Homeఆంధ్రప్రదేశ్‌Kodali Nani Vs Chandrababu: కొడాలి నాని వర్సెస్ చంద్రబాబు.. గుడివాడలో రచ్చ రంబోలా.. ఏం...

Kodali Nani Vs Chandrababu: కొడాలి నాని వర్సెస్ చంద్రబాబు.. గుడివాడలో రచ్చ రంబోలా.. ఏం జరుగుతోంది?

Kodali Nani Vs Chandrababu: గుడివాడలో రాజకీయాలు మారిపోతున్నాయి. అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి మధ్య ఉప్పు నిప్పులాగా వ్యవహారం కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో నిన్నటిదాకా రాజకీయాలు ప్రశాంతంగానే ఉన్నాయి. ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాంబాబు తన పనులేవో తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ ప్రాంతంలో అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని.. ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేక పోవడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. మొన్నటిదాకా ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన స్థానికంగా కాకుండా హైదరాబాదులో ఉంటున్నారు.. ఇటీవల ఆయన గుడివాడ వచ్చారు. పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు.. ప్రస్తుతం ఎమ్మెల్యే రాంబాబు సుపరిపాలనకు ముందడుగు అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ, టిడిపి నిర్వహించిన ఈ కార్యక్రమాలు కొంత దూరం మధ్యలోనే జరిగాయి.

Also Read: కోటాను చూసి వెక్కి వెక్కి ఏడ్చిన బ్రహ్మానందం… వీడియో వైరల్

కొడాలి నాని నియోజకవర్గానికి వచ్చిన విషయం తెలుసుకున్న కొంతమంది ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు..” కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే ఆయన బూట్లు పాలిష్ చేస్తాను అని చెప్పావు. కుప్పంలో గెలవడమే కాదు.. ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన బూట్లకు పాలిష్ చేస్తావా.. కొడాలి నాని.. దీనికి నువ్వు సిద్ధంగా ఉన్నావా .. ఇట్లు గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు” అంటూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ వివాదానికి కారణమైంది. ఆ ఫ్లెక్సీ తమ మనోభావాలను దెబ్బతీసిందని చెబుతూ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పోటీగా “బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ” పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో అటు టిడిపి, ఇటు వైఎస్ఆర్సిపి నాయకుల మధ్య వాగ్వాదం చెలరేగింది.. ఏకంగా నాయకులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు.. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరు పార్టీలకు చెందిన నాయకులు పోటాపోటీకి కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం ఇక్కడ వివాదానికి కారణమైంది.. చివరికి అది వాగ్వాదానికి దారితీసింది.

వాస్తవానికి నిన్నటి వరకు కూడా గుడివాడలో రాజకీయ వాతావరణం ప్రశాంతంగానే ఉంది.. కొడాలి నాని నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఆయన ఆరోగ్యం కూడా ఇటీవల అంత బాగాలేదు. శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆయన అనుచరులలో కొంతమంది నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. వారి వారి కార్యకలాపాలలో బిజీగా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే అధికారిక పర్యటనలతో ఆయన కూడా బిజీగానే ఉంటున్నారు. అయితే ఎప్పుడైతే వైసిపి కార్యకర్తల సమావేశానికి నాని వచ్చారో.. అప్పుడే టిడిపి నాయకులు ఒక్కసారిగా స్పందించారు. ఇన్ని సంవత్సరాలుగా తమను ఇబ్బంది పెట్టారని.. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చిందని వారంటున్నారు. అంతేకాకుండా తమ అనుభవించిన బాధ వైఎస్ఆర్సిపి నాయకులు కూడా అనుభవించాలని వారు అంటున్నారు.

మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాదు గాని.. ప్రతీకార రాజకీయాలు చేయడం ఏంటని వైసిపి కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే దానికి తగ్గట్టుగానే సమాధానం చెబుతామని వారు అంటున్నారు. మొత్తానికి అటు టిడిపి, ఇటు వైఎస్ఆర్సిపి మధ్య జరుగుతున్న వాగ్వాదం గుడివాడను మరోసారి వార్తల్లో నిలిపింది. అక్కడ పరిస్థితి అదుపు తప్పకుండా ఉండడానికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.. నాయకుల కదలికలపై నిఘా కొనసాగిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular