిచ్చితే గోళ్లకు, వేళ్లకు ఎర్ర రంగు అంటుకుంటుంది. తింటే నోరంతా ఎర్రగా మారుతుంది. అరుదైన ఈ ఎర్ర చింతకాయ చెట్టు చేర్యాలలో ఉంది. దీనికి సమీపంలోనే గవర్నమెంట్ జూనియర్, డిగ్రీ కాలేజీలు, గవర్నమెంట్ హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో చదువుకునే పిల్లలు ఈ చింతకాయలను తెంపి తింటున్నారు. వినాయక చవితి, దీపావళి పండుగలప్పుడు అంతా ఈ ఎర్ర చింతకాయల పులుపు కోసం ఆరాటపడతారు.
అంటు పద్ధతిలో మొక్కల ఉత్పత్తి..
మామూలు చింత రకాలకు భిన్నంగా ఎర్ర చింత రకాన్ని శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. ఒక చెట్టు కాయల్లో గుజ్జు ఎర్రగా ఉన్నట్లు, ఈ చెట్టు ఏటా కాయలు కాస్తున్నట్లు శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనికి ’ఛాంపియన్ ట్రీ’ అని పేరు పెట్టారు. ఈ చెట్టు కొమ్మల ద్వారా అంట్లను ఉత్పత్తి చేస్తూ రైతులకు అందిస్తున్నారు. అవి పూతకు వచ్చిన తర్వాత అంట్లు కట్టడం ప్రారంభిస్తారు. ఎర్ర చింత చెట్టు ఏటా కాపు కాస్తున్నది. కాయలు గుత్తులు గుత్తులుగా వస్తాయి. పిందెను విరిచి చూస్తే రక్తం మాదిరిగా ఎర్రగా కండ కనిపిస్తుంది. కాయ ముదిరిన తర్వాత రోజ్ రెడ్ కలర్‌లోకి మారుతుంది. యాంటోసైనిన్స్ అనే పిగ్మెంట్ కారణంగా ఎరుపు రంగు సహజసిద్ధంగానే వస్తుంది.
ఎర్ర చింత.. ఆరోగ్యదాయకం
ఎర్రచింతతో అనేక ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. ఈ రకం చింతపండు, ఇతర ఉత్పత్తులు ఆరోగ్యపరంగా మనిషి ఎంతగానో మేలు చేస్తాయి. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. మానవ శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ (చెడు కలిగించే పదార్థాల)ను ఇవి నిర్వీర్యం చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే ఇందులో టార్టారిక్ యాసిడ్, భాస్వరం, పొటాషియం, నియాసిన్, రెబోఫ్లేవీన్, బీటా కెరోటిన్ లాంటి విటమిన్లు, మినరల్స్(ఖనిజాలు) ఉన్నట్లు తేలింది. మరీ ముఖ్యంగా టార్టారిక్ యాసిడ్ 16 శాతం ఉంటుంది. దీనిని చట్నీగా తీసుకున్నా, వంటకాల్లో వాడినా మంచిదని అంటున్నారు.