Karnataka Politics: కర్ణాటక పాలిటిక్స్ : బిజెపి గుడ్డిగా పక్కన పెడితే.. యడ్డి పక్కా ప్లాన్ తో పడగొట్టాడు

కారణాలు ఏమిటో తెలియదు కానీ కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా యడ్యూరప్పను భారతీయ జనతా పార్టీ తొలగించింది. ఆయన స్థానంలో బసవరాజ్ బొమ్మై ను ముఖ్యమంత్రిగా నియమించింది. అంతేకాదు పార్టీకి సంబంధించి యడ్యూరప్ప ప్రాధాన్యాన్ని చాలా వరకు తగ్గించింది.

Written By: Bhaskar, Updated On : May 19, 2023 11:50 am

Karnataka Politics

Follow us on

Karnataka Politics: విజయానికి కారణాలు అవసరం లేదు. అపజయానికి మాత్రం పోస్టుమార్టం అవసరం.. లేకుంటే ఓటమి ఎందుకు ఎదురయిందో తెలుసుకునే అవకాశం ఉండదు.. కర్ణాటక ఎన్నికలు ముగిసాయి. కాంగ్రెస్ పార్టీ కానీ విని ఎరుగని స్థాయిలో మెజారిటీ సాధించింది. సిద్ధరామయ్య ప్రభుత్వం రేపు మాపో కొలువు దీరబోతోంది. కానీ అంతటి ప్రధానమంత్రి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ, సాక్షాత్తు నరేంద్ర మోదీ అన్ని తానై ప్రచారం నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఎందుకు ఓడిపోయింది? బంపర్ మెజార్టీతో రెండవసారి అధికారం సాధిస్తాం అన్న నేతల మాట ఎందుకు చెల్లుబాటు కాకుండా పోయింది? వేల కోట్ల అభివృద్ధి పనులు చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీని ప్రజలు ఎందుకు నమ్మలేదు? హిజాబ్ వివాదం, అమూల్ పాలు, బజరంగబలి నినాదం ఎందుకు భారతీయ జనతా పార్టీని ఒడ్డున పడేయలేదు? ఏరి కోరి ముఖ్యమంత్రిని చేస్తే బసవరాజ్ బొమ్మై ఎందుకు ప్రేక్షక పాత్రకు పరిమితం కావలసి వచ్చింది? వీటన్నింటికీ సంబంధించి వేళ్ళు మొత్తం ఒకే వ్యక్తి వైపు చూపిస్తున్నాయి.

రివెంజ్ తీర్చుకున్నాడు

కారణాలు ఏమిటో తెలియదు కానీ కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా యడ్యూరప్పను భారతీయ జనతా పార్టీ తొలగించింది. ఆయన స్థానంలో బసవరాజ్ బొమ్మై ను ముఖ్యమంత్రిగా నియమించింది. అంతేకాదు పార్టీకి సంబంధించి యడ్యూరప్ప ప్రాధాన్యాన్ని చాలా వరకు తగ్గించింది. ఇదే సమయంలో కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో తన పాత్ర పరిధిని పెంచుకుంది. ఇది సహజంగానే యడ్యూరప్పకు నచ్చలేదు. తనను తొలగించారనే కోపాన్ని నేరుగా ప్రదర్శించలేదు. నేరుగా ప్రదర్శిస్తే అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో యడ్యూరప్పకు తెలుసు.. అందుకే చాప కింద నీరు లాగా తన పని తాను చేసుకుంటూ పోయాడు. అది ఎలాంటి పని అంటే ఏకంగా మోదీని ధిక్కరించేంత.. ఇన్నాళ్లు సుప్త చేతనావస్థలో ఉన్న ప్రతిపక్షాలు ప్రశ్నించేంత.. ఫలితంగా కాంగ్రెస్ లైన్లోకి వచ్చింది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏకంగా మోదీకే సవాల్ విసురుతోంది. 2024 ఎన్నికల్లో అధికారం మాదే అని చెబుతోంది.

ఇంతకీ యడ్డి ఏం చేశాడు?

తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత యడ్యూరప్ప అధిష్టానం మీద కోపం పెంచుకున్నాడు. పైగా తనకు సంబంధించిన ఎమ్మెల్యేలను మంత్రివర్గం నుంచి తొలగించడంతో మరింత ఆగ్రహం ఆయనలో పాతుకుపోయింది. కీలు ఎరిగి వాత పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇదే క్రమంలో ఎన్నికల ముందు కర్ణాటక ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు భారీగా మంజూరు చేసింది. అయితే ఈ పనులకు సంబంధించి తనకు చెందిన వాళ్లతో కాంట్రాక్టులు వేయించాడు. పనులు కూడా దక్కించుకున్నాడు. అయితే ఆ పనులను సకాలంలో పూర్తి చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించాడు. దీంతో అభివృద్ధి పనులు పూర్తికాక ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. ఇదే సమయంలో ప్రభుత్వం కాంట్రాక్టులను హెచ్చరించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు యడ్యూరప్ప షాడో లాగా ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వ్యక్తులకు తోడ్పాటు ఇవ్వడంతో భారతీయ జనతా పార్టీ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది అంతిమంగా ఎన్నికల్లో ప్రభావం చూపించింది.

మోదీని ప్రమోట్ చేసింది

ఇలాంటి సమయంలో స్థానిక నాయకత్వాన్ని బుజ్జగించే ప్రయత్నం చేయాల్సిన అధినాయకత్వం కేవలం ప్రధానమంత్రిని తెరపైకి తీసుకొచ్చే ప్రణాళికలు రూపొందించింది. ఇలాంటివి ఉత్తరాది రాష్ట్రాల్లో వర్క్ అవుట్ అవుతాయి కానీ.. దక్షిణాది రాష్ట్రాల్లో అలా ఉండదు. సో దీనివల్ల స్థానికంగానే కర్ణాటక రాష్ట్ర నాయకత్వం ఒకింత అసహనానికి గురైంది.. చివరికి అది భారతీయ జనతా పార్టీని ఓడించింది. స్థూలంగా చెప్పుకోవాలంటే పార్టీ ఓటమికి పోస్టుమార్టం విషయంలో చాలా విషయాలు తెరపైకి వస్తున్నాయి కానీ.. ఈ ఓటమికి ప్రధాన కారణమైన యడ్యూరప్పను మాత్రం భారతీయ జనతా పార్టీ ఏమీ అనడం లేదు. బహుశా తన తప్పు ఏంటో అధినాయకత్వానికి ఇప్పుడు తెలిసి వచ్చింది కాబోలు.