KKR vs RCB
KKR vs RCB : ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా మరో రసవత్తర పోరుకు సర్వం సిద్ధమైంది. ప్రతిష్టాత్మకమైన ఈడెన్ గార్డెన్స్ లో ఆదివారం కోల్ కతా, బెంగళూరు తలపడనున్నాయి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో బెంగళూరు చివరి స్థానంలో కొనసాగుతోంది. కోల్ కతా మూడో స్థానంలో ఉంది. వరుస ఓటములతో ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న బెంగళూరుకు ఈ మ్యాచ్ అత్యంత ముఖ్యమైనది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ బలహీనమైన బౌలింగ్, అంతకంటే పేలవమైన ఫీల్డింగ్ తో బెంగళూరు నాసిరకమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. ఫలితంగా వరుస మ్యాచ్లో ఓడిపోతోంది. పాయింట్లు పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం కోల్ కతా తో జరిగే మ్యాచ్ బెంగళూరుకు అత్యంత ప్రతిష్టాత్మకం.
బెంగళూరు
ఈ జట్టులో బ్యాటింగ్ భారాన్ని విరాట్ కోహ్లీ, డూ ప్లేసిస్, దినేష్ కార్తీక్ వంటి వారు మోస్తున్నారు. మిగతావారు వెంట వెంటనే చేతులెత్తేస్తున్నారు. అది ఆ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. విల్ జాక్స్, సౌరవ్ చౌహాన్, రజత్ పాటిధార్ వాటివారు టచ్ లోకి రావాలని ఆ జట్టు భావిస్తోంది. మయాంక్ దగర్, లామ్రోర్ వంటి వారు మెరుపులు మెరిపించాలని కోరుకుంటున్నది. ఇక బౌలింగ్ విభాగంలో బెంగళూరు అత్యంత నాసిరకంగా ఉంది. ఆకాష్ దీప్, టోప్లీ, అల్జారి జోసెఫ్, ఫెర్గు సన్ వంటి వారు ధారాళంగా పరుగులు ఇస్తున్నారు. వీరు టచ్ లోకి రావాలని జట్టు కోరుకుంటున్నది. ఇప్పటివరకు బెంగళూరు వరుస ఓటములు ఎదుర్కొందంటే దానికి కారణం బెంగళూరు బౌలర్లే. ఈ మ్యాచ్లో ఆ జట్టును ముంచినా, లేపినా వారిదే భారమని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
కోల్ కతా
ఈ సీజన్లో కోల్ కతా ప్రయాణం నల్లేరు మీద నడక లాగా సాగుతోంది. పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉన్నప్పటికీ.. అనితర సాధ్యమైన ఆటతీరుతో ఆ జట్టు అందరి ప్రశంసలూ అందుకుంటున్నది. కప్ వేటలో బలంగా అడుగులు వేస్తోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, రఘువన్షీ, ఫిల్ సాల్ట్, రసెల్, ఫిలిప్ సాల్ట్ వంటివారు భీకరమైన ఫామ్ లో ఉన్నారు. ఇక బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి, వైభవ్ ఆరోరా మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నారు. అయితే చేతన్ సకారియా, వెంకటేష్ అయ్యర్ టచ్ లోకి రావాలని జట్టు భావిస్తోంది.
ఈడెన్ గార్డెన్స్ బ్యాటర్లకు స్వర్గధామం. ఈ మైదానంపై హైయెస్ట్ స్కోర్ 223 పరుగులు. యావరేజ్ స్కోరు 193 పరుగులుగా ఉంది. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు ఐదుసార్లు, చేజింగ్ చేసిన జట్టు ఐదుసార్లు విజయం సాధించింది. ఇప్పటివరకు కోల్ కతా, బెంగళూరు 33 సార్లు తలపడ్డాయి. 19సార్లు కోల్ కతా, 14 సార్లు బెంగళూరు విజయం సాధించాయి.
జట్ల అంచనా ఇలా
కోల్ కతా
విరాట్ కోహ్లీ, డూ ప్లేసిస్(కెప్టెన్), జాక్స్, సౌరవ్ చౌహన్, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, మయాంక్ దగర్, హిమాంశు శర్మ, లామ్రోర్, ఆకాష్ దీప్, అల్జారీ జోసెఫ్, లోకీ ఫెర్గూ సన్.
కోల్ కతా
శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, రఘువన్షీ, సాల్ట్, రసెల్, సునీల్ నరైన్, అనుకూల్ రాయ్, వెంకటేష్ అయ్యర్, రమణ్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా.