MLA koneti Adimulam : ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారడం.. వైసిపి నాయకులు ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావించడంతో.. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒక్కసారిగా స్పందించింది. పార్టీ నుంచి కోనేటి ఆదిమూలాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కోనేటి ఆదిమూలం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ తర్వాత ఆయన చెన్నై వెళ్లారని.. గుండె సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆదిమూలం భార్య, కుటుంబ సభ్యులు స్పందించారు.. రాజకీయంగా ఎదుగుతున్న తన భర్తను చూసి ఓర్వలేక ప్రత్యర్థులు ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. టిడిపిలో కొంతమంది నాయకులు తన భర్తకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. తన భర్తకు నియోజకవర్గంలో మంచి పేరు ఉందని.. ఆయన వయసు 70 దాటిందని.. అలాంటి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తారని ఆమె విమర్శించారు. నిజాలు తెలుసుకోకుండా పార్టీ అధిష్టానం తన భర్త పై సస్పెండ్ విధించడాన్ని ఆమె తప్పు పట్టారు.. తన భర్తకు అలాంటి పని చేయాల్సిన అవసరం లేదని.. గిట్టని వాళ్లు ఏవేవో వీడియోలు సృష్టించి.. ఇబ్బంది పెడుతున్నారని ఆమె వాపోయారు. ఏనాటికైనా నిజం గెలుస్తుందని.. కచ్చితంగా తన భర్త నిరపరాధిగా బయటకి వస్తాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.. ఈ ఉదంతం అనంతరం ఆదిమూలం స్పందించారు.
ఆదిమూలం ఏమన్నారంటే..
ఆదిమూలం ప్రస్తుతం చెన్నైలోనే ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన గతంలోనే తన గుండెకు స్టంట్ వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 70 సంవత్సరాలు. తనపై గిట్టని వాళ్లు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆదిమూలం ఆరోపించారు. తనపై హనీ ట్రాప్ ప్రయోగించారని వివరించారు. ఒకవేళ ఆమె చెబుతున్నట్టు నేను అత్యాచారానికి పాల్పడితే.. ఇన్ని రోజుల దాకా ఏం చేసిందని ఆయన అసలైన పాయింట్ లాగారు. కొంతమంది వ్యక్తులు తన ఎదుగుదల ను చూసి తట్టుకోలేక ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 70 సంవత్సరాల వయసులో లైంగిక వేధింపులకు ఎలా పాల్పడతానని.. దానికి ఆరోగ్యం కూడా సహకరించదని ఆదిమూలం వివరించారు. తనకు గుండె సంబంధిత వ్యాధి ఉందని … ఇప్పటికి దానికోసం మందులు వాడుతున్నానని.. అలాంటి వ్యక్తినైన తను లైంగిక వేధింపులకు ఎలా పాల్పడతానని ఆయన ప్రశ్నించారు. ఆ వీడియోలు ఎవరో సృష్టించినవని.. అలాంటి పనులు చేయాల్సిన ఖర్మ తనకు లేదని ఆదిమూలం వివరించారు. ఎప్పటికైనా తను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. గిట్టని వాళ్లు చేస్తున్న ప్రచారం ఎన్నటికైనా కాలగర్భంలో కలిసిపోతుందని ఆయన స్పష్టం చేశారు. ఆదిమూలం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారాయి. అయితే దీనిపై ఆ ఆరోపణలు చేసిన మహిళ ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.