https://oktelugu.com/

Chandrababu Naidu: విజనరీ చంద్రబాబు వేసే వారి నాట్లు అలాగే ఉంటాయి..

సాధారణంగా వరి నాట్లను బురద పొలంలో వేస్తుంటారు.. దమ్ము చేసి ఆ తర్వాత నాట్లు వేస్తారు. అయితే గతంలో చంద్రబాబు రాయలసీమ ప్రాంతంలో పర్యటించినప్పుడు మెరక పొలంలో నాట్లు వేశారు. అయితే ఇది వైసీపీ శ్రేణులకు ఇప్పుడు తప్పుగా తోస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 15, 2024 / 10:05 PM IST

    Chandrababu Naidu

    Follow us on

    Chandrababu Naidu: ఏపీలో వైసిపి అధికారాన్ని కోల్పోయింది. గత ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ… ఈసారి 11 స్థానాలకే పరిమితమైపోయింది. దీంతో ప్రతిపక్ష హోదా కూడా దూరమైంది. ఈ క్రమంలో దూరమైన ప్రజలను దగ్గర చేసుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తోంది. ఈ క్రమంలో పార్టీ సోషల్ మీడియాను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే క్రమంలో వైసీపీ అనుకూల నెటిజన్లు గతంలో ఫోటోలను వెతికి మరీ ట్రోల్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ఆధ్వర్యంలోని టిడిపి ప్రభుత్వం చేసిన తప్పులను బయటికి తీస్తున్నారు. దీనివల్ల లాభం జరుగుతుందా? నష్టం జరుగుతుందా? అనే విషయాలను పక్కనపెడితే.. జనాల నోళ్ళల్లో నానాలని వైసిపి శ్రేణులు తీవ్రంగా ఆరాటపడుతున్నాయి.

    మెరక పొలంలో నాట్లు..

    సాధారణంగా వరి నాట్లను బురద పొలంలో వేస్తుంటారు.. దమ్ము చేసి ఆ తర్వాత నాట్లు వేస్తారు. అయితే గతంలో చంద్రబాబు రాయలసీమ ప్రాంతంలో పర్యటించినప్పుడు మెరక పొలంలో నాట్లు వేశారు. అయితే ఇది వైసీపీ శ్రేణులకు ఇప్పుడు తప్పుగా తోస్తోంది. ఇంకేముంది సోషల్ మీడియాలో ఈ ఫోటోను పోస్ట్ చేసింది..” పొడి నేలలో వరి నాట్లు వేయరని చెప్పలేదా రామకృష్ణా” అంటూ కామెంట్ చేసింది. దీనిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ” మాది రాయలసీమ. మా ప్రాంతంలో నాట్లు అలానే వేస్తారు. అలా వరి నారు వేసిన తర్వాత.. రెండు రోజులకు నీళ్లు వదులుతారు. అలా చంద్రబాబు నాటు వేయడం సరైనదే. దాన్ని మీరు ఎందుకు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఇది సరైనది కాదంటూ” టిడిపి శ్రేణులు గట్టిగా కౌంటర్ ఇస్తున్నాయి.

    వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయంటే..

    మరోవైపు వైసీపీ శ్రేణులు టిడిపి శ్రేణులకు దీటుగానే బదులిస్తున్నాయి. “వరి నాట్లు అంటే దమ్ము చేయాలి. ఆ తర్వాతే నాట్లు వేయాలి. కానీ మీ చంద్రబాబు గారు విజినరీ కదా. ఆయన వేసే నాట్లు అలాగే ఉంటాయి. మెరక పొలంలో ఎవరైనా నాట్లు వేస్తారా? అలా నాట్లు వేస్తే వరి పైరు ఎదుగుతుందా? చంద్రబాబు నాయుడు ఏం చేసినా ఎల్లో మీడియాకు గొప్పగానే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు వేసే బిస్కెట్లు ఎల్లో మీడియాకు కావాలి. ఆయన మెరక పొలంలో నాట్లు వేసినా.. గ్రాఫిక్స్ లో దానిని మాగాణిగా మార్చేయగలరు. ఇలాంటివి చూసే చూసే ఆంధ్ర ప్రజలు 2019 ఎన్నికల్లో దిమ్మ తిరిగిపోయే రిజల్ట్ ఇచ్చారని”వైసీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. మొత్తానికి ఎన్నికలు ముగిసినప్పటికీ అటు టిడిపి, ఇటు వైసిపి శ్రేణులు సోషల్ యుద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రెండు పార్టీల సోషల్ మీడియా విభాగాలు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు. చూడబోతే ఎన్నికల నాటి పరిస్థితులు మళ్లీ ఏపీలో కనిపిస్తున్నాయి.