MP Avinash Reddy – CBI : వివేకా హత్య కేసులో కీలక పరిణామం. ఈ రోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. దీంతో ఎటువంటి సంచలనం నమోదుకాబోతుందా? అన్న చర్చ సాగుతోంది. ఇప్పటివరకూ అవినాష్ ఆరుసార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. తొలుత ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు. కానీ అవినాష్ హాజరుకాలేదు. తనకు ముందస్తు షెడ్యూల్ కార్యక్రమాలు ఉన్నందున హాజరుకాలేనని సీబీఐకి లేఖ రాశారు. హైదరాబాద్ లోనే మీడియాతో మాట్లాడుతూ విచారణకు హాజరుకాలేనని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే కేసు విచారణలో జాప్యానికి అవినాష్ రెడ్డే కారణమని అటు సీబీఐ, ఇటు వివేకా కుమార్తె సునీత ఆరోపిస్తున్నారు. విచారణ సమయంలో గైర్హాజరు కావడం, కోర్టుల్లో పిటీషన్ల మీద పిటీషన్లు వేయడం వల్ల ఆలస్యమవుతుందని కోర్టుకు వివరించారు. అదే సమయంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణను వెకేషన్ బెంచ్ కి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించినా విచారణ తేదీ ఖరారు కాలేదు. అటు సీబీఐ ఎంపీ అవినాశ్ పై కీలక అభియోగాలు నమోదు చేసింది. సహ నిందితుడుగా పేర్కొంది. హత్య ఘటనలో ఆధారాల టాంపరింగ్ చేసారని సీబీఐ ఆరోపిస్తోంది.
అదే సమయంలో సీబీఐ విచారణను తప్పుపట్టేలా అవినాష్ వ్యాఖ్యానించారు. పలు కొత్త అంశాలను తెర పైకి తీసుకొచ్చారు. రాజకీయంగా తమ పైన కుట్ర జరుగుతోందని వాదిస్తున్నారు. వివేకా రెండో భార్య వివాదం..ఆస్తుల వ్యవహారాలను ప్రస్తావిస్తున్నారు. అసలు హత్య రోజు లేఖ గురించి తేల్చాలని కోరుతున్నారు.ఈ నేపథ్యంలో వివేకా కుమార్తె సునీతతో పాటుగా ఆమె భర్త రాజశేఖర రెడ్డిని సీబీఐ పలు మార్లు విచారణ చేసింది. తాజాగా అవినాశ్ ముఖ్య అనుచరులను సీబీఐ విచారణ చేసింది. అటు అవినాశ్ తండ్రి భాస్కర రెడ్డి, ఉదయ కుమార్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు ఏడోసారి అవినాష్ హాజరవుతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అరెస్ట్ తప్పదా అన్న ప్రచారం సాగుతోంది.
ఈ రోజు జరిగే విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు పులివెందులలోని ఆయన ఇంటికివెళ్లి, అక్కడున్న వారికి నోటీసు ప్రతులు అందజేశారు. ఈ నోటీసుల నేపథ్యంలో అవినాశ్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేక మరేదైనా కారణం చూపించి సమయం కోరుతారా అనే ఆసక్తి కర చర్చ సాగుతోంది. సీబీఐ ముందుకు విచారణకు వస్తే ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది. మరోవైపు సీబీఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు సమీపిస్తోంది. దీంతో వీలైనంత త్వరగా కేసు ముగించాలని సీబీఐ కసిగా పనిచేస్తోంది. సంచలనాలకు తెరతీస్తుందా అన్న చర్చ నడుస్తోంది. మరికొద్ది గంటల్లో దీనిపై క్లారిటీ రానుంది.