Nimisha Priya Case: రోజులు గడిచిపోతున్నాయి..క్షణక్షణం ఉత్కంఠ.. ఏం జరుగుతుందోననే ఆందోళన.. ఆమె ప్రాణాలు దక్కుతాయా.. యెమెన్ ప్రభుత్వం కనికరిస్తుందా.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతున్నాయి.
యెమెన్ ప్రాంతంలో భారతీయ నర్స్ నిమిషప్రియ మరణ శిక్షకు గురైంది. మరో మూడు రోజుల్లో ఆమెకు మరణ దండన విధిస్తారు.. ఆ దేశానికి చెందిన ఓ పౌరుడి హత్య కేసులో నిమిషప్రియ నిందితురాలి గా ఉంది. అప్పటినుంచి ఆమెను కాపాడేందుకు కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అన్ని ప్రయత్నాలు ఒక్కొక్కటిగా విఫలమవుతుంటే.. చివరి అవకాశం గా నిమిషప్రియ కుటుంబం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పరిహారం కింద డబ్బులు ఇవ్వడానికి సిద్ధమయింది.. ఇదే క్రమంలో సేవ్ నిమిషప్రియ యాక్షన్ కౌన్సిల్ అనే సంస్థ కూడా ఏర్పాటయింది.. ఈ సంస్థలో పనిచేస్తున్న ఓ వ్యక్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మృతుడి కుటుంబం నిమిషప్రియకు క్షమాభిక్ష పెడితేనే ఆమె బతికి బట్ట కడుతుందని.. లేకపోతే మరణశిక్ష తప్పదని అంటున్నారు. నిమిష ప్రియకు విధించిన మరణ దండనను నిరోధించడానికి యెమెన్ రాజధాని సనా వేదికగా చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ చర్చలు సఫలీకృతం కావాలని నిమిషప్రియ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.
Also Read: కోటాను చూసి వెక్కి వెక్కి ఏడ్చిన బ్రహ్మానందం… వీడియో వైరల్
నిమిషప్రియ తరఫున శామ్యూల్ జెరోమ్ అనే వ్యక్తి యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చర్చలు జరుగుతున్నప్పటికీ ఎటువంటి అంశాలు తెరపైకి వచ్చాయి.. చనిపోయిన వ్యక్తి కుటుంబం ఎలాంటి షరతులు విధిస్తోంది.. నిమిష ప్రియ కుటుంబం నుంచి ఎటువంటి అంగీకారం వస్తోంది అనే ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం రాలేదు. ఒకవేళ చనిపోయిన వ్యక్తి కుటుంబం అంగీకారం తెలిపితే.. ఏకంగా మిలియన్ డాలర్లు చెల్లిస్తామని నిమిషప్రియ కుటుంబం తరఫున చర్చలు జరుపుతున్న వ్యక్తి తన సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
యెమెన్ దేశంలో షరియా చట్టం అమల్లో ఉంటుంది. ఈ చట్టం ప్రకారమే అక్కడ న్యాయ వ్యవస్థ కూడా పనిచేస్తుంది. ఒకవేళ ఇటువంటి కేసుల్లో బాధిత కుటుంబం పరిహారం కింద కొంత మొత్తంలో నిందితుల నుంచి స్వీకరించి.. క్షమాభిక్షకు గనుక సంసిద్ధతను వ్యక్తం చేస్తే మరణ శిక్షను రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది. సినిమాల్లో మాదిరిగానే అక్కడ మరణశిక్ష చివరి నిమిషంలో కూడా క్షమాభిక్ష ప్రసాదించడానికి అక్కడ చట్టాలు అనుకూలంగా ఉంటాయి.. అయితే నిమిషప్రియ విషయంలో అద్భుతం జరుగుతుందని ఆమె కుటుంబ సభ్యులు భావిస్తున్నారు..” నిమిష ప్రియ విషయంలో భారత ప్రభుత్వం కూడా చర్చలు జరుపుతోంది. దీనికి సంబంధించి యెమెన్ లో ఉన్న మన దేశ ప్రతినిధులతో సంప్రదింపులు మొదలుపెట్టింది. అయితే ఇవి సఫలీకృతం కావాలని అందరూ కోరుకుంటున్నారు ఒకవేళ చనిపోయిన వ్యక్తి కుటుంబం పరిహారం తీసుకోవడానికి అంగీకరిస్తే నిమిషప్రియకు మరణ శిక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే నిమిషప్రియ ఉదంతంలో ఏదో ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని” జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.