Kumki Elephants : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( AP deputy CM Pawan Kalyan) కృషి ఫలించనుంది. ఏపీలో చాలా జిల్లాల్లో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంటలకు నష్టం చేకూరుస్తున్నాయి. ప్రాణాలు కూడా తీస్తున్నాయి. వాటి నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా ఫలితం లేకపోతోంది. ఈ తరుణంలో కూటమి అధికారంలోకి వచ్చింది. కీలకమైన మంత్రిత్వ శాఖలను దక్కించుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ పరిస్థితుల్లో ఏనుగుల సమస్య ఆయన దృష్టికి వచ్చింది. ఈ ఏనుగుల గుంపును కట్టడి చేయాలంటే కుంకీ ఏనుగులు అవసరం. అవి కర్ణాటకలో ఉంటాయి. దీంతో పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి అక్కడి ఏనుగులను రప్పించే ప్రయత్నం చేశారు. ఈనెల 21న కర్ణాటక నుంచి 6 కుంకి ఏనుగులు ఏపీకి రానున్నాయి.
Also Read : గ్రేటర్ విశాఖలో డిప్యూటీ మేయర్ చిచ్చు!
* దేశవ్యాప్తంగా డిమాండ్..
కర్ణాటకలోని కుంకీ ఏనుగులకు( Kumki elephants ) దేశంలోనే అధిక డిమాండ్ ఉంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరాఖండ్ తో సహా అనేక రాష్ట్రాలకు కర్ణాటక కుంకీ ఏనుగులు పంపిస్తుంటుంది. ఇప్పుడు ఏపీకి కూడా 6 ఏనుగులు ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. ఈనెల 21న ఈ 6 ఏనుగులు ఏపీకి రానున్నాయి. గత ఏడాది ఆగస్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ తో మాట్లాడారు. దీంతో వారు ఏనుగులు పంపించేందుకు అంగీకరించారు.
* పూర్తిస్థాయి శిక్షణ..
కుంకీ ఏనుగులు కూడా ఆసియా ఏనుగులే. అయితే వీటికి పూర్తి స్థాయిలో శిక్షణ( full training) అందిస్తారు. గస్తీ కాయడంతో పాటు రెస్క్యూ ఆపరేషన్ లో సాయం చేసేలా ఈ శిక్షణ ఉంటుంది. అటవీ ప్రాంతంలో ఉండే అడవి ఏనుగులు గాయపడినప్పుడు ఈ కుంకీ ఏనుగులు సాయం చేస్తుంటాయి. అంతలా వీటికి ట్రైనింగ్ ఉంటుంది. అటవీ ఏనుగులు జనావాసాల్లోకి చొరబడకుండా.. దాడులకు పాల్పడకుండా ఇవి నివారిస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే మనుషులు, అటవీ ఏనుగులకు మధ్య ఘర్షణ తలెత్తకుండా ఇవి సహాయపడతాయి. గజరాజులు అడవులకు సమీపంలో ఉండే పొలాలు, గ్రామాలపై విధ్వంసం సృష్టించకుండా ఉండేందుకు ఇవి కొంత వరకు నియంత్రిస్తాయి. ఏనుగులు అడవి బాట పట్టేలా కుంకీ ఏనుగులు సహాయపడతాయి. అందుకే దేశవ్యాప్తంగా వీటికి డిమాండ్ ఎక్కువ.
* దశాబ్దాలుగా సమస్య..
ఏపీలో ( Andhra Pradesh)దశాబ్దాలుగా ఏనుగుల సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వాలు నియంత్రించే చర్యలు చేపడుతున్నాయి కానీ.. అవి కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ బాధ్యతలు చూస్తున్న పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్య వచ్చింది. కుంకి ఏనుగులతోనే ఈ సమస్యకు చెప్పవచ్చని అధికారులు పవన్ కళ్యాణ్ కు వివరించారు. దీంతో ఆయన గత ఆగస్టులో కర్ణాటక వెళ్లారు. అక్కడి అధికారులతో పాటు సీఎంతో చర్చించారు. ఏపీకి ఎనిమిది కుంకీ ఏనుగులు అవసరం అని కోరారు. అయితే తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఆరు కుంకీ ఏనుగులు ఏపీకి పంపించేందుకు సిద్ధపడింది. ప్రధానంగా ఉత్తరాంధ్రతో పాటు చిత్తూరు జిల్లాలో ఏనుగుల ప్రభావం ఉంది. వాటిని అడవి బాట పట్టించనున్నారు.