https://oktelugu.com/

AP Government: ఏపీలో వారికి భలే ఛాన్స్.. పెట్రోల్/డీజిల్ సగం సొమ్ముకే!

దివ్యాంగులపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. వారి జీవనోపాధికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని చూస్తోంది. అందులో భాగంగా వారికి వాహనాలు సమకూర్చి.. రాయితీలు అందించాలని భావిస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : December 28, 2024 / 03:29 PM IST

    AP Government(2)

    Follow us on

    AP Government: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు మరో అరుదైన అవకాశం ఇచ్చింది. పెట్రోల్ తో పాటు డీజిల్ ను సబ్సిడీపై అందించనుంది. ఈ మేరకు నిధులను కూడా విడుదల చేసింది. అర్హుల నుంచి దరఖాస్తులను సైతం స్వీకరిస్తోంది. ప్రధానంగా దివ్యాంగుల కోసమే ఈ కొత్త పథకాన్ని ప్రకటించింది కూటమి ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా స్వయం ఉపాధితో పాటు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న దివ్యాంగులకు డీజిల్ తో పాటు పెట్రోల్ రాయితీపై అందించనున్నారు. 2024-25 ఏడాదికి సంబంధించి ఈ పథకం అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాకు లక్ష రూపాయలు చొప్పున కేటాయించారు. అర్హత ఉన్న దివ్యాంగుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.

    * మూడు చక్రాల వాహనాలకే
    ప్రస్తుతం చాలామంది దివ్యాంగులు మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనాలు ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు వారు వినియోగించే వాహనాలకు ఈ పథకం కింద పెట్రోల్/ డీజిల్ కు అయ్యే ఖర్చులు 50% రాయితీగా రీయింబర్స్ చేస్తారు. ఈ డబ్బులను ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనుంది. అయితే ఈ పథకానికి సంబంధించి కీలక మార్గదర్శకాలను కూడా రూపొందించింది ప్రభుత్వం. ప్రధానంగా లబ్ధిదారుడు వాహనంలో ఇంటి నుంచి పని ప్రాంతానికి.. అక్కడ నుంచి తిరిగి ఇంటికి ప్రయాణించేందుకు మాత్రమే రాయితీపై పెట్రోల్ / డీజిల్ను అందిస్తుంది.

    * వాహన సామర్థ్యం బట్టి
    ఈ రాయితీకి సంబంధించి 2 హార్స్ పవర్ ఇంజన్ సామర్థ్యం ఉండే వాహనానికి గరిష్టంగా 15 లీటర్లకు రాయితీ అందించనున్నారు. 2 హార్సెస్ పవర్ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉండే వాహనాలకు గరిష్టంగా 25 లీటర్ల వరకు పరిమితి ఇచ్చారు.ఈ పథకానికి సంబంధించి పెట్రోల్/ డీజిల్ కొనుగోలు చేసిన బిల్లులు సమర్పిస్తే ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని అకౌంట్లో జమ చేస్తుంది. వైసిపి ప్రభుత్వ హయాంలో ఈ పథకం ఉన్నా.. అమలు విషయంలో మాత్రం నిర్లక్ష్యం కొనసాగింది. ఈసారి మాత్రం కచ్చితంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.