Vijayasai Reddy: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన వారే ఆ పార్టీకి ఇప్పుడు గుదిబండగా మారారు. ప్రధానంగా లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ కీలక నేతలు ఇరుక్కునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పై దృష్టి పెట్టింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని.. హవాలా రూపంలో ధనం విదేశాలకు వెళ్లిపోయిందని టిడిపి పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ఆరోపించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు. అందుకు తగ్గట్టు ఆధారాలు సేకరించారు. మనీ లాండరింగ్ జరిగిందని కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
Also Read: అనూహ్యంగా ఊహించని నేతకు బిజెపి పగ్గాలు!
* దూకుడుగా సిట్
మరోవైపు మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణకు హాజరుకావాలని సిట్ ఎంపీ మిధున్ రెడ్డి( MP Mithun Reddy), వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి లకు నోటీసులు జారీ చేసింది. అయితే అనూహ్యంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సైతం నోటీసులు ఇవ్వడం విశేషం. అయితే కేసులో అనుమానితుడుగా భావించి విజయసాయి రెడ్డికి ఇచ్చారా? లేకుంటే సాక్షిగా ఇచ్చారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే కొద్ది రోజుల కిందట విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణం విషయంలో ఆధారాలతో సహా వివరిస్తానని.. తనకు విచారణకు పిలవాలని ఆయన కోరారు. ఈ తరుణంలోనే సిట్ నోటీసులు ఇవ్వడం విశేషం.
* ఈరోజు విచారణకు విజయసాయిరెడ్డి..
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) ఈరోజు సీట్ విచారణకు హాజరుకానున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలను పూర్తిగా వివరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సాక్షిగా విజయసాయి చెప్పే అంశాలు మద్యం కుంభకోణం కేసులో కీలకం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి అని విజయసాయిరెడ్డి తేల్చేశారు. అందుకే సిట్ సైతం మూడుసార్లు ఆయనకు నోటీసులు ఇచ్చింది. కానీ ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. గత ఐదేళ్లలో రాజ్ కసిరెడ్డి ద్వారా మద్యం లావాదేవీలు జరిగినట్లు సిట్ గుర్తించింది.
* రాజ్ కసిరెడ్డి సూత్రధారి..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో ఐటీ సలహాదారుడుగా ఉండేవారు రాజ్ కసిరెడ్డి. అందుకే తనకు సంబంధం లేని విషయంలో విచారణకు ఎందుకు రావాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీ మిధున్ రెడ్డి రేపు సిట్ విచారణకు హాజరుకానున్నారు. అయితే ఆయన అరెస్టు భయంతో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలో కేసు విచారణకు సహకరించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. అందుకే ఆయన సైతం రేపు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు సిట్ ముందుకు రానున్నారు విజయసాయిరెడ్డి. మరి ఆయన ఎలాంటి ఆధారాలు చూపుతారు? సిట్ అధికారులు ఎలా వ్యవహరిస్తారు? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
Also Read: ఏపీలో ఉపాధ్యాయుల కష్టాలకు లోకేష్ చెక్.. కొత్తగా ఆ యాప్!