Pawan Kalyan : ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటుంది.అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేస్తున్నారు. రోజుకో పార్లమెంటరీ నియోజకవర్గంలో యాత్ర చేపడుతున్నారు. ఈనెల 24 వరకు బస్సు యాత్ర కొనసాగనుంది. మరోవైపు చంద్రబాబు సైతం ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ మరింత దూకుడుగా ఉన్నారు. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలతో పాటు భాగస్వామ్య పార్టీల అభ్యర్థుల నియోజకవర్గాల్లో సైతం ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పవన్ ఆవేశపూరితంగా ప్రసంగాలు చేస్తున్నారు. ఇవి ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. అటు పవన్తో ప్రచారం చేయాలని ఆ మూడు పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. కానీ సమయం కుదరక నిరుత్సాహపడుతున్నారు.
పవన్ రాజకీయ ప్రత్యర్థులతో పాటు కాపు సామాజిక వర్గ నేతలను సైతం టార్గెట్ చేసుకుంటున్నారు. చాలామంది కాపు నాయకులు తన శ్రేయోభిలాషులుగా వ్యవహరించారని.. లేఖలు కూడా రాశారని.. తీరా ఇప్పుడు వైసీపీలోకి వెళ్లిపోయారని పవన్ సంచలన ఆరోపణలు చేశారు. వారంతా వైసిపి మనుషులేనని.. కేవలం తనను మోసం చేసేందుకే ఎత్తుగడ వేశారని పవన్ ఆరోపించారు. వైసీపీ కాపు ఎమ్మెల్యేలు, నేతలు కాపు సామాజిక వర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. కేవలం తనను తిట్టేందుకు మాత్రమే ఉన్నారని ఎద్దేవా చేశారు.
ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వచ్చేందుకు ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన వైసీపీ ముసుగులో ఉండడంతో పవన్ పెద్దగా స్పందించలేదు. జనసేనలోకి ఆహ్వానించలేదు. దీంతో ముద్రగడ తన కుమారుడితో కలిసి వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు పవన్ ను టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు. కాపు సంక్షేమ సేవ సంస్థ తరఫున చేగొండి హరి రామ జోగయ్య పవన్ కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. పవన్ కోసమే తాను ఉన్నట్టు సంకేతాలు పంపారు. టిడిపి తో పొత్తు, సీట్ల సర్దుబాటు విషయంలోలేఖలతో పవన్ కళ్యాణ్ కు చికాకు తెచ్చి పెట్టారు. అయితే ఎనిమిది పదుల వయసులో మంచానికి పరిమితం అయిన ఆయన లేఖలు రాశారు అనడం అనుమానమే. అయితే పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టించుకోకపోవడంతో హరి రామ జోగయ్య కుమారుడు వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు పవన్ ఆ ఇద్దరు కాపు నేతలను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవే వైరల్ గా మారాయి.