Kesineni Nani : రాజకీయాల నుంచి తప్పుకున్న విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని( Kesineni Nani) తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. సొంత తమ్ముడు కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని చేతిలో ఓటమి చవిచూశారు. అక్కడ నుంచి మనస్థాపంతో రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అయితే ఇటీవల ఉన్నఫలంగా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా తన సోదరుడు, ఎంపీ చిన్ని సన్నిహితుడికి భూమి కేటాయింపు పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. విశాఖలో ఓ ఐటీ సంస్థకు భూ కేటాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏకంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. అంతటితో ఆగకుండా వరుసగా విజయవాడ ఎంపీ అయిన తన సోదరుడు చిన్నిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
Also Read : సతీ సమేతంగా ఢిల్లీకి చంద్రబాబు.. కారణం అదే!
* భూ కేటాయింపుల పై రచ్చ
విశాఖను ఐటి హబ్ గా ( Visakha IT hub )మార్చాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం. అందులో భాగంగా భారీగా ఐటీ సంస్థలను విశాఖకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖలో ఉర్సా క్లస్టర్ అనే సంస్థకు చంద్రబాబు భూ కేటాయింపులు చేసింది. దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 3 వేలకోట్ల విలువైన భూములను అప్పనంగా స్టార్టప్ సంస్థకు ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్న టిడిపి ప్రభుత్వం.. తాజాగా అమెరికాలో ఉన్న కంపెనీ ప్రమోటర్లతో జూమ్ కాల్ ఏర్పాటు చేయించి తమకు అనుకూలమైన జర్నలిస్టులను, పార్టీ నేతలను అందులో జాయిన్ అయ్యే అవకాశం కల్పించింది. అనుమానాల నివృత్తికి గాను ఇలా చేసే క్రమంలో మరింత అనుమానాలకు ఆజ్యం పోసింది.
* బెజవాడ రాజకీయాలు హీట్
అయితే విజయవాడ( Vijayawada) రాజకీయాల్లో ఇప్పుడు కేసినేని సోదరులు హాట్ టాపిక్ అవుతున్నారు. విశాఖలో ఐటీ సంస్థకు కేటాయింపులు చేయడానికి తప్పు పట్టారు మాజీ ఎంపీ నాని. అదే సమయంలో నాని చేసిన ఆరోపణలపై సైకో అంటూ ఎంపీ చిన్ని రెచ్చిపోయారు. దీనిపై ఈరోజు నాని మళ్లీ స్పందించారు. ఎవరు ఎన్ని జూమ్ మీటింగులు పెట్టి వివరణలు ఇచ్చినా.. తనను ఎవరు ఎన్ని బూతులు తిట్టినా.. సైకో అన్నా .. నో ప్రాబ్లం అని తేల్చి చెప్పారు. అంతటితో ఆగకుండా వైజాగ్ ఈజ్ ఫర్ సేల్ అంటూ నాని తన సోదరుడికి కౌంటర్ ఇచ్చారు. అలాగే ఈ డీల్ కు సంబంధించి ఒక వెబ్ సైట్ లో ఉన్న పత్రాలను కూడా తన ఫేస్బుక్ పోస్టుకు నాని జత చేశారు. తద్వారా ఎవరు ఏమనుకున్నా వైజాగ్ ను అమ్మకానికి పెట్టేసారు అంటూ ఆరోపణలు గుప్పించారు. దీనిపై ఎంపి కేసినేని చిన్ని ఎలా స్పందిస్తారో చూడాలి.
* నాని రీఎంట్రీ పై అనుమానాలు..
మొన్నటికి మొన్న సీఎం చంద్రబాబు( CM Chandrababu) జన్మదినం నాడు స్పందించారు కేసినేని నాని. చంద్రబాబుతో పనిచేసిన రోజులను గుర్తు చేశారు. అయితే గత కొన్ని రోజులుగా నాని టిడిపిలోకి రీఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే దీనిపై పలుమార్లు మాట్లాడారు ఎంపీ చిన్ని. అటువంటి పరిస్థితి ఉండదని తేల్చి చెప్పారు. అప్పటినుంచి మాజీ ఎంపీ నాని సమయం కోసం వేచి చూశారు. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే చిన్ని సన్నిహితుడి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులను తప్పుపట్టారు. దానిపై పట్టు బిగిస్తూ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు సోదరుల మధ్య వివాదం తెలుగుదేశం పార్టీ కి ఇబ్బందికరంగా మారింది.
Also Read : ఏపీలో కానిస్టేబుల్ తుది రాత పరీక్షకు ఐదు కేంద్రాలు!