PM Narendra Modi: అమరావతి రాజధాని( Amravati capital ) పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రపంచానికి తలమానికంగా అమరావతిని నిర్మించేందుకు చంద్రబాబు సర్కార్ కృత నిశ్చయంతో ఉంది. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. 2028 నాటికి రాజధానికి ఒక రూపు తేవాలని భావిస్తోంది. మే 2న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి పి ఎం ఓ నుంచి షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. భారీగా జన సమీకరణతో అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం దిగ్విజయంగా జరిపించాలని భావిస్తోంది ఏపీలోని కూటమి ప్రభుత్వం. ఇటువంటి తరుణంలో ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం ఇస్తారు అన్న చర్చ మాత్రం మొదలైంది.
Also Read: ఏపీలో ఉపాధ్యాయుల కష్టాలకు లోకేష్ చెక్.. కొత్తగా ఆ యాప్!
* 2017 లో శంకుస్థాపన
2014లో టిడిపి( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో టిడిపి భాగస్వామ్యంగా ఉన్న ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అప్పట్లో అందరి అభిప్రాయంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు చంద్రబాబు. 2017 అక్టోబర్లో అమరావతి రాజధాని కి శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సాటి తెలుగు రాష్ట్ర సీఎం గా కెసిఆర్ కూడా హాజరయ్యారు. అయితే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో అమరావతి రాజధాని నిర్మాణానికి భారీ సాయం ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ నదీ సంగమాల పవిత్ర జలాలు, మట్టి మాత్రమే తీసుకువచ్చారు నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అయితే అప్పట్లో దీనిపై విమర్శలు వినిపించాయి కానీ.. అమరావతి భవిష్యత్తు దృష్ట్యా నేనున్నాను అని భరోసా కల్పించడంలో భాగంగానే ప్రధాని అలా చేశారన్న టాక్ ఉంది.
* నాడు వట్టి చేతులతో
అయితే నాటి కార్యక్రమానికి హాజరైన కెసిఆర్( KCR) ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. ఈ దేశ ప్రధానిగా అమరావతి రాజధాని నిర్మాణానికి సాయం అందిస్తారని భావించానని.. సాటి తెలుగు రాష్ట్రంగా 200 కోట్ల రూపాయల వరకు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. కానీ ప్రధాని వట్టి చేతులతో వచ్చేసరికి.. ఆయన ఇవ్వకుండా తాను సాయం ప్రకటిస్తే బాగుండదని భావించానని కెసిఆర్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు రెండోసారి అదే అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వస్తున్నారు ప్రధాని మోదీ. ఈసారి మాత్రం కచ్చితంగా ఏదో ఒక ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. లేకుంటే మాత్రం మరోసారి ప్రధాని తీరు విమర్శలకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది.
* అప్పుడే విమర్శలు..
అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏపీకి చెందిన పలు పార్టీల నేతలు స్పందిస్తున్నారు. అమరావతికి తప్పకుండా సాయం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఈ విషయంపై మాట్లాడారు. గతం మాదిరిగా మట్టి, నీరు తెచ్చి చేతులు దులుపుకోవద్దని.. అమరావతికి సాయం ప్రకటించాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు వామపక్షాలతో పాటు ఇతర పార్టీల నేతలు సైతం ఇదే తరహా డిమాండ్ చేస్తున్నారు. అయితే 2014, 2019 కంటే ఈసారి భిన్నంగా వ్యవహరిస్తున్నారు ప్రధాని మోదీ. ఏపీ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్నారు. అందుకే తప్పకుండా సాయం ప్రకటిస్తారన్న టాక్ వినిపిస్తోంది.
Also Read: ఈసారి విజయసాయిరెడ్డి ఏ బాంబు పేల్చుతారో?